సెకండ్ హ్యాండ్‌లో కొన్న Fridge.. శుభ్రం చేస్తుండగా నోట్ల కట్టలు చూసి షాక్.. చివరికి...!

ABN , First Publish Date - 2021-08-16T19:22:03+05:30 IST

అదృష్టం ఎవరి తలుపు ఎప్పుడు తడుతుందో చెప్పడం చాలా కష్టం. తాజాగా ఇది ఫ్రిడ్జ్‌లో దాక్కుని మరీ.. దక్షిణ కొరియాలోని ఓ వ్యక్తిని వరించింది. అయితే ఆ వ్యక్తి మాత్రం.. నాది కానిది.. నయా పైసా కూడా నాకొద్దు అంటున్నాడు. ప్రస్తుతం ఈ అంశం స్థానికంగా చర్చనీయాంశం అయింది

సెకండ్ హ్యాండ్‌లో కొన్న Fridge.. శుభ్రం చేస్తుండగా నోట్ల కట్టలు చూసి షాక్.. చివరికి...!

ఇంటర్నెట్ డెస్క్: అదృష్టం ఎవరి తలుపు ఎప్పుడు తడుతుందో చెప్పడం చాలా కష్టం. తాజాగా ఇది ఫ్రిడ్జ్‌లో దాక్కుని మరీ.. దక్షిణ కొరియాలోని ఓ వ్యక్తిని వరించింది. అయితే ఆ వ్యక్తి మాత్రం.. నాది కానిది.. నయా పైసా కూడా నాకొద్దు అంటున్నాడు. ప్రస్తుతం ఈ అంశం స్థానికంగా చర్చనీయాంశం అయింది. ఆ వ్యక్తిపై స్థానికులు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. విషయంలోకి వెళితే... 


ఉత్తర కొరియాలోని జెజు ద్వీపానికి చెందిన ఓ మిడిల్ క్లాస్ వ్యక్తి.. తాను కష్టపడి సంపాదించుకున్న డబ్బుతో రిఫ్రిజిరేటర్‌ను కొనుగోలు చేయాలని చాలా రోజులుగా అనుకుంటున్నాడు. ఈ క్రమంలో అతను కొంత డబ్బును పోగు చేసుకున్నాడు. అయితే ఆ మొత్తంతో కొత్త ఫ్రిడ్జ్‌ను కొనుగోలు చేయలేనని తెలుసుకున్నాడు. దీంతో ప్రముఖ ఈ కామర్స్ వెబ్‌సైట్‌లో సెకండ్ హ్యాండ్ రిఫ్రిజ్రేటర్‌ను అర్డర్ చేశాడు. ఈ క్రమంలో కొద్ది రోజుల క్రితమే ఆర్డర్ ఇచ్చిన ఫ్రిడ్జ్ అతని ఇంటికొచ్చింది. ఈ నేపథ్యంలో తాజాగా ఆయన ఫ్రిడ్జ్‌ను శుభ్రం చేసేందుకు రెడీ అయ్యాడు. క్లీన్ చేస్తున్న తరుణంలో రిఫ్రిజ్‌రేటర్ అడుగున ప్లాస్టిక్ కవర్‌ను గుర్తించాడు. దాన్ని నిశితంగా పరిశీలించిన అతను.. ఒక్కసారిగా షాకయ్యాడు. కట్టల కొద్ది ఉన్న 1.3మిలియన్ డాలర్ల డబ్బును చూసి.. కొద్దిగా కంగారు పడ్డాడు. వేరే ఎవరైనా అయితే ఆ డబ్బును తీసుకుని గుట్టుచప్పుడు కాకుండా దాచుకునే వారేమో.. కానీ అతను మాత్రం అలా చేయలేదు. 



తనది కానిది ఎంత డబ్బైనా తనకు అవసరం లేదనుకున్నాడు. అందుంలోచి నయాపైసా కూడా తీయకుండా.. మొత్తాన్ని పట్టుకెళ్లి పోలీస్ స్టేషన్‌లో అప్పగించాడు. అంతేకాకుండా దాన్ని సొంతదారులకు ఇచ్చేయమని చెప్పి, అక్కడ నుంచి వచ్చేశాడు. దీంతో ఈ విషయం స్థానికంగా చర్చనీయాంశం అయింది. విషయం తెలుసుకుని.. ఆ వ్యక్తిపై స్థానికులు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇదిలా ఉంటే.. దీనిపై పోలీసులు స్పందిస్తూ.. సదరు వ్యక్తి ఆగస్ట్ 6న డబ్బును స్టేషన్‌లో అప్పగించారని.. అయితే ఇప్పటి వరకు ఎవరూ దాని కోసం రాలేదని పేర్కొన్నారు. ఇంకొన్ని రోజులు చూసి, ఆ మొత్తాన్ని(భారత కరెన్సీలో రూ.96లక్షలు) తిరిగి అతనికే ఇవ్వనున్నట్టు పేర్కొన్నారు. అయితే ఆ మొత్తంలో 22శాతం డబ్బును అతను ట్యాక్స్ రూపంలో చెల్లించాల్సి ఉంటుందని వెల్లడించారు. కాగా.. సదరు వ్యక్తి సెకండ్ హ్యాండ్ ఫ్రిడ్జ్‌ను ఎంతకు కొనుగోలు చేశాడనే విషయం పై సమాచారం లేదు. 


Updated Date - 2021-08-16T19:22:03+05:30 IST