Abn logo
Oct 29 2020 @ 16:32PM

అమెరికా ఉపాధ్యక్ష రేసులో మరో భారత సంతతి వ్యక్తి !

Kaakateeya

న్యూయార్క్: అమెరికా చరిత్రలోనే తొలిసారిగా ఓ భారత సంతతి మహిళ ఉపాధ్యక్ష రేసులో నిలిచిన విషయం తెలిసిందే. డెమొక్రటిక్ పార్టీ తరఫున కమలా హ్యారిస్ ఉపాధ్యక్ష బరిలో ఉన్నారు. కమలా కాకుండా మరో భారత సంతతి వ్యక్తి కూడా ఈసారి ఎన్నికల్లో ఉపాధ్యక్ష రేసులో ఉన్నారు. సునీల్ ఫ్రీమ్యాన్ అనే భారతీయుడు ఈ అధ్యక్ష ఎన్నికల్లో పార్టీ ఫర్ సోషలిజం అండ్ లిబరేషన్(పీఎస్ఎల్) తరఫున ఉపాధ్యక్ష పదవి కోసం పోటీపడుతున్నారు. ఆయన బలమైన రాడికల్ సోషలిస్ట్ ఎజెండా గల అభ్యర్థి. ఇక ఇటీవల కమలాను అధ్యక్షుడు ట్రంప్ సోషలిస్ట్‌గా పేర్కొంటూ హైలైట్ చేసిన సంగతి తెలిసిందే. ఒకవేళ బైడెన్ గెలిచిన రెండు నెలలు తిరక్కుండానే సోషలిస్ట్ కమలా అధ్యక్ష పీఠాన్ని లాక్కొవడం ఖాయమని కూడా ట్రంప్ జోస్యం చెప్పారు.

కాగా, ఫ్రీమ్యాన్ తల్లి ఫ్లోరా నవిత భారతదేశానికి చెందినవారు. తండ్రి చార్లెస్ ఫ్రీమ్యాన్‌ది అమెరికా. వారణాసిలోని శరణార్థి శిబిరంలో నవిత ఉపాధ్యాయురాలిగా ఉన్నప్పుడు అమెరికన్ పీస్ గ్రూపు తరఫున భారత సందర్శనకు వచ్చిన చార్లెస్ ఆమెను తొలిసారి కలిశారు. ఆ తర్వాత వారిద్దరూ వివాహంతో ఒకటయ్యారు. ఇక తన తల్లి ఎప్పుడూ శారీ ధరిస్తారని, దశాబ్దాలుగా అమెరికాలో నివసిస్తున్నప్పటికీ ఆమె భారతీయ పౌరసత్వాన్ని వదులుకోలేదని సునీల్ ఓ మీడియా సంస్థతో మాట్లాడుతూ తెలిపారు. తన తల్లి న్యూఢిల్లీ, లక్నోలో పెరిగారని... అక్కడి ఇసాబెల్ థోబర్న్ కళాశాల నుండి ఆమె పట్టభద్రురాలైన విషయాన్ని కూడా ఈ సందర్భంగా ఆయన గుర్తుచేశారు. ఇక వాషింగ్టన్‌లో పుట్టి పెరిగిన తాను 10 ఏళ్ల వయసు ఉన్నప్పుడు భారదేశానికి వెళ్లానని, అవి తన జీవితంలో అత్యంత మధుర క్షణాలని సునీల్ చెప్పారు.  


కాగా, అగ్రరాజ్యం అమెరికా ఎన్నికలకు కేవలం ఐదు రోజుల గడువు మాత్రమే ఉంది. ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండడంతో అధికార రిపబ్లికన్ పార్టీ, ప్రతిపక్ష డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థులు, కార్యకర్తలు ముమ్మర ప్రచారంతో హోరెత్తిస్తున్నారు. ఇరు పార్టీల అధ్యక్ష అభ్యర్థులు డొనాల్డ్ ట్రంప్, జో బైడెన్ జోరుగా ఎన్నికల ర్యాలీలలో పాల్గొంటున్నారు. ఇక ఈసారి ఎన్నికలు విభిన్న పరిస్థితుల మధ్య జరుగుతున్న విషయం తెలిసిందే. కరోనా సంక్షోభం, నల్లజాతీయుల నిరసన పోరు ఇలా ఎన్నో విషయాలు ఈ అధ్యక్ష ఎన్నికల్లో భాగమయ్యాయి. దీంతో ఈ ఎన్నికల కోసం ప్రపంచ దేశాలు ఎంతో ఆసక్తికరంగా ఎదురుచూస్తున్నాయి. సర్వే ఫలితాలు బైడెన్‌కు అనుకూలంగా ఉన్నా... చివరి వరకు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి. 2016 ఎన్నికల్లో కూడా మొదట అంతా డెమొక్రటిక్ అభ్యర్థి హిల్లరీ క్లింటన్ గెలవడం ఖాయం అనుకున్నారు. ఏకంగా 30 లక్షల ఓట్లు అధికంగా వచ్చిన హిల్లరీ... సీట్ల సంఖ్యపరంగా వెనుక పడిపోవడంతో చివరకు డొనాల్డ్ ట్రంప్ అధ్యక్షుడయ్యారు.

Advertisement
Advertisement