Advertisement
Advertisement
Abn logo
Advertisement

సెకండ్‌ ఇంటర్‌ పరీక్షలూ రద్దు?

రాష్ట్ర ప్రభుత్వం యోచన..

సీబీఎస్‌ఈ 12వ తరగతి పరీక్షలను కేంద్ర ప్రభుత్వం రద్దు చేయడంతోనే!

రద్దయితే ఫస్టియర్‌ మార్కులే పరిగణనలోకి!

రద్దు చేయాలంటున్న అధ్యాపక సంఘాలు


హైదరాబాద్‌, జూన్‌ 1 (ఆంధ్రజ్యోతి): సీబీఎస్‌ఈ 12వ తరగతి పరీక్షలను కేంద్ర ప్రభుత్వం రద్దు చేసిన నేపథ్యంలో.. రాష్ట్రంలోనూ ఇంటర్‌ ద్వితీయ సంవత్సరం పరీక్షలు రద్దయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. కరోనా సెకండ్‌ వేవ్‌ నేపథ్యంలో.. మే 1 నుంచి జరగాల్సిన ప్రథమ సంవత్సరం పరీక్షలను ఇప్పటికే రద్దు చేసిన ఇంటర్మీడియట్‌ బోర్డు.. ద్వితీయ సంవత్సరం పరీక్షలను వాయిదా వేసిన విషయం తెలిసిందే. అయితే ఈ పరీక్షలను జూలై మూడో వారంలో నిర్వహిస్తామని మే 27న రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి తెలిపింది. దీనికి సంబంధించి కార్యాచరణను సైతం వివరంగా పేర్కొంది. పరీక్షను గంటన్నర సమయంలో 50 మార్కులకు నిర్వహిస్తామని, రెండు షిఫ్టుల్లో నిర్వహిస్తామని తెలిపింది. ఈ మేరకు ఇంటర్‌ బోర్డు ఏర్పాట్లు కూడా చేస్తోంది.


అయితే మంగళవారం ఢిల్లీలో ప్రధాని నరేంద్రమోదీ అధ్యక్షతన జరిగిన ఉన్నతస్థాయి సమావేశంలో సీబీఎ్‌సఈ 12వ తరగతి పరీక్షలను రద్దు చేయాలని నిర్ణయించారు. దీంతో ఇంటర్‌ ద్వితీయ సంవత్సరం పరీక్షల నిర్వహణకు ఇప్పటికే అనుమతించిన రాష్ట్ర ప్రభుత్వం పునరాలోచనలో పడింది. ఇంతకుముందు సీబీఎ్‌సఈ 10వ తరగతి పరీక్షలను కేంద్ర ప్రభుత్వం రద్దు చేయడంతో.. తెలంగాణ ప్రభుత్వం సైతం రాష్ట్రంలో పదో తరగతితోపాటు ఇంటర్‌ ప్రథమ సంవత్సరం పరీక్షలను రద్దు చేసింది. సీబీఎ్‌సఈ 12వ తరగతి పరీక్షలను కొవిడ్‌ తీవ్రత తగ్గాక నిర్వహించాలనే యోచనలో కేంద్ర ప్రభుత్వం ఉండడంతో రాష్ట్రంలో ఇంటర్‌ సెకండియర్‌ పరీక్షలను కూడా నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం భావించింది.


అయితే మంగళవారం కేంద్ర ప్రభుత్వం అకస్మాత్తుగా 12వ తరగతి పరీక్షల రద్దు నిర్ణయం ప్రకటిచడంతో.. ఇక్కడ కూడా రద్దు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలిసింది. ఎలాగూ ఈసారి జాతీయ స్థాయి ప్రవేశ పరీక్షలైన జేఈఈ, నీట్‌లలో ఇంటర్‌ వెయిటేజీ మార్కులను కేంద్రం తొలగించింది. రాష్ట్రంలోనూ ఎంసెట్‌ పరీక్షలకు ఇంటర్‌ మార్కుల 25 శాతం వెయిటేసీని తొలగించారు. ఇలాంటి పరిస్థితుల్లో కేంద్రం తీసుకున్న నిర్ణయాన్నే అనుసరించాలన్న ఆలోచనతో రాష్ట్ర ప్రభుత్వం ఉంది. 


రద్దయితే మార్కులెలా..? 

సెకండియర్‌ పరీక్షలను రద్దు చేస్తే.. మొదటి యేడాదిలో చూపిన ప్రతిభ ఆధారంగా మార్కులు కేటాయించడం తప్ప.. మరో మార్గం లేదు. సెకండియర్‌ ప్రాక్టికల్‌ పరీక్షలు ఇంకా నిర్వహించనందున.. ఫస్టియర్‌లో సాధించిన మార్కుల ఆధారంగానే కేటాయించే అవకాశాలున్నాయి. అయితే గతేడాది ఫస్టియర్‌లో ఫెయిలైన విద్యార్థులందరినీ ప్రభుత్వం పాస్‌ చేసింది. వారికి కనీస మార్కులు కేటాయించే అవకాశాలున్నాయి. కాగా, రాష్ట్రంలోనూ ఇంటర్‌ సెకండియర్‌ పరీక్షలను రద్దు చేయడమే మేలని ఉపాధ్యాయ సంఘాలు పేర్కొన్నాయి. కొవిడ్‌ నేపథ్యంలో విద్యార్థులు, తల్లిదండ్రుల్లో నెలకొన్న ఆందోళన, పరీక్షల నిర్వహణ, మూల్యాంకనం విషయాలను దృష్టిలో పెట్టుకుని కేంద్రం బాటలోనే రాష్ట్రం కూడా నడవాలని ఇంటర్‌ విద్య జేఏసీ చైర్మన్‌ మధుసూదన్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు.


కాగా, పరీక్షల నిర్వహణతో విద్యార్థుల్లో కరోనా వ్యాప్తి పెరిగే అవకాశాలుంటాయని, రాష్ట్రంలో నూ వీటిని రద్దు చేయాలని తెలంగాణ ప్రభుత్వ అధ్యాపకుల సంఘం రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు ఎం.జంగయ్య, ఎం.రామకృష్ణ గౌడ్‌ పేర్కొన్నారు. చిన్నారుల్లోనూ కొవిడ్‌ కేసులు పెరుగుతున్నందున పరీక్షలను రద్దు చేసి కేంద్రం పేర్కొన్నట్లుగానే ఆబ్జెక్టివ్‌ క్రైటీరియా ద్వారా మార్కులు కేటాయించాలని ఇంటర్‌ విద్య పరిరక్షణ సమితి కన్వీనర్‌ కొప్పిశెట్టి సురేశ్‌ విజ్ఞప్తి చేశారు.   

Advertisement
Advertisement