భార్యను వేధించడమే కాకుండా.. రెండో పెళ్లి చేసుకున్న భర్తకు...

ABN , First Publish Date - 2021-03-20T12:07:04+05:30 IST

భార్యను వేధించడమే కాకుండా, రెండో పెళ్లి చేసుకున్న భర్తకు..

భార్యను వేధించడమే కాకుండా.. రెండో పెళ్లి చేసుకున్న భర్తకు...

హైదరాబాద్/ఏఎస్‌రావునగర్‌ : భార్యను వేధించడమే కాకుండా, రెండో పెళ్లి చేసుకున్న భర్తకు.. ప్రోత్సహించిన అత్తా, ఆడపడుచులకు మల్కాజిగిరి కోర్టు శనివారం జైలు శిక్ష, జరిమానా విధించింది. ఏఎస్‌రావునగర్‌ డివిజన్‌ భవానీనగర్‌కు చెందిన ఎల్‌.భవాని అలియాస్‌ గాయత్రి(35)కి అదే ప్రాంతంలోని వరుణ్‌ఎన్‌క్లేవ్‌లో ఉండే రైల్వే ఉద్యోగి లకావత్‌ ప్రేమ్‌కుమార్‌కు 2002 నవంబర్‌ 30న వివాహం జరిగింది. వీరికి ఇద్దరు పిల్లలు. మద్యానికి బానిసైన ప్రేమ్‌కుమార్‌.. భార్య భవానిని వేధించడం మొదలు పెట్టాడు. ప్రేమ్‌కుమార్‌ తన సహోద్యోగిని కవితను 2014లో రెండో వివాహం చేసుకున్నాడు. 2016 మే 5న రాత్రి మద్యం తాగి ఇంటికి వచ్చిన ప్రేమ్‌కుమార్‌ భార్య భవానిని తీవ్రంగా కొట్టాడు. 


భరించలేని భవాని అదే రోజు కుషాయిగూడ పోలీసులకు భర్త, అత్తా, ఆడపడుచు, ప్రేమ్‌ రెండో భార్య కవితపై ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. నిందితుల ను అరెస్ట్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించారు. నాలుగేళ్లుగా విచారణ జరిపిన మల్కాజిగిరి కోర్టు ప్రధాన ముద్దాయి అయిన భర్తకు మూడేళ్లు జైలు శిక్ష, రూ. 5,500 జరిమానా, మిగతా నిందితులు ముగ్గురికి ఏడాది జైలు శిక్ష విధిస్తూ కోర్టు తీర్పును వెలువడించింది. సకాలంలో నిందితులపై పూర్తి ఆధారాలతో చార్జిషీట్‌ దాఖలు చేసిన కుషాయిగూడ పోలీసులను సీపీ మహేష్‌ భగవత్‌ అభినందించారు.

Updated Date - 2021-03-20T12:07:04+05:30 IST