బ్యాటింగ్ మెరుగయ్యేనా..?

ABN , First Publish Date - 2022-01-21T09:03:28+05:30 IST

తొలి వన్డేలో చేజేతులా ఓడిన టీమిండియా ఇప్పుడు సిరీ్‌సలో నిలిచేందుకు స్థాయికి తగ్గ ఆటతీరును ప్రదర్శించాల్సి

బ్యాటింగ్ మెరుగయ్యేనా..?

ఇటీవలి కాలంలో భారత జట్టుకు బ్యాటింగ్‌ విభాగం భారంగా మారింది. మూడు టెస్టుల సిరీ్‌సలో ఓటమికి ప్రధాన కారణంగా నిలిచిన బ్యాటర్స్‌.. పరిమిత ఓవర్ల సిరీ్‌సలోనూ తమ వైఫల్యాన్ని కొనసాగించారు. టాపార్డర్‌ రాణించి విజయానికి బాటలు వేసినా మిడిలార్డర్‌ వైఫల్యంతో మూల్యం చెల్లించుకుంది. ఫలితంగా రెండో వన్డేలో చావోరేవో తేల్చుకోవాల్సిన పరిస్థితి. నేటి  మ్యాచ్‌లోనూ ఇలాంటి సాదాసీదా ప్రదర్శనే కనబరిస్తే సిరీస్‌ గల్లంతవుతుంది. 



నేడు దక్షిణాఫ్రికాతో రెండో వన్డే

ఒత్తిడిలో భారత్‌


పార్ల్‌: తొలి వన్డేలో చేజేతులా ఓడిన టీమిండియా ఇప్పుడు సిరీ్‌సలో నిలిచేందుకు స్థాయికి తగ్గ ఆటతీరును ప్రదర్శించాల్సి ఉంది. శుక్రవారం దక్షిణాఫ్రికాతో రెండో వన్డే జరగనుంది. ఈ మ్యాచ్‌లో గెలిస్తేనే సఫారీ గడ్డపై వరుసగా రెండో సిరీ్‌సను అందుకునే అవకాశాలు సజీవంగా ఉంటాయి. అలాగే కేఎల్‌ రాహుల్‌ తన కెప్టెన్సీ సామర్థ్యాన్ని కూడా నిరూపించుకోవాల్సి ఉంటుంది. బుధవారంనాటి మ్యాచ్‌లో అతను పెద్దగా ఆకట్టుకోలేకపోయాడు. బవుమా, డుస్సెన్‌ వీర బాదుడును ఎలా అడ్డుకోవాలో తెలీక సతమతమయ్యాడు. ఆల్‌రౌండర్‌గా వెంకటేశ్‌ అయ్యర్‌ టీమ్‌లో ఉండగా.. అతడి చేతికి బంతి ఇవ్వకపోవడం ఆశ్చర్యపరిచింది. చాహల్‌, శార్దూల్‌ను ప్రత్యర్థి బ్యాటర్స్‌ సులువుగా ఆడేస్తున్న వేళ.. ఆరో బౌలర్‌గా అయ్యర్‌తో కనీసం నాలుగైదు ఓవర్లు కూడా వేయించనప్పుడు అతను జట్టులో ఉండి ఏం లాభమనే విమర్శలు వచ్చాయి. దీనికి తోడు జట్టును ఎప్పటి నుంచో వేధిస్తున్న మిడిలార్డర్‌ సమస్యను ఎలా అధిగమించాలో టీమ్‌ మేనేజ్‌మెంట్‌కు కూడా అర్థం కాని పరిస్థితి నెలకొంది.

బ్యాటర్స్‌ విజృంభిస్తేనే...: అందరి అంచనాలను పటాపంచలు చేస్తూ తొలి వన్డేలో ఓపెనర్‌ శిఖర్‌ ధవన్‌ తన సత్తా ఏమిటో నిరూపించుకున్నాడు. రాహుల్‌ మాత్రం ఆశించిన స్కోరు చేయలేదు. ఏడేళ్ల తర్వాత కేవలం బ్యాటర్‌గా అడుగుపెట్టిన కోహ్లీ మాత్రం అర్ధసెంచరీతో అలరించాడు. ఈ ఇద్దరూ అవుటయ్యే సమయానికి కూడా జట్టు సురక్షిత స్థానంలోనే ఉంది. కానీ మిడిలార్డర్‌ బ్యాటర్లు క్రీజులో నిలిచే ప్రయత్నం చేయలేదు. నిర్జీవంగా ఉన్న పిచ్‌పై పరుగులు రావడం సులువుగానే ఉన్నా వీరంతా తెగ ఇబ్బందిపడ్డారు. చివర్లో శార్దూల్‌ బ్యాట్‌ ఝుళిపించకపోతే ఓటమి తేడా దారుణంగా ఉండేది. ఒకవేళ అయ్యర్‌ను స్పెషలిస్ట్‌ బ్యాటర్‌గా ఆడించాలనుకుంటే అతడికన్నా అనుభవజ్ఞుడు సూర్యకుమార్‌ను తీసుకోవడం మేలనే కామెంట్లు వినిపిస్తున్నాయి. ఒత్తిడిలోనూ అతను అద్భుత స్ట్రోక్‌ ప్లేయర్‌గా రాణించగలడు. నేటి మ్యాచ్‌లో పంత్‌, శ్రేయాస్‌, వెంకటేశ్‌ అయ్యర్‌ బ్యాట్లు ఝుళిపించకపోతే కష్టమే. అటు బౌలింగ్‌లోనూ శార్దూల్‌, భువనేశ్వర్‌ ధారాళంగా పరుగులు సమర్పించుకున్నారు. భువీ స్థానంలో సిరాజ్‌ను ఆడించే అవకాశాన్ని తోసిపుచ్చలేం. ఇక పిచ్‌ స్పిన్‌కు అనుకూలిస్తున్నా చాహల్‌, అశ్విన్‌ మధ్య ఓవర్లలో ప్రభావం చూపలేక ఒక్క వికెట్‌ మాత్రమే తీయగలిగారు. అటు ప్రత్యర్థి స్పిన్నర్లు మాత్రం ఏకంగా నాలుగు వికెట్లు పడగొట్టడం విశేషం. 

సిరీ్‌సపై దృష్టి: వన్డే సిరీ్‌సను కూడా ఈ మ్యాచ్‌ ద్వారానే అందుకోవాలని ఆతిథఽ్య దక్షిణాఫ్రికా భావిస్తోంది. కెప్టెన్‌ బవుమా, డుస్సెన్‌ సెంచరీలతో సూపర్‌ ఫామ్‌లో ఉండడం వీరికి కలిసి రానుంది. ఓపెనర్‌ డికాక్‌ కూడా రాణిస్తే భారత్‌కు కష్టాలు తప్పవు. ఈ రెండో వన్డేలో సఫారీలు ఎలాంటి మార్పులు చేయదలుచుకోలేదు.


జట్లు (అంచనా): 

భారత్‌: రాహుల్‌ (కెప్టెన్‌), ధవన్‌, కోహ్లీ, పంత్‌, శ్రేయాస్‌ అయ్యర్‌, వెంకటేశ్‌ అయ్యర్‌/సూర్యకుమార్‌, అశ్విన్‌, శార్దూల్‌, భువనేశ్వర్‌ /సిరాజ్‌, బుమ్రా, చాహల్‌.

దక్షిణాఫ్రికా: డికాక్‌, మలన్‌, బవుమా (కెప్టెన్‌), మార్‌క్రమ్‌, డుస్సెన్‌, మిల్లర్‌, ఫెలుక్వాయో, జాన్సెన్‌, కేశవ్‌ మహరాజ్‌, లుంగీ ఎన్‌గిడి, షంసీ.

పిచ్‌: ఇక్కడి వాతావరణం వేడిగా ఉండనుంది. పిచ్‌ తొలి వన్డే మాదిరిగానే నెమ్మదిగా ఉండడంతో పాటు స్పిన్‌కు అనుకూలించే అవకాశం ఉంది.

Updated Date - 2022-01-21T09:03:28+05:30 IST