సెకండ్‌ వేవ్‌ విశ్వరూపం!

ABN , First Publish Date - 2021-05-01T06:10:39+05:30 IST

జిల్లాలో మార్చి ఆఖరివారంలో కరోనా రెండో వేవ్‌ ప్రారంభమైంది. ఏప్రిల్‌ తొలివారంలో ఒక మోస్తరుగా కేసులు నమోదయ్యాయి.

సెకండ్‌ వేవ్‌ విశ్వరూపం!
రిమ్స్‌లో కొవిడ్‌ ఆడ్మిషన్‌ వార్డు వద్ద ఆక్సిజన్‌ పెట్టించుకొని పడకల కోసం పడిగాపులు కాస్తున్న బాధితులు

కల్లోలం సృష్టించిన ఏప్రిల్‌ 

వేలాది కేసులు, వందల్లోనే మృతులు

చికిత్స కోసం అల్లాడుతున్న బాధితులు

కొవిడ్‌ కేర్‌ సెంటర్ల ఏర్పాటులో జాప్యం

అవసరమైన స్థాయిలో అందని వైద్యం

ఆర్థికంగా చితికిపోతున్న కుటుంబాలు

జిల్లా అంతటా కొనసాగుతున్న పాక్షిక లాక్‌డౌన్‌

సెకండ్‌వేవ్‌ కరోనా కల్లోలం సృష్టిస్తోంది. జిల్లా వ్యాప్తంగా ఊహించని రీతిలో వైరస్‌ విజృంభించడంతో అన్నివర్గాల ప్రజలు అల్లాడిపోతున్నారు. ఏప్రిల్‌లోనే వేలాది పాజిటివ్‌ కేసులు నమోదు కావడమే కాక వందల సంఖ్యలో మరణాలు సంభవించాయి. ఈ విషయంలో అధికారిక గణాంకాలే ఆందోళన కలిగిస్తుండగా, లెక్కల్లోకి రానివి అనేకం ఉంటున్నాయి. రోజురోజుకీ విజృంభిస్తున్న కరోనా వైరస్‌తో భయబ్రాంతులకు గురవుతున్న ప్రజలు పరీక్షలు, వ్యాక్సిన్‌, మెరుగైన చికిత్స కోసం పరుగులు తీస్తున్నారు. అయితే అవసరమైన స్థాయిలో చికిత్స, బెడ్లు లభించక అల్లాడిపోతున్నారు. మరోవైపు ముందస్తు జాగ్రత్తల్లో భాగంగా మందుల వాడకం, పోషకాహారం కోసం అధికంగా వెచ్చించాల్సిన పరిస్థితి నెలకొంది. లాక్‌డౌన్‌ తరహా పరిస్థితి మళ్లీ రావడంతో స్వయం ఉపాధి పొందేవారు, చిరువ్యాపారులు తీవ్రంగా నష్టపోతుండగా సాధారణ వ్యాపారాలు సైతం మందగించాయి. 

ఒంగోలు, ఏప్రిల్‌ 30 (ఆంధ్రజ్యోతి) : జిల్లాలో మార్చి ఆఖరివారంలో కరోనా రెండో వేవ్‌ ప్రారంభమైంది. ఏప్రిల్‌ తొలివారంలో ఒక మోస్తరుగా కేసులు నమోదయ్యాయి. రెండో వారంలో ఉధృతి పెరిగ్గా, నాలుగో వారంలో విజృంభించింది. గతపక్షం రోజులుగా వందల సంఖ్యలో పాజిటివ్‌లు వెలుగు చూశాయి. ఏప్రిల్‌ నెలలోనే వేలాది కేసులు నమోదు కాగా, వందలసంఖ్యలోనే మరణాలు సంభవించాయి. గతేడాది మార్చిలో జిల్లాలో తొలి కరోనా కేసు నమోదైంది. ఇప్పటినుంచి ఇప్పటి వరకూ 72,035 పాజిటివ్‌లు వెలుగు చూశాయి. అయితే అందులో ఈనెలలోనే 8,810 కేసులు ఉన్నాయి. వాటిలో ఒంగోలులో అత్యధికంగా 2,588 కేసులు నమోదు కాగా, పలు ఇతర పట్టణాలు, మండల కేంద్రాలు, ప్రధాన గ్రామాల్లో అధికంగా ఉన్నాయి.  జిల్లాలో గతేడాది కరోనా ప్రభావం అధికంగానే కనిపించినప్పటికి సంపూర్ణ లాక్‌డౌన్‌ కొంత, ప్రధానాస్పత్రులతో పాటు కొవిడ్‌ కేర్‌ సెంటర్లు ఏర్పాటు, హోం ఐసోలేషన్‌లో ఉన్నవారికి వైద్యశాఖ సహకారం, కంటైన్మెంట్‌ క్లస్టర్ల ఏర్పాటుతో వైరస్‌వ్యాప్తి నివారణ చర్యలతో కొంత మేర ప్రజలు ఊరట చెందారు. అయితే ప్రస్తుతం ఆ పరిస్థితి కనిపించడం లేదు.


కరోనా మరణ మృదంగం

అధికారిక లెక్కల ప్రకారం ఈనెలలో మరణాలు వందలోపే ఉన్నట్లు చూపుతుండగా అనధికారికంగా ఆయా ప్రాంతాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం.. సగటున రోజుకు 10కిపైనే కరోనా మరణాలు సంభవిస్తూ ఇప్పటికే 300 దాటినట్లు తెలుస్తోంది. ఒంగోలులోని రిమ్స్‌లో నిత్యం మరణ మృదంగం మోగుతూనే ఉంది. వీరిలో ఎక్కువమంది ఒంగోలు పరిసర ప్రాంతాల వారే ఉంటున్నారు. చికిత్స కోసం గుంటూరు, విజయవాడ, హైదరాబాద్‌, చెన్నై ప్రాంతాలకు పరుగులు పెడుతున్న వారిలోనూ అనేకమంది మృత్యువాతపడుతున్నారు. పర్చూరులో పరిస్థితి తీవ్రంగా ఉంది. ఆ ప్రాంతంలో అధికారికంగా అయిదారుగురే మృతిచెందినట్లు చెప్తున్నా అనధికారికంగా 30 మందిపైనే ప్రాణాలు  విడిచినట్లు తెలుస్తోంది. కందుకూరులోనూ పరిస్థితి అలాగే ఉంది. అధికారిక మృతులు 10 లోపే ఉండగా అనధికారికంగా మరో పాతికమంది వరకూ ప్రాణాలు విడిచినట్లు సమాచారం. కనిగిరి, మార్కాపురం, చీమకుర్తి, దర్శి, గిద్దలూరు, ఇలా ఏ ప్రాంతంలో చూసినా పదుల సంఖ్యలో మరణాలు సంభవిస్తున్నాయి.  పరిస్థితి ఇంత తీవ్రస్థాయిలో ఉండగా కరోనా బాధితులకు అవసరమైన స్థాయిలో వైద్యం అందడం లేదన్నది బహిరంగ సత్యం. 


కొవిడ్‌ చికిత్స సామాన్యులకు కష్టమే

ఒంగోలులోని రిమ్స్‌, మరో 30 ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లో కొవిడ్‌ చికిత్సకు అనుమతులు ఉన్నాయి. వాటన్నింటిలో కలిపి 2,268 బెడ్స్‌ ఏర్పాటు చేశారు. వాటిలో ఐసీయూ బెడ్లు కేవలం 250 మాత్రమే కాగా 1,194 ఆక్సిజన్‌, 824 సాధారణ బెడ్స్‌ ఉన్నాయి. అయితే ప్రస్తుతం కరోనా రెండో వేవ్‌ తీవ్రత అధికంగా ఉండటంతో వైరస్‌ సోకిన వారు చిన్నపాటి నిర్లక్ష్యం చేసినా ఒకటి, రెండు రోజుల్లోనే తీవ్రత పెరుగుతోంది. దీంతో ఆక్సిజన్‌, వెంటిలేటర్‌ చికిత్స ఎక్కువమందికి అవసరం అవుతుండగా అందుకోసం వస్తున్న వారికి బెడ్లు దొరకని పరిస్థితి నెలకొంది. ఆక్సిజన్‌ బెడ్లపై ఉన్నవారికి అది కూడా పూర్తిస్థాయిలో అందుతుందన్న నమ్మకం లేదు. జిల్లాలో ప్రస్తుతం 6,677 యాక్టివ్‌ కేసులు ఉండగా 1,794 మంది వివిఽధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. అలాగే 4,821 మంది ఇళ్ల వద్ద నుంచే చికిత్స తీసుకుంటుండగా మరో 62 మంది కొవిడ్‌ కేర్‌ సెంటర్లలో ఉన్నట్లు సమాచారం. మరోవైపు వైరస్‌ సోకుతుందన్న అనుమానంతో అనేకమంది టెస్టులు కోసం, ఇంకో వైపు ముందుజాగ్రత్తతతో వ్యాక్సిన్‌ కోసం జనం ఆస్పత్రులకు పరుగులు తీస్తున్నారు. 


కొవిడ్‌ కేర్‌ చర్యలు అంతంతమాత్రమే

గతంలో వైరస్‌ సోకిన బాధితులు అధికంగా ఉన్న ప్రాంతాలను కంటైన్మెంట్‌ జోన్లుగా ప్రకటించడం, వారి కుటుంబ సభ్యులు, ఇతర ప్రైమరీ, సెకండరీ కాంటాక్టులను గుర్తించి పరీక్షలు చేయడం, వారికి కూడా అవసరమైతే చికిత్స అందించడం చేసేవారు. అలాగే వైరస్‌ తీవ్రత అధికంగా ఉన్నవారికి రిమ్స్‌, ఇతర ఆస్పత్రుల్లో చికిత్స చేస్తూ సాధారణంగా ఉన్నవారి కోసం డాక్టర్ల పర్యవేక్షణలో కొవిడ్‌ కేంద్రాలు ఏర్పాటు చేసి వైద్యం, ఆహారం అందించారు. ప్రస్తుతం వాటిలో ఏ ఒక్కటీ సజావుగా సాగడం లేదు. కొవిడ్‌ కేర్‌ సెంటర్ల ఏర్పాటులో తీవ్రజాప్యం జరుగుతుండగా కంటైన్మెంట్‌ క్లస్టర్ల ఏర్పాటు ఇతర చర్యలు మొక్కుబడిగానే ఉన్నాయి.


కొనసాగుతున్న పాక్షిక లాక్‌డౌన్‌

వైరస్‌ వ్యాప్తి నివారణ చర్యల్లో భాగంగా జిల్లాలోని వివిఽధ ప్రాంతాల్లో పాక్షిక లాక్‌డౌన్‌ అమలులో ఉంది. అధికారుల పర్యవేక్షణ కన్నా కరోనాపై ప్రజల్లో వచ్చిన భయంతోనే ఎక్కువ ప్రాంతాల్లో అది సజావుగా సాగుతోంది. కరోనా తీవ్రత నేపథ్యంలో జిల్లాలో వేలాది కుటుంబాలు ఆర్థికంగా చితికిపోతున్న పరిస్థితి కనిపిస్తోంది. ఒక మోస్తరుగా వైరస్‌ సోకి స్థానికంగా చికిత్సపొందుతున్న వారి నుంచి మెరుగైన చికిత్స పేరుతో ప్రధాన నగరాల్లో ప్రైవేటు వైద్యశాలలకు వెళ్లిన వారి వరకూ పరిశీలిస్తే ఒక్కో కుటుంబంపై కనీసం రూ.లక్ష నుంచి రూ.10లక్షల వరకూ ఈనెలలో ఖర్చుపెట్టిన వారు జిల్లాలో వేలాది మంది ఉన్నారు. ఇక లక్షలమంది ముందుజాగ్రత్తగా మందుల వాడకం, ఒకస్థాయి ఆర్థిక పరిస్థితి ఉన్నవారు పోషకాహారం కోసం భారీగానే ఖర్చు చేస్తున్నారు. అలా ప్రతి కుటుంబంపై ఏదో ఒకస్థాయిలో ఆర్థికభారం అధికంగానే కనిపిస్తోంది. అదేసమయంలో కరోనా వ్యాప్తి నివారణ కోసం అమలుచేస్తున్న పాక్షిక లాక్‌డౌన్‌ ప్రజలు కూడా అత్యవసరాల కొనుగోలుకే పరిమితం కావడం వ్యాపార, వాణిజ్యరంగాలపై తీవ్ర ప్రభావాన్నే చూపుతోంది. 



Updated Date - 2021-05-01T06:10:39+05:30 IST