దడ పుట్టిస్తున్న సెకండ్‌వేవ్‌

ABN , First Publish Date - 2021-04-21T06:16:01+05:30 IST

కరోనా సెకండ్‌ వేవ్‌ రోజురోజుకు ఉధృతమవుతున్నది.

దడ పుట్టిస్తున్న సెకండ్‌వేవ్‌

- 34 రోజుల్లో 5,190 మందికి సోకిన కరోనా 

- మృతుల లెక్కలో గందరగోళం

- దినదినం పెరుగుతున్న పాజిటివ్‌ కేసులు

- తాజాగా 547 మందికి సోకిన వైరస్‌, ఆరుగురి మృతి 

- అమలులోకి వచ్చిన కర్ఫ్యూ 

(ఆంధ్రజ్యోతి ప్రతినిధి, కరీంనగర్‌)

కరోనా సెకండ్‌ వేవ్‌ రోజురోజుకు ఉధృతమవుతున్నది. నెలరోజుల్లోనే మొదటి వేవ్‌ రికార్డును అధిగమించి కేసులు నమోదయ్యాయి. సెకండ్‌ వేవ్‌ ప్రారంభమైన తర్వాత జిల్లాలో గడిచిన 34 రోజుల్లో 5,190 మంది వ్యాధిబారినపడ్డారు. వ్యాధి ఉధృతంగా వ్యాపిస్తూ వేల మందికి వైరస్‌ సోకుతుంటే మరణాలు కూడా అదే రీతిలో నమోదవుతున్నాయి. కరీంనగర్‌ జిల్లా కేంద్రంలోని  ఏ డివిజన్‌కు వెళ్ళినా ఒకటో, రెండో సంస్మరణలు, పెద్దకర్మ ఫ్లెక్సీలు కనిపిస్తూ కరోనా మృత్యుకేళిని కళ్ళకు కట్టినట్లు చూపిస్తున్నాయి. అధికారికంగా రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ వెల్లడిస్తున్న హెల్త్‌ బులెటిన్‌ వస్తున్న అరకొర సమాచారం మినహా జిల్లా యంత్రాంగం నుంచి ఎలాంటి సమాచారం ఉండడం లేదు. రోజురోజుకు వ్యాధి ఉధృతి, పెరుగుతున్న పాజిటివ్‌ కేసుల పరిస్థితిని, చనిపోతున్న వారి వివరాలను వెల్లడించకుండా జిల్లా యంత్రాంగం దాపరికాన్ని పాటిస్తున్నది. దీంతో కరీంనగర్‌ జిల్లాలో కరోనా ఉధృతి ఎంత ఉందో తెలియక ప్రజలు పూర్తి నిర్లక్ష్యంగా ఉంటున్నారని అభిప్రాయం వ్యక్తమవుతున్నది. టీవీల్లో చూస్తే కరోనాతో ఒకరు కూడా బతికే అవకాశం లేదని భయం కలుగుతుండగా జిల్లా కేంద్రంలో  కొవిడ్‌ నిబంధనలను గాలికి వదిలి తిరుగుతున్న ప్రజలను చూస్తే కొవిడ్‌ లేదనే అభిప్రాయం కలుగుతున్నది.  జిల్లాలో వ్యాధి ఉధృతిని, రోజురోజుకు పెరుగుతున్న పాజిటివ్‌ కేసులు, మృతుల సంఖ్యను జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ప్రకటించక పోవడంతో ప్రజలకు సమాచారం లేక బేఫికర్‌గా ఉంటున్నారనే అభిప్రాయం వ్యక్తమవుతున్నది.  మార్చి 18 నుంచి ఏప్రిల్‌ 20 వరకు జిల్లా వ్యాప్తంగా 5,190 మందికి కరోనా సోకినట్లు పరీక్షల్లో నిర్ధారణ అయింది. ఇందులో 2,551 మంది కరీంనగర్‌ పట్టణానికి చెందిన వారు కాగా, 2,639 మంది జిల్లావ్యాప్తంగా ఉన్న 15 మండలాలకు చెందిన వారున్నారు.

సెకండ్‌ వేవ్‌ ప్రారంభమైన నాటి నుంచి 69,189 మంది కొవిడ్‌ పరీక్షలు చేయించుకున్నారు. సెకండ్‌ వేవ్‌లో జిల్లావ్యాప్తంగా పరీక్షలు చేయించుకున్న వారిలో 7.50 శాతం మందికి వ్యాధి నిర్ధారణ అయింది. కరీంనగర్‌ పట్టణంలో 15,364 మందికి పరీక్షలు నిర్వహించగా 16.60 శాతం మందికి పాజిటివ్‌ వచ్చింది. గ్రామీణ ప్రాంతాలకు, పట్టణ ప్రాంతాలకు మధ్య 9శాతం కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి. ఈ పరీక్షలు పాజిటివ్‌ కేసులన్నీ కూడా కేవలం రాపిడ్‌ యాంటిజెన్‌ పరీక్షలు ద్వారా నిర్ధారణ అయినవి మాత్రమే కావడం గమనార్హం.

జిల్లాలో చల్మెడ మెడికల్‌ కళాశాల, విజయ డయాగ్నస్టిక్‌ సెంటర్‌, జిల్లా కేంద్ర ఆసుపత్రుల్లో ఆర్‌టీపీసీఆర్‌ ద్వారా కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఆర్‌టీపీసీఆర్‌ పద్ధతిలో జరుగుతున్న పరీక్షలు ఎన్నో, అందులో ఎన్ని పాజిటివ్‌ వస్తున్నాయో హైదరాబాద్‌ నుంచి వైద్య ఆరోగ్యశాఖ సంబంధిత కేంద్రాలకు, పరీక్షలు చేయించుకున్న వారికి నేరుగా పంపిస్తున్నది. జిల్లా యంత్రాంగం ఈ వివరాలను వెల్లడించక పోవడంతో ఆర్‌టీపీసీఆర్‌ ద్వారా ఎంత మందికి వ్యాధి నిర్ధారణ అయిందో తెలువకుండా పోతున్నది. ర్యాపిడ్‌ యాంటిజెన్‌, ఆర్‌టీపీసీఆర్‌ కాకుండా చాలా మంది చెస్ట్‌ సీటీస్కాన్‌ చేయించుకోవడం ద్వారా వ్యాధి నిర్ధారణ చేయించుకుంటున్నారు. జిల్లాలో 13 సీటీస్కాన్‌ సెంటర్లు ఉండగా ఒక్కొక్క కేంద్రంలో సగటున రోజుకు వంద మంది స్కానింగ్‌ పరీక్షలు చేయించుకుంటున్నారని ఒక అనధికారిక అంచనా. అన్ని కేంద్రాల్లో కలిపి రోజుకు వేయి మంది సీటీస్కాన్‌ చేయించుకుంటున్నారని అనుకున్నా వారిలో 70 నుంచి 75శాతం మందికి కరోనా నిర్ధారణ అవుతుందని సీటీస్కాన్‌ నిర్వాహకులు చెబుతున్నారు. ఈ లెక్కన ప్రతిరోజు సుమారు 700 మంది కరోనా వ్యాధిబారినపడుతున్నట్లుగా ఈ పరీక్షల్లో వెల్లడవుతున్నది. ఆర్‌టీపీసీఆర్‌, సీటీస్కాన్‌, ర్యాపిడ్‌ యాంటిజన్‌ పరీక్షలకు సంబంధించిన కేసులన్నిటిని కలుపుకుంటే రోజుకు వేయి మంది వరకు కరోనా వ్యాధి బారిన పడుతున్నట్లు వైద్య వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఈ అంచనా ప్రకారం ఇప్పటికే సెకండ్‌ వేవ్‌ మొదలైననాటి నుంచి ఎంత మంది వ్యాధిపీడితులుగా మారారో అంచనా వేసుకోవచ్చు.

ఒకే రోజు ఆరుగురు మృతి : 

జిల్లాలో మంగళవారం ఒకే రోజు ఆరుగురు కరోనా వ్యాధిబారినపడి చికిత్సపొందుతూ మృతిచెందారు. చొప్పదండి మండలంలో పెట్రోల్‌ పంపులో పనిచేసే 42 ఏళ్ళ వ్యక్తి, అలాగే అదే మండల కేంద్రానికి చెందిన 45 ఏళ్ళ నేత కార్మికుడు కరోనాతో మరణించాడు. అదే మండలం వెదురుగట్ట గ్రామానికి చెందిన 62 ఏళ్ళ వృద్ధుడు కరీంనగర్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. కరీంనగర్‌ పట్టణం గణేశ్‌నగర్‌కు చెందిన 65 సంవత్సరాల వృద్ధుడు, జమ్మికుంట మండలం పెద్దపల్లికి చెందిన 60 సంవత్సరాల వృద్ధుడు, సైదాపూర్‌ మండలం బొమ్మకల్‌ గ్రామానికి చెందిన 55 సంవత్సరాల వ్యక్తి కూడా కరోనా కారణంగా మరణించారు. జిల్లాలోని గ్రామీణ ప్రాంతాల్లో నెలరోజులుగా 28 మంది మరణించినట్లు సమాచారముండగా, కరీంనగర్‌ జిల్లా కేంద్రంలో ఎందరూ మరణించారనే సమాచారం అధికారవర్గాల ద్వారా వెల్లడి కావడం లేదు. మంగళవారం జిల్లాలో 3,547 మందికి పరీక్షలు నిర్వహించగా 547 మందికి వ్యాధి నిర్ధారణ అయింది. వీరిలో 338 మంది గ్రామీణ ప్రాంతాలకు చెందిన వారు కాగా, 209 మంది కరీంనగర్‌ పట్టణానికి చెందిన వారున్నారు. 

అమలులోకి వచ్చిన రాత్రి పూట కర్ఫ్యూ: 

తెలంగాణ ప్రభుత్వం ఈనెల 20న రాత్రి నుంచి మే 1 ఉదయం 5 గంటల వరకు పది రోజులపాటు రాత్రి కర్ఫ్యూను విధిస్తూ జారీ చేసిన ఉత్తర్వులు మంగళవారం అములోకి వచ్చాయి. రోజు రాత్రి 9 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు కర్ఫ్యూ అమలులో ఉంటుంది. రాత్రి 8 గంటల వరకు దుకాణాలు, హోటళ్ళు, బార్లు, రెస్టారెండ్లు, వైన్స్‌లు, ఇతర వ్యాపార, వాణిజ్య సంస్థలన్నిటిని మూసివేయాలి. అయితే అత్యవసర సేవలకు సంబంధించిన మెడికల్‌, వైద్య సేవలకు కర్ఫ్యూ ఆంక్షలను సడలించారు. రాత్రి 9 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు ఆర్టీసీ బస్సు సర్వీసులను నిలిపివేస్తున్నట్లు ఆర్టీసీ అధికారులు ప్రకటించారు. రాత్రి వేళల్లో కర్ఫ్యూ అమలులో ఉన్నందున ప్రజలు బయటకు రావద్దని పోలీసులు హెచ్చరించారు.  

Updated Date - 2021-04-21T06:16:01+05:30 IST