రూ. 500 కోట్ల ప్రజాధనం వృథా

ABN , First Publish Date - 2020-07-08T09:31:43+05:30 IST

పాత సచివాలయం కూల్చివేతపై ప్రతిపక్షాలు తీవ్రనిరసన వ్యక్తం చేస్తున్నాయి. విపక్ష పార్టీ నేతలు ఈ చర్యను...

రూ. 500 కోట్ల ప్రజాధనం వృథా

సచివాలయం కూల్చివేతపై ప్రతిపక్ష నేతల విమర్శ

హైదరాబాద్‌, జూలై 7 (ఆంధ్రజ్యోతి): పాత సచివాలయం కూల్చివేతపై ప్రతిపక్షాలు తీవ్రనిరసన వ్యక్తం చేస్తున్నాయి. విపక్ష పార్టీ నేతలు ఈ చర్యను తప్పు పట్టారు. సచివాలయాన్ని రాత్రికి రాత్రి కూల్చివేశారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ కుమార్‌ పేర్కొన్నారు.  ఇదే వ్యయంతో ఉస్మానియా ఆస్పత్రి పూర్తయ్యేది కాదా? అని ప్రశ్నించారు. మతిలేని నిర్ణయాల వల్ల రూ.500 కోట్ల ప్రజాధనం వృధా అవుతోందని విమర్శించారు. కొత్త సచివాలయ డిజైన్‌ హజ్‌హౌ్‌సలా, ఓ పెద్ద మసీదులా ఉందని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌ విమర్శించారు. ఒకవైపు కరోనాతో  ప్రజలు అల్లాడుతుంటే, సచివాలయం కూల్చివేత అవసరమా? అని మాజీ మంత్రి, బీజేపీ నాయకురాలు డీకే అరుణ ప్రశ్నించారు. ఒక్కరోజు కూడా సచివాలయానికి వెళ్లని మీకు కొత్త సచివాలయం అవసరమా? అని అడిగారు. ప్రస్తుత క్లిష్ట సమయంలో కొత్త సచివాలయం ఏమాత్రం సమర్థనీయం కాదని ఎమ్మెల్సీ ఎన్‌.రాంచందర్‌రావు అన్నారు. కరోనా విజృంభిస్తున్న తరుణంలో కొత్త సచివాలయం అవసరమా? అని మాజీ ఎంపీ వివేక్‌  ప్రశ్నించారు. 


కూల్చివేత బాధ్యతారాహిత్యం: ఎల్‌.రమణ

 కరోనా బాధితులను  ఆదుకోవడంలో తీవ్ర నిర్లక్ష్యం వహిస్తున్న రాష్ట్ర  ప్రభుత్వం పాత సచివాలయ భవనాలను కూల్చివేస్తూ బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తోందని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్‌.రమణ మండిపడ్డారు. కూల్చివేతల వల్ల పర్యావరణ సమస్యలు ఉత్పన్నమయ్యే ప్రమాదం ఉందన్నారు.  


ప్రజా ధనం దుర్వినియోగమే: తమ్మినేని 

 కరోనాతో రాష్ట్రం అతలాకుతలమవుతున్న తరుణంలో వందల కోట్ల విలువైన సచివాలయ భవనాలను కూల్చివేయడం టీఆర్‌ఎస్‌ ప్రభుత్వ బాధ్యతారాహిత్యమని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి  తమ్మినేని వీరభద్రం విమర్శించారు.  మరో వందేళ్ల వరకు వినియోగించుకునే సామర్ధ్యంతో ఉన్న సచివాలయాన్ని సీఎం కేసీఆర్‌ కూల్చివేయించడం మూర్ఖపు చర్యగా సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి వ్యాఖ్యానించారు. 


కీర్తి, ప్రతిష్ఠల కోసమే: కోదండరాం 

కీర్తి, ప్రతిష్ఠల కోసమే సచివాలయాన్ని కూల్చేేస పనిని రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిందని టీజేఎస్‌ అధ్యక్షుడు ప్రొఫెసర్‌ కోదండరాం విమర్శించారు. ప్రాధాన్యాలు మార్చుకోవాలని, కరోనా వైరస్‌ కట్టడి కోసం సర్వశక్తులు ఒడ్డి పని చేయాలని సీఎం కేసీఆర్‌ను ఆయన డిమాండ్‌ చేశారు. సచివాలయ భవనాలను కూల్చడం వల్ల రూ.వెయ్యి కోట్లను గంగపాలు చేశారని సీఎం కేసీఆర్‌పై తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. సువిశాల సచివాలయ భవనాలను మూర్ఖంగా, బాధ్యతారాహిత్యంగా కూల్చివేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపారు.

Updated Date - 2020-07-08T09:31:43+05:30 IST