గుట్టుగా.. రేషన్‌ బియ్యం రవాణా

ABN , First Publish Date - 2022-01-20T05:06:15+05:30 IST

ప్రజాపంపిణీ వ్యవస్థ ద్వారా పేద ప్రజలకు ప్రభుత్వం సరఫరా చేస్తున్న రేషన్‌ బియ్యం పక్కదారి పడుతున్నది

గుట్టుగా.. రేషన్‌ బియ్యం రవాణా

 కర్ణాటక, మహారాష్ట్ర, గుజరాత్‌కు తరలిస్తున్న ముఠా

 సంగారెడ్డి, రంగారెడ్డి, యాదాద్రి,  హైదరాబాద్‌ నుంచి సాగుతున్న బియ్యం దందా

 ఏడాదిలో పట్టుబడ్డ బియ్యం విలువ రూ.1.42 కోట్లు

తనిఖీల్లో 11,422.57 క్వింటాళ్ల రేషన్‌ బియ్యం సీజ్‌ 

దాదాపు 90 మందిపై కేసులు నమోదు


 ఆంధ్రజ్యోతి ప్రతినిధి, సంగారెడ్డి, జనవరి 19:  ప్రజాపంపిణీ వ్యవస్థ ద్వారా పేద ప్రజలకు ప్రభుత్వం సరఫరా చేస్తున్న రేషన్‌ బియ్యం పక్కదారి పడుతున్నది. అక్రమ దందాను వ్యాపారంగా మార్చుకున్న కొందరు.. ముఠాగా ఏర్పడి రాత్రివేళల్లో లారీల్లో రహస్యంగా పొరుగురాష్ర్టాలకు తరలిస్తున్నారు. పోలీసుల సహకారంతో అడపాదడపా తనిఖీలు నిర్వహించే పౌరసరఫరాలశాఖ అధికారులు గతేడాదిలోనే రూ.1.42 కోట్ల విలువైన 11,422.57 క్వింటాళ్ల బియ్యాన్ని సీజ్‌ చేశారు.  పౌరసరఫరాలశాఖ అధికారుల తనిఖీల్లో పట్టుబడిన బియ్యం ఈ స్థాయిలో ఉంటే పట్టుబడకుండా అక్రమ రవాణా జరిగే బియ్యం విలువ పదిరెట్లు ఎక్కువ ఉంటుందని  అధికార వర్గాలు పేర్కొంటున్నాయి.

ప్రభుత్వం సరఫరా చేస్తున్న బియ్యా న్ని వాడుకోని ప్రజలు కిలో రూ.10చొప్పున అమ్ముకుంటున్నారు. ఇలా రేషన్‌ అమ్ముకునే వారి సంఖ్య ఎక్కువగా సంగారెడ్డి, రంగారెడ్డి, యాదాద్రి, హైదరాబాద్‌ జిల్లాలోనే ఉన్నట్టు అక్రమార్కులు గుర్తించి వారంతా ఓ ముఠాగా ఏర్పడ్డారు. ప్రభుత్వం నుంచి బియ్యం సరఫరా కాగానే కొనుగోళ్లు చేపడుతున్నారు. ఆయా జిల్లాల్లోని రేషన్‌ డీలర్లూ సహకరిస్తున్నట్టు ఆరోపణలున్నాయి.


ఓఆర్‌ఆర్‌ మీదుగా తరలింపు

ఆయా జిల్లాల్లో రేషన్‌ బియ్యాన్ని ప్రతినెలా వేల క్వింటాళ్లలో కొనుగోలు చేస్తున్న ముఠా ఔటర్‌ రింగ్‌రోడ్డు మీదుగా సంగారెడ్డి, సదాశివపేట, జహీరాబాద్‌ మీదుగా లారీల్లో తరలిస్తున్నారు. జహీరాబాద్‌ శివారులోని చిరాగ్‌పల్లి, మార్డిలలో చెక్‌పోస్టులున్నా అక్కడి సిబ్బందిని ప్రలోభాలకు గురి చేసి, అక్రమ రవాణాకు మార్గం సుగమం చేసుకుంటున్నట్టు తెలిసింది. పొరుగు రాష్ట్రాలైన కర్ణాటక, మహారాష్ట్ర, గుజరాత్‌కు ఎక్కువ సంఖ్యలో రేషన్‌ బియ్యాన్ని రవాణా చేస్తున్నట్లు సమాచారం.


రూ.10కు కొనుగోలు... రూ.32కు అమ్మకం

బియ్యాన్ని అక్రమ రవాణా చేస్తున్న ముఠా సభ్యులు సంగారెడ్డి, రంగారెడ్డి, యాదాద్రి, హైదరాబాద్‌ జిల్లాల్లో కిలో రూ.10 చొప్పున రేషన్‌ బియ్యం కొనుగోలు చేస్తున్నారు. ప్రతినెలా వేల క్వింటాళ్లలో కొనుగోలు చేస్తున్న బియ్యాన్ని లారీల్లో కర్ణాటక, మహారాష్ట్ర, గుజరాత్‌కు తరలిస్తున్నారు. ఆయా ప్రాంతాల్లో ఈ బియ్యాన్ని కిలో రూ.32 చొప్పున అమ్ముతున్నట్టు తెలిసింది. ఆయా రాష్ట్రాల్లో ఈ బియ్యంతో కుర్‌కురేలు, రవ్వ లడ్డూలు, తదితర తినుబండారాలు తయారుచేసి విక్రయిస్తునట్లు సమాచారం. 

తనిఖీల్లో పట్టుబడ్డ బియ్యం

 పోలీసుల సహకారంతో పౌరసరఫరాల శాఖ అధికారులు అడపాదడపా తనిఖీలు నిర్వహిస్తుంటారు. ఆ రకంగా గతేడాది జనవరి నుంచి ఇప్పటి వరకు ఔటర్‌రింగ్‌ రోడ్డు సమీపంలోని ముత్తంగి, సదాశివపేట, కంకోలు, జహీరాబాద్‌తో పాటు చెక్‌పోస్టులున్న చిరాగ్‌పల్లి, మార్డిల వద్ద నిర్వహించిన తనిఖీల్లో 11,422.57 క్వింటాళ్ల రేషన్‌ బియ్యం సీజ్‌ చేశారు. ఈ బియ్యం విలువ రూ.1,42,49,704.00 ఉంటుందని పౌరసరఫరాల అధికారవర్గాలు తెలిపాయి. లారీలను సీజ్‌ చేసి, డ్రైవర్లపై కేసులు నమోదు చేశారు. గతేడాది నుంచి ఇప్పటి వరకు 90 మందిపై కేసులు నమోదయ్యాయి. 


డ్రైవర్లపై కేసులు ?

పొరుగు రాష్ట్రాలకు లారీల్లో అక్రమంగా రేషన్‌ బియ్యం తరలిస్తున్న ముఠా ఎక్కడా దొరక్కకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నది. బియ్యం లారీలకు అరకిలోమీటర్‌ ముందు ఈ ముఠా సభ్యులు కార్లలో ప్రయాణిస్తుంటారు. పోలీసులు, అధికారుల తనిఖీల్లో పట్టుబడ్డా తమ పేర్లు చెప్పకూడదని లారీల యజమానులతో, డ్రైవర్లతో ముఠా సభ్యులు ఒప్పందం కుదుర్చుకుంటున్నారని తెలిసింది. ఇందుకు అవసరమైన మేర డబ్బును ముఠా సభ్యులు లారీల యాజమానులకు, డ్రైవర్లకు ఇస్తున్నారని సమాచారం. అందువల్లే పోలీసులు, అధికారుల తనిఖీలలో పట్టుబడ్డప్పుడు సైతం డ్రైవర్లు ముఠా సభ్యుల పేర్లు చెప్పడం లేదని పౌరసరఫరాల అధికారవర్గాలు తెలిపాయి. ఈ కారణంగానే లారీలను సీజ్‌ చేసి, డ్రైవర్లపై కేసులు నమోదు చేసి కోర్టుకు నివేదిస్తున్నామని ఆ వర్గాలు తెలిపాయి. ఏమైనా ప్రజల అవసరాల కోసం ప్రభుత్వం పంపిణీ చేసే రేషన్‌ బియ్యం వేల క్వింటాళ్లలో ప్రతి నెలా పక్కదారి పట్టిస్తున్న ముఠా ఆగడాలను ఎలా అరికడతారో చూడాల్సిందే?


 272 క్వింటాళ్ల రేషన్‌ బియ్యం పట్టివేత

జహీరాబాద్‌ జనవరి 10: జహీరాబాద్‌ మండలం మొగుడంపల్లి మండల మడిగి శివారులోని ఆర్టీవో చెక్‌పోస్ట్‌ వద్ద అక్రమంగా జహీరాబాద్‌ నుంచి గుజరాత్‌కు తరలిస్తున్న 272క్వింటాళ్ల రేషన్‌ బియ్యాన్ని పట్టుకున్నట్లు చిరాగ్‌పల్లి ఎస్‌ఐ కాశీనాథ్‌ తెలిపారు. జహీరాబాద్‌ డీఎస్పీ శంకర్‌రాజు ఆదేశానుసారం బుధవారం పోలీస్‌ సిబ్బందితో మడిగి చెక్‌పోస్ట్‌ వద్ద 65వ జాతీయ రహదారిపై వాహనాల తనిఖీ చేపట్టారు. జహీరాబాద్‌ నుంచి కర్ణాటక వైపు వస్తున్న లారీని తనిఖీ చేయగా 690 బ్యాగుల్లో 272 క్వింటాళ్ల రేషన్‌ బియాన్ని స్వాధీనం చేసుకున్నారు. లారీ డైవ్రర్‌ చలానా ధీరుభాయ్‌, అతని యజమాని అశోక్‌ మోరిపై కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ తెలిపారు.



Updated Date - 2022-01-20T05:06:15+05:30 IST