స్వర్ణముఖి ఆనకట్ట ఆధునికీకరణకు రంగం సిద్ధం

ABN , First Publish Date - 2021-07-21T06:43:13+05:30 IST

ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీకాళహస్తి నడిబొడ్డున ప్రవహించే స్వర్ణముఖి నది ఆనకట్ట ఆధునికీకరణ పనులకు రంగం సిద్ధమైంది.

స్వర్ణముఖి ఆనకట్ట ఆధునికీకరణకు రంగం సిద్ధం
స్వర్ణముఖి నది ఆనకట్ట ప్రాంతం

త్వరలో సీడబ్ల్యూసీ అధికారిక ప్రకటన 


శ్రీకాళహస్తి, జూలై 20: ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీకాళహస్తి నడిబొడ్డున ప్రవహించే స్వర్ణముఖి నది ఆనకట్ట ఆధునికీకరణ పనులకు రంగం సిద్ధమైంది. దీనికి సంబంధించి త్వరలో సెంట్రల్‌ వాటర్‌ కమిషన్‌(సీడబ్ల్యూసీ) నుంచి అధికారిక ప్రకటన వెలువడనుంది. స్వర్ణముఖిపై ఉన్న రామసేతు వంతెనకు కొద్దిదూరంలోని కనకాలచలం కొండను ఆసరాగా చేసుకుని గతంలో ఈ నదిపై ఆనకట్ట నిర్మించారు. అయితే దీని ఎత్తు తక్కువగా ఉండటంతో నీటి నిల్వ అంతంతమాత్రంగా ఉంటోంది. దీంతో గత ఏడాది ముక్కంటి దర్శనార్థం వచ్చిన కేంద్ర జలవనరుల శాఖ మంత్రికి ఈ విషయాన్ని ఎమ్మెల్యే మధు వివరించారు. స్వర్ణముఖి నదిపై ఉన్న పాత ఆనకట్ట ఎత్తు పెంచి ఆఽధునీకరించేందుకు సహకరించాలని విన్నవించారు. ఇందుకు కేంద్ర మంత్రి సానుకూలంగా స్పందించి, ప్రతిపాదనలు పంపాలని సూచించారు. ఆ మేరకు.. శ్రీకాళహస్తి ఇరిగేషన్‌ ఈఈ మదనగోపాల్‌ ఆనకట్ట ఆధునీకరణకు రూ.60కోట్లు అవసరమంటూ సీడబ్ల్యూసీకి నివేదిక పంపారు. ఇందుకు అనుగుణంగా ఇటీవల సీడబ్ల్యూసీ అధికారులు శ్రీకాళహస్తికి విచ్చేశారు. ఆనకట్టను పరిశీలించి రూ.53కోట్ల నిధుల మంజూరుకు సూత్రప్రాయంగా ఆమోదం తెలిపారు. కాగా, ఈ నిధుల విడుదలకు సంబంధించి త్వరలో అధికారిక ప్రకటన వెలువడనున్నట్లు ఇరిగేషన్‌ అధికారులు పేర్కొన్నారు. 

Updated Date - 2021-07-21T06:43:13+05:30 IST