లౌకిక సమాజ స్వాప్నికుడు

ABN , First Publish Date - 2021-09-16T06:05:41+05:30 IST

‘‘వెళ్తూ వెళ్తు ప్రపంచాన్ని నీ వెంట తీసుకు వెళ్లు’’అన్నాడు కవి మఖ్ధూం మోహియుద్దీన్‌. తెలుగు సమాజం మీద చెరగని ముద్ర వేసిన కవి...మఖ్దుం మోహియుద్ధీన్‌. కమ్యూనిస్టు నాయకుడిగా, కవిగా ఆయన వేసిన దారి...

లౌకిక సమాజ స్వాప్నికుడు

‘‘వెళ్తూ వెళ్తు ప్రపంచాన్ని నీ వెంట తీసుకు వెళ్లు’’అన్నాడు కవి మఖ్ధూం మోహియుద్దీన్‌. తెలుగు సమాజం మీద చెరగని ముద్ర వేసిన కవి...మఖ్దుం మోహియుద్ధీన్‌. కమ్యూనిస్టు నాయకుడిగా, కవిగా ఆయన వేసిన దారి అనేకమంది లౌకికవాద కవులను తయారు చేసింది. కార్మికవర్గంతో మమేకమై, ప్రజాస్వామిక ఉద్యమాలకు తన కలాన్ని, గళాన్ని ధారవోసిన కవి మఖ్దూం. 1969లో ఆయన మరణించడంతో ఒక తీరని లోటు ఏర్పడ్డది. ఆ లోటును పూడ్చడానికి మళ్లీ అలాంటి గొంతుకలు అవసరమయ్యాయి. ఆ లోటును కొంత తీర్చడానికి నేనున్నానంటూ ముందుకొచ్చిన కవి కవియాకూబ్‌. సరిగ్గా మఖ్దూం ఆగిపోయిన దగ్గరి నుండే యాకూబ్‌ మొదలయ్యాడు. మఖ్దూంలాగే వామపక్ష ఉద్యమాల నేపథ్యం నుండి వచ్చిన బలమైన గొంతుక యాకూబ్‌. 


తెలుగు నేలది బహువిధ సంస్కృతి. దీనిని కాపాడుకోవడం ప్రజాస్వామిక గొంతుకల బాధ్యత. శతాబ్దాలుగా వస్తున్న సామరస్య సహజీవన సంస్కృతి కోసం గొంతెత్తడం అంటే మాటలా?! ఎన్ని అడ్డంకులు? ఎన్ని అపనమ్మకాలు? వాటన్నింటిని జయించి ఈ నేల మీద పడి, మట్టిని ఒంటినిండా పూసుకొని, ఈ మట్టి నాది, నేను ఈ మట్టిబిడ్డను, నా పుట్టుకైనా, చావైనా ఇక్కడే అని పోటెత్తడానికి ఒక సృజనకారుడో, కవో కావాలి. దగాపడుతున్న బతుకులను చూసి గుండెల నిండా తీరని ఆవేదనతో గొంతెత్తడానికి ప్రజాస్వామిక గొంతులు కావాలి. ఆ గొంతులే ఒక చారిత్రక బాధ్యతను నెరవేరుస్తాయి. ఈ నగరానికి ఉన్న చరిత్రను, వైవిధ్యాన్ని కాపాడుకుంటాయి. ఈ నేపథ్యంలో గడిచిన నాలుగు దశాబ్దాలుగా సెక్యులరిస్ట్‌ దృక్పథంతో గళమెత్తిన మట్టికవి యాకూబ్‌. ఖమ్మం జిల్లా రొట్టెమాకు రేవు తనను కన్నప్పటికీ తన జీవితమంతా గడిచింది ఈ నగరంలోనే.


కవి యాకూబ్‌ అంటే ఒక్కొ సాహిత్యకారుడికి ఒక్కో రకంగా గుర్తుకు వస్తాడు. గ్లోబలైజేషన్‌ నేపథ్యంలో ఊరును గురించి వలపోసే కవిగా కొందరికి గుర్తుకు వస్తే, మాయమైపోతున్న మానవత్వాన్ని తట్టిలేపే మానవీయ కవిగా ఇంకొందరికి గుర్తుకు వస్తాడు. చాలామందికి మాత్రం సోషల్‌ మీడియా వేదికగా కవిసంగమం వ్యవస్థాపకునిగా, ఫేస్‌బుక్‌ కవిత్వోద్యమ కూడలిగా గుర్తుకు వస్తాడు. అవన్నీ ఆయన కృషికి దక్కిన గుర్తింపు, గౌరవాలే. నాలాంటి వారికి లౌకిక ప్రజాస్వామిక కవిగా గుర్తుకు వస్తాడు. బాబ్రీ మసీదు విధ్వంసం, గుజరాత్‌ గుండెకోతల మీదుగా గౌరీ లంకేశ్‌, కలబుర్గిల హత్యలకు విలవిలలాడిన సెక్యులరిస్ట్‌ కవే గుర్తుకు వస్తాడు. తన సమూహం మీద జరుగుతున్న దాడిని ఖండించడమే ఏ కవికైనా మొదటి బాధ్యత. ఆ తరువాతే ఎన్ని గ్లోబలైజేషన్‌లైనా, ఎన్ని లోకలైజేషన్‌లైనా. అందుకే కవి యాకూబ్‌ తన ప్రాథమిక బాధ్యతను నెరవేర్చడానికి సంసిద్ధుడయ్యాడు. 


2002 గుజరాత్‌ అల్లర్ల సమయంలో స్వయంగా గుజరాత్‌ను సందర్శించి, కన్నీటి ప్రవాహమయ్యాడు. బాబ్రీ మసీదును ముక్కలుగా కూల్చేస్తే కూలుతున్నవి మసీదులు కాదు, మనుషులే అంటూ ఆవేదన చెందాడు. కాషాయ మూకలు ముస్లిం జిందగీలను కల్లోల పరుస్తుంటే కలంతో అక్షరాల ప్రవాహమై మాట్లాడాడు. ఎక్కడా మతవిద్వేషం రగిలిన దాని ప్రకంపనలు హైదరాబాద్‌ నేల మీద ప్రతిధ్వనిస్తాయి. అప్పుడు కవి యాకూబ్‌ వంటి వారికి నిద్రలేని రాత్రులను మిగులుస్తాయి. అట్లా యాకూబ్‌ సాహిత్య ప్రస్థానంలో ఈ లౌకికవాద దృక్పథం చాలా కీలకమైంది. యాకూబ్‌ కవిత్వంంలో ఈ గాయాలన్నీ గుర్తుకు వచ్చాయి. ఆ గాయాల మీదుగా యాకూబ్‌ కవిత్వాన్ని చూడాలి.

డా.పసునూరి రవీందర్‌

(నేడు, కవి యాకూబ్‌కు 

మఖ్దూం మోహియుద్దీన్‌ జాతీయ అవార్డును 

సిటీ కాలేజ్‌ వారు ప్రదానం చేస్తున్న సందర్భంగా)

Updated Date - 2021-09-16T06:05:41+05:30 IST