అంబారీపై అమ్మ.. సల్లంగా చూడమ్మా..!

ABN , First Publish Date - 2021-07-27T07:24:38+05:30 IST

అంబారీపై ఊరేగింపు

అంబారీపై అమ్మ..  సల్లంగా చూడమ్మా..!

ముగిసిన లష్కర్‌ బోనాలు 

భవిష్యవాణి వినిపించిన స్వర్ణలత

ఆకట్టుకున్న అంబారీ ఊరేగింపు


నేనున్నానంటూ రంగంలో భవిష్యవాణి భరోసా, పోతరాజుల వీరంగాలు, అంబారీ ఊరేగింపు, ఫలహార బండ్ల సందడి వెరసి తెలంగాణ ఆచార వ్యవహారాలు, సంస్కృతీ సాంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే సికింద్రాబాద్‌ ఉజ్జయినీ మహాకాళి బోనాల జాతర అత్యంత వైభవంగా ముగిసింది. ఒళ్లంతా పసుపు రాసుకుని, కాళ్లకు గజ్జలు కట్టుకుని వీరంగాలు చేస్తూ పోతరాజులు అలరించారు. ఆలయం చుట్టుపక్కల నుంచి భక్తజన మండళ్లు, యువజన సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించిన ఫలహార బండ్ల ఊరేగింపు భక్తులను ఆకట్టుకుంది.


సికింద్రాబాద్‌, రాంగోపాల్‌పేట్‌, జూలై 26 (ఆంధ్రజ్యోతి) :

అంబారీపై ఊరేగింపు శోభాయమానంగా సాగింది. కర్నాటక గుల్బర్గాకు చెందిన వీరతపస్వి వీరభద్ర శివచార్యారు, శివదేవర్‌ మఠ్‌కు చెందిన ఏనుగు గజలక్ష్మి మేనకను ఊరేగింపు కోసం తీసుకువచ్చారు. అంబారీపై అమ్మవారి చిత్రపటాన్ని ఏర్పాటు చేసి, దాని ఎదుట విచిత్ర వేషధారణలతో, దేవతా మూర్తుల వేషధారణలతో, మహిళల కోలాటాలతో ఊరేగింపు సాగింది. మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌, ఆలయ కార్యనిర్వహణాధికారి గుత్తా మనోహర్‌రెడ్డి, రాంగోపాల్‌పేట్‌ కార్పొరేటర్‌ చీర సుచిత్రశ్రీకాంత్‌, బేగంపేట్‌ కార్పొరేటర్‌ మహేశ్వరి ప్రత్యేక పూజలు జరిపి, అమ్మవారి సాగనంపు కార్యక్రమాన్ని ప్రారంభించారు. నగర అదనపు పోలీసు కమిషనర్‌ చౌహాన్‌, ఉత్తర మండల డీసీపీ కల్మేశ్వర్‌, మహంకాళి ఏసీపీ రమేష్‌, ఇన్‌స్పెక్టర్‌ కావేటి శ్రీనివాసులు మహంకాళి పోలీస్‌ స్టేషన్‌ ఎదుట ప్రత్యేక పూజలు జరిపారు. అనంతరం అంబారీ ఊరేగింపు మోండా మార్కెట్‌, ఆల్ఫా హోటల్‌ మీదుగా మెట్టుగూడలోని అమ్మవారి ఆలయం వరకు సాగింది. సికింద్రాబాద్‌ తహసీల్దార్‌ బాలశంకర్‌, ఆలయ అనువంశిక ధర్మకర్త, ధర్మకర్తల మండలి చైర్మన్‌ సురిటి కామేశ్వర్‌ పాల్గొన్నారు.

చొరవ చూపిన తలసాని 

మహాకాళి జాతర ప్రశాంతంగా ముగియడంతో మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌తో పాటు పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు. లక్షలాది మంది భక్తులు తరలివచ్చే బోనాల జాతరను సాఫీగా, అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు తలసాని ఆద్యంతం చొరవ చూపారని స్థానికులు పేర్కొన్నారు.  పోలీసులు సైతం సంయమనం పాటించి, అందరి ప్రశంసలు అందుకున్నారు. పోలీసు కమిషనర్‌ అంజనీకుమార్‌, అదనపు పోలీసు కమిషనర్‌ చౌహాన్‌, ఉత్తర మండల డీసీపీ కల్మేశ్వర్‌, మహంకాళి ఏసీపీ రమేష్‌, ఇన్‌స్పెక్టర్‌ కావేటి శ్రీనివాసులు సహా పోలీసు అధికారులు, సిబ్బంది శ్రమించి, జాతర ప్రశాంతంగా జరగడంలో కృతకృత్యులయ్యారు.


Updated Date - 2021-07-27T07:24:38+05:30 IST