సికింద్రాబాద్‌ క్లబ్‌కు ఫైర్‌ సేఫ్టీ అనుమతుల్లేవ్‌..

ABN , First Publish Date - 2022-01-18T15:21:54+05:30 IST

సికింద్రాబాద్‌ క్లబ్‌లోని హెరిటేజ్‌ భనవంలో భారీ అగ్ని ప్రమాదానికి నిర్వాహకుల నిర్లక్ష్యం కూడా ఉన్నట్లు తెలుస్తోంది. ప్రముఖులు సభ్యులుగా ఉన్న ప్రతిష్ఠాత్మకమైన క్లబ్‌కు ఫైర్‌సేఫ్టీ...

సికింద్రాబాద్‌ క్లబ్‌కు ఫైర్‌ సేఫ్టీ అనుమతుల్లేవ్‌..

ప్రమాదం జరిగిన తర్వాతే గుర్తించిన అధికారులు

హైదరాబాద్‌ సిటీ:  సికింద్రాబాద్‌ క్లబ్‌లోని హెరిటేజ్‌ భనవంలో భారీ అగ్ని ప్రమాదానికి నిర్వాహకుల నిర్లక్ష్యం కూడా ఉన్నట్లు తెలుస్తోంది. ప్రముఖులు సభ్యులుగా ఉన్న ప్రతిష్ఠాత్మకమైన క్లబ్‌కు ఫైర్‌సేఫ్టీ అనుమతులు లేకపోవడం పోలీసులను, అగ్నిమాపక శాఖాధికారులనూ, క్లబ్‌ సభ్యులను సైతం విస్మయపరిచింది. ఎలాంటి సేఫ్టీ చర్యలు లేకుండా, అగ్నిమాపక శాఖాధికారుల నుంచి అనుమతుల్లేకుండా క్లబ్‌ను నిర్వహించడాన్ని అధికారులు సీరియస్‌గా తీసుకున్నారు. క్లబ్‌ నిర్వాహకులకు నోటీసులు జారీ చేసినట్లు ప్రాంతీయ అగ్నిమాపక శాఖాధికారి పాపయ్య తెలిపారు. అగ్ని ప్రమాదంతో ఎంత మేర నష్టం జరిగిందో అగ్నిమాపక శాఖాధికారులు కూడా అంచనా వేస్తున్నారు. మరోవైపు సికింద్రాబాద్‌ క్లబ్‌కు ఫైర్‌ సేఫ్టీ అనుమతులు లేవన్న విషయాన్ని అధికారులు ప్రమాదం జరిగిన తర్వాతనే గుర్తించడం కూడా ఆరోపణలకు తావిస్తోంది. ముందస్తుగానే చర్యలు తీసుకోవాల్సిన అధికారులు సైతం భారీ ప్రమాదం జరిగిన తర్వాతనే గుర్తించి నోటీసులు జారీ చేయడం గమనార్హం. 


విచారణ జరుగుతోంది : ఏసీపీ రమేష్‌

సికింద్రాబాద్‌ క్లబ్‌ అగ్నిప్రమాదంపై విచారణ జరుగుతోందని మారేడుపల్లి ఏసీపీ రమేష్‌ తెలిపారు.  ఫైర్‌ సేఫ్టీ, విద్యుత్‌ అధికారులతో పాటు క్లబ్‌ నిర్వాహకుల నుంచి వివరాలు సేకరిస్తున్నామన్నారు. ప్రమాదంలో ఎంతమేరకు నష్టం వాటిల్లిందో ఇప్పుడే చెప్పలేమని, అగ్నిప్రమాదం ఎలా జరిగిందో పూర్తిస్థాయి విచారణ చేస్తున్నామని తెలిపారు.  

Updated Date - 2022-01-18T15:21:54+05:30 IST