కిటకిటలాడే సికింద్రాబాద్‌ స్టేషన్‌ ఇప్పుడు బోసిపోయింది!

ABN , First Publish Date - 2021-05-15T18:00:19+05:30 IST

వేలాది మంది రాకపోకలతో నిత్యం కిటకిటలాడే సికింద్రాబాద్‌ స్టేషన్‌ బోసిపోతోంది.

కిటకిటలాడే సికింద్రాబాద్‌ స్టేషన్‌ ఇప్పుడు బోసిపోయింది!

  • ఖాళీగా రైళ్లు..!
  • లాక్‌డౌన్‌తో భారీగా తగ్గిన ప్రయాణికులు
  • ఆక్యుపెన్సీ లేకపోవడంతో తాత్కాలికంగా రైళ్ల రద్దు

హైదరాబాద్‌ సిటీ : వేలాది మంది రాకపోకలతో నిత్యం కిటకిటలాడే సికింద్రాబాద్‌ స్టేషన్‌ బోసిపోతోంది. విభిన్న వర్గాల ప్రయాణికులతో బోగీల్లో పూర్తిగా నిండే సీట్లు చాలా వరకు ఖాళీగా దర్శనమిస్తున్నాయి. నిన్న, మొన్నటివరకు తాము వెళ్లాల్సిన రైళ్లకు రిజర్వేషన్‌ దొరకక ఇబ్బందులు పడిన ప్యాసింజర్లు.. ప్రస్తుతం ఆన్‌లైన్‌లో వందలాది సీట్లు రమ్మని.. ఆహ్వానిస్తున్నప్పటకీ రైళ్లలో వెళ్లేందుకు సాహసించడం లేదు. ఫలితంగా దక్షిణ మధ్య రైల్వే పరిధిలో రాకపోకలు సాగిస్తున్న సూపర్‌ఫాస్ట్‌, ఎక్స్‌ప్రెస్‌ రైళ్లన్నీ అరకొర ప్రయాణికులతో నడుస్తున్నాయి. రోజురోజుకూ కొవిడ్‌ కేసులు పెరుగుతున్న క్రమంలో ఎప్పుడైనా లాక్‌డౌన్‌ను అమలులోకి తీసుకొస్తారేమోననే భయంతో తమిళనాడు, రాజస్థాన్‌, మధ్యప్రదేశ్‌, ఉత్తరప్రదేశ్‌, ఒడిషా మహారాష్ట్రకు చెందిన వేలాది వలస కార్మికులు 20 రోజుల నుంచే రైళ్ల ద్వారా తమ సొంతూళ్లకు పోతున్నారు. ఈ నెల 11న లాక్‌డౌన్‌ ప్రకటన వెలువడిన వెంటనే భవన నిర్మాణ, హోటళ్లలో పనిచేసే కార్మికులు అందుబాటులో ఉన్న రైళ్లలో ఇళ్లకు తరలివెళ్లారు.


భారీగా తగ్గిన ఆక్యుపెన్సీ..

లాక్‌డౌన్‌ తర్వాత రెండురోజుల నుంచి దానాపూర్‌, చార్మినార్‌, గౌతమి ఎక్స్‌ప్రె్‌సల్లోనే 70-80 శాతం మంది ప్రయాణికులు వెళ్తుండగా, మిగతా రైళ్లలో కనీసం 15-25 శాతం మంది కూడా వెళ్లడం లేదని తెలిసింది. మూడు రోజుల క్రితం తిరుపతి నుంచి వచ్చిన రాయలసీమ సూపర్‌ఫాస్ట్‌ ఎక్స్‌ప్రె్‌సలో 24 బోగీల్లో కేవలం 70 మందే సికింద్రాబాద్‌ స్టేషన్‌లో దిగినట్లు రైల్వేవర్గాలు తెలిపాయి. కరోనా ఎఫెక్ట్‌, లాక్‌డౌన్‌లో రెండు రోజులుగా ప్రతి రైలులో 40 శాతం ఆక్యుపెన్సీ కూడా ఉండడంలేదని సికింద్రాబాద్‌ ఆర్‌పీఎఫ్‌ పోలీసు అధికారి ఒకరు తెలిపారు. దీంతో దక్షిణ మధ్య రైల్వే వివిధ మార్గాల్లో సర్వీసులను తాత్కాలికంగా రద్దు చేస్తోంది.


రైలు దిగిన తర్వాత అవస్థలు..

నగరంలో ఉదయం 6 నుంచి 10 వరకు కార్యకలాపాలకు అనుమతినిచ్చిన ప్రభుత్వం 10 తర్వాత నుంచి బంద్‌ చేయాలని ప్రకటించింది. దీంతో ఆయా రైళ్లలో నగరానికి వస్తున్న పలువురు ప్యాసింజర్లు సమయం దాటిన తర్వాత లోకల్‌ ప్రయాణానికి ఆటోలు, క్యాబ్‌లు, బస్సులు అందుబాటులో లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడు తున్నారు. 10 గంటల తర్వాత ఎలాంటి వాహనాలూ తిరగకపోవడంతో నగరంలోని తమ ఇళ్లకు చేరేందుకు కొందరు నడకబాట పడుతున్నారు. ఒడిషా, మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌కు వెళ్లే వలస కూలీలు మాత్రం ఉదయం 6 నుంచి 7 గంటలలోపు బస్సులు, ఆటోల ద్వారా సికింద్రాబాద్‌ స్టేషన్‌కు చేరుకుంటున్నారు. రైలు వచ్చే గంట ముందే స్టేషన్‌ లోపలికి  పోలీసులు అనుమతినిస్తుండడంతో గంటల తరబడి స్టేషన్‌ బయట పడిగాపులు కాస్తున్నారు.

Updated Date - 2021-05-15T18:00:19+05:30 IST