Abn logo
Sep 26 2021 @ 23:53PM

డిపాజిట్లు భద్రం

సభలో మాట్లాడుతున్న సొసైటీ అధ్యక్షుడు కర్రి అప్పలస్వామి

ఎవరూ ఆందోళన చెందొద్దు

తప్పుడు ఫిర్యాదుదారులపై చట్టపరంగా చర్యలు

మహాజన సభలో అడివివరం సొసైటీ అధ్యక్షులు కర్రి అప్పలస్వామి

సింహాచలం, సెప్టెంబరు 26: ఎందరో పేదలు కష్టపడి సంపాదించి డిపాజిట్లు చేసిన సొమ్ముకు ఎటువంటి ఢోకా లేదని, ఎవరూ ఆందోళన చెందవద్దని అడివివరం సహకార పరపతి సంఘం పాలకమండలి అధ్యక్షుడు కర్రి అప్పలస్వామి సభ్యులకు భరోసా ఇచ్చారు. స్థానిక బృందావనంలో ఆదివారం జరిగిన మహాజన సభలో పాలక మండలి తరపున ఇటీవల చోటుచేసుకున్న పరిణామాలపై ఆయన సమగ్ర వివరణ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొందరు తమ స్వార్థం కోసం రాజకీయ కుట్రకు పాల్పడి నిరాధార ఆర్థిక నేరాలు జరిగాయంటూ ఫిర్యాదులు చేశారని, అటువంటి వ్యక్తులను ఉపేక్షించబోమన్నారు. ఇప్పటికే తప్పుడు కేసు నమోదు చేసిన గోపాలపట్నం సీఐపై, డీసీవోపై ప్రైవేటు కేసు పెట్టామన్నారు. అదే విధంగా తప్పుడు ఆరోపణలు చేసిన మాజీ అధ్యక్షులు వరదా నరసింహమూర్తిపై, ఎర్రా వరాహ నరసింహంపై కూడా త్వరలో చట్టానికి లోబడి చర్యలు తీసుకుంటామన్నారు. ప్రస్తుతం సొసైటీ సుమారు రూ.151 కోట్ల ట్రర్నోవర్‌తో 16 వేల మంది సభ్యులతో అభివృద్ధి పథంలో నడుస్తోందన్నారు. సభ్యుల కోరిక మేరకు బంగారు ఆభరణాల తనఖాపై వడ్డీని 12 శాతం నుంచి 11శాతానికి తగిస్తున్నామని, స్వల్పకాలిక రుణాలకు కూడా వడ్డీ రేటు తగ్గిస్తున్నామన్నారు. 2013 వరకు రుణాలు తీసుకున్న వారికి వన్‌టైమ్‌ సెటిల్‌మెంట్‌ విధానాన్ని అమలు చేయాలని నిర్ణయించగా, అందుకు మహాజన సభ ఆమోదం తెలిపిందన్నారు. పాలకమండలి సభ్యుడు గంట్ల శ్రీనుబాబు మాట్లాడుతూ గతంలో ప్రైవేటు సొసైటీకి ఇచ్చిన రుణాలను వసూలు చేసే బాధ్యత నాటి, నేటి పాలకమండలిపై ఉందన్నారు. పాలక మండలి మాజీ సభ్యుడు సతివాడ శంకరరావు మాట్లాడుతూ సభ్యులకు హెల్త్‌ ఇన్యూరెన్స్‌ ఏర్పాటు చేయాలన్నారు. మరో మాజీ సభ్యుడు దాసరి కనకరాజు మాట్లాడతూ గత మహాజన సభలో ఇచ్చిన పలు హామీలు ఇప్పటికీ కార్యరూపం దాల్చలేదన్నారు. పెండింగ్‌లో ఉన్న దీర్ఘకాలిక బకాయిల వసూలుకు తగిన చర్యలు తీసుకోవాలని సాధారణ సభ్యుడు లంక సత్తిబాబు, పాలక మండలిలో కో ఆప్షన్‌ విధానంలో మహిళకు స్థానం కలిపించాలని మరో సాధారణ సభ్యుడు శ్రీధర్‌ కోరారు. ఈ సభలో పాలక మండలి ఉపాధ్యక్షులు రాజనాల సత్యారావు, కొలువు గురునాథరావు, కోరాడ ఈశ్వరరావు, బంటుబిల్లి మహేశ్‌, మజ్జి సూరిబాబు, లోగిశ గణేశ్‌, పోలవరపు శ్రీహరి, గేదెల మురళీకృష్ణ, గునిశెట్టి శ్రీనివాసరావు, మాజీ ఉపాధ్యక్షుడు కొలుసు ఈశ్వరరావు, తదితరులు పాల్గొన్నారు.