UP రైల్వే స్టేషన్లకు భద్రత పెంపు

ABN , First Publish Date - 2021-11-10T22:42:52+05:30 IST

ఉత్తర ప్రదేశ్‌లోని తొమ్మిది జిల్లాల్లో ఉన్న అన్ని రైల్వే స్టేషన్లలో

UP రైల్వే స్టేషన్లకు భద్రత పెంపు

మీరట్ : ఉత్తర ప్రదేశ్‌లోని తొమ్మిది జిల్లాల్లో ఉన్న అన్ని రైల్వే స్టేషన్లలో భద్రతను కట్టుదిట్టం చేశారు. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ నవంబరు 11న మీరట్‌లో పర్యటించనున్న నేపథ్యంలో ఈ జిల్లాల్లోని రైల్వే స్టేషన్లు, దేవాలయాల్లో బాంబు పేలుళ్ళు జరుపుతామని ఓ హెచ్చరిక లేఖ రావడంతో అధికారులు అప్రమత్తమయ్యారు.  అయితే ఇది ఉత్తుత్తి బెదిరింపు లేఖ అని పోలీసులు భావిస్తున్నారు. 


ఈ బెదిరింపు లేఖ మీరట్ సిటీ రైల్వే స్టేషన్ సూపరింటెండెంట్‌కు మంగళవారం అందినట్లు రైల్వే పోలీస్ డీఎస్‌పీ సుదేష్ కుమార్ గుప్తా చెప్పారు. గుర్తు తెలియని వ్యక్తులపై కేసు నమోదు చేశామన్నారు. ప్రాథమికంగా చూసినపుడు ఈ లేఖ ఉత్తుత్తి బెదిరింపేనని తెలుస్తోందన్నారు. ఇటువంటి లేఖ అక్టోబరు 30న హాపూర్ రైల్వే స్టేషన్ సూపరింటెండెంట్ కార్యాలయానికి కూడా వచ్చిందని, తాము స్టేషన్ పరిసరాల్లో క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించామని చెప్పారు. 


స్టేషన్ సూపరింటెండెంట్ ఆర్‌పీ సింగ్ మాట్లాడుతూ, మీరట్, ఘజియాబాద్, హాపూర్, ముజఫర్‌ నగర్, అలీగఢ్, ఖుర్జా, కాన్పూరు, లక్నో, షాజహాన్‌పూర్ జిల్లాల్లోని రైల్వే స్టేషన్లు, దేవాలయాల్లో బాంబు పేలుళ్ళు జరుపుతామని ఈ లేఖలో హెచ్చరించారని తెలిపారు. 


ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ గురువారం మీరట్‌లో పర్యటించనున్న నేపథ్యంలో కట్టుదిట్టమైన నిఘాను ఏర్పాటు చేసినట్లు నగర పోలీసు సూపరింటెండెంట్ వినీత్ భట్నాగర్ చెప్పారు. 


Updated Date - 2021-11-10T22:42:52+05:30 IST