KBC షోలో అద్భుతం.. రూ. కోటి గెలుచుకున్న సెక్యూరిటీ గార్డు కొడుకు.. బీఏ చదువుతున్న ఇతడి ముందు రూ.7కోట్ల ప్రశ్న..!

ABN , First Publish Date - 2021-10-21T22:12:34+05:30 IST

బాలీవుడ్ మెగాస్టార్, బిగ్ బీ అమితాబ్ బచ్చన్.. వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న కౌన్ బనేగా కరోడ్పతి (కేబీసీ) ప్రోగ్రాం ఇప్పటికే 12 సీజన్లను పూర్తి చేసుకున్న విషయం తెలిసిందే. కొద్ది రోజుల క్రితం ప్రారంభమైన సీజన్ 13 కూడా ఏ మాత్రం జోరు తగ్గకుండా.. ప్రే

KBC షోలో అద్భుతం.. రూ. కోటి గెలుచుకున్న సెక్యూరిటీ గార్డు కొడుకు.. బీఏ చదువుతున్న ఇతడి ముందు రూ.7కోట్ల ప్రశ్న..!

ఇంటర్నెట్ డెస్క్: బాలీవుడ్ మెగాస్టార్, బిగ్ బీ అమితాబ్ బచ్చన్.. వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న కౌన్ బనేగా కరోడ్పతి (కేబీసీ) ప్రోగ్రాం ఇప్పటికే 12 సీజన్లను పూర్తి చేసుకున్న విషయం తెలిసిందే. కొద్ది రోజుల క్రితం ప్రారంభమైన సీజన్ 13 కూడా ఏ మాత్రం జోరు తగ్గకుండా.. ప్రేక్షకుల హృదయాలను కొల్లగొడుతోంది. కాగా.. ఈ 13వ సీజన్లో భాగంగా హాట్ సీట్ వరకూ వచ్చిన ఓ యువకుడు అద్భత ప్రతిభ కనబర్చాడు. ఏమాత్రం తడబాటు లేకుండా 15 ప్రశ్నలకు సరైన సమాధానం చెప్పి.. కోటి రూపాయలను గెలుచుకున్నాడు. ఈ క్రమంలో గురువారం రోజు రూ. 7 కోట్ల ప్రశ్నను ఎదుర్కోబోతున్న అతడి గురించిన పూర్తి వివరాల్లోకి వెళితే...



కౌన్ బనేగా కరోడ్పతి సీజన్-13లో భాగంగా హాట్‌సీట్ వరకూ వెళ్లి కోటి రూపాయలు గెలుచుకున్న ఆ యువకుడి పేరు సాహిల్ ఆదిత్య అహిర్‌వాల్. మధ్యప్రదేశ్‌లోని డాక్టర్ హరిసింగ్ గౌర్ విశ్వవిద్యాలయంలో బీ.ఏ చదువుతున్నాడు. తన తండ్రి నోయిడాలో రూ.15వేల జీతానికి సెక్యూరిటీ గార్డుగా పని చేస్తున్నట్లు స్వయంగా సాహిలే.. కేబీసీ షోలో వెల్లడించాడు. తన తండ్రికి లీవ్ దొరకపోవడం వల్ల.. షోకి రాలేకపోయినట్లు వెల్లడించాడు. తన తల్లికి ఈ మధ్యే కిడ్నీ ఆపరేషన్ అయిందని చెప్పాడు. అంతేకాకుండా సివిల్స్ సాధించి.. ఐఏఎస్ ఆఫీసర్ కావడమే లక్ష్యంగా చదువుతున్నట్లు గేమ్ షో మధ్యలో సాహిల్ పేర్కొన్నాడు.



కాగా.. ఈ షోలో 15 ప్రశ్నలకు చకచకా సమాధానం చెప్పి.. రూ. కోటి గెలుచుకున్న సాహిల్.. బిగ్ బీ ప్రశ్నకు సమాధానంగా తనకు తాప్సీ అంటే ఇష్టమని వెల్లడించాడు. ఈ సందర్భంగా సాహిల్.. తాప్సీకి సంబంధించిన కొన్ని విషయాలను బిగ్ బీ ద్వారా తెలుసుకునేందుకు ప్రయత్నించాడు. ‘తాప్పీ, మీరు కలిసి ‘పింక్’ సినిమాలో నటించారు కదా.. ఆమెకు ఇష్టమైన ఆహారం ఏంటో మీకు తెలిసే ఉంటుంది. అదేంటో చెప్పండి’ అని బిగ్ బీని సాహిల్ ప్రశ్నించాడు. అయితే తాప్సీకి ఇష్టమైన ఫుడ్ ఏంటో తనకు తెలియదని అమితాబ్ చెప్పారు. కాగా.. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో.. తాప్సీ స్పందించారు. `సాహిల్.. నాకు ఛోలే బాతురే అంటే చాలా ఇష్టం. మనం ఎప్పుడైనా కలిస్తే కచ్చితంగా ఛోలే బాతురే తిందాం’ అని సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. అంతేకాకుండా రూ. కోటి గెలుచుకున్నందుకు సాహిల్‌ను అభినందించిన ఆమె.. 16వ ప్రశ్నకు కూడా సరైన సమాధానం చెప్పి రూ.7కోట్లు గెలవాలని కోరారు. ఇదిలా ఉంటే.. సాహిల్ 16 ప్రశ్నకు సమాధానం చెప్పి రూ. 7 కోట్లను గెలుచుకుంటాడా లేక కోటి రూపాయలతోనే ఇంటికి వెళతాడా అనే విషయం గురువారం నాడు ప్రసారంమయ్యే ఎపిసోడ్‌లో తెలియనుంది. 




Updated Date - 2021-10-21T22:12:34+05:30 IST