ఏది రాజద్రోహం!?

ABN , First Publish Date - 2021-05-19T09:23:57+05:30 IST

ఇప్పుడు రాజుల్లేరు. రాజ్యాలూ లేవు. కానీ... ‘రాజద్రోహం’ పేరిట పాలకులు కేసుల కొరడా ఝళిపిస్తూనే ఉన్నారు. ప్రశ్నించిన వారిపైనే కాదు... ఆ ప్రశ్నలను వినిపించిన మీడియాపైనా రాజద్రోహం కేసులు పెడుతున్నారు...

ఏది రాజద్రోహం!?

  • ఇది బ్రిటిష్‌ కాలపు చట్టం!
  • ఇప్పుడు భారతీయులపై ప్రయోగం

(విజయవాడ - ఆంధ్రజ్యోతి)

ఇప్పుడు రాజుల్లేరు. రాజ్యాలూ లేవు. కానీ... ‘రాజద్రోహం’ పేరిట పాలకులు కేసుల కొరడా ఝళిపిస్తూనే ఉన్నారు. ప్రశ్నించిన వారిపైనే కాదు... ఆ ప్రశ్నలను వినిపించిన మీడియాపైనా రాజద్రోహం కేసులు పెడుతున్నారు. వైసీపీ ఎంపీ రఘురామరాజుతోపాటు... ఆయనతో చర్చలు నిర్వహించారంటూ ఏబీఎన్‌-ఆంధ్రజ్యోతితోపాటు టీవీ5పై సీఐడీ పోలీసులు సెక్షన్‌ 124 (ఏ) కింద కేసు నమోదు చేశారు. అసలు ఈ సెక్షన్‌ ఏమిటి? ఏం చేస్తే రాజద్రోహం అవుతుంది? వివరాలు విజయవాడకు చెందిన ప్రముఖ న్యాయవాది సుంకర రాజేంద్ర ప్రసాద్‌ మాటల్లోనే...


‘‘సెక్షన్‌ 124 (ఏ)... రాజద్రోహం అనేది బ్రిటిష్‌ కాలం నాటి చట్టం. 1860వ సంవత్సరంలో మెకాలే దీన్ని రూపొందించారు. బ్రిటిష్‌ పాలకులు దీనిని 1898లో భారత్‌లో అమలులోకి  తీసుకొచ్చారు. తమకు వ్యతిరేకంగా పోరాడటాన్ని వారు రాజద్రోహంగా పరిగణించేవారు. భారతీయులను, స్వాతంత్య్ర సమర యోధులను అణచివేయడానికి ఈ సెక్షన్‌ను ఉపయోగించారు. రాజద్రోహ నేరం రుజువైతే జీవిత ఖైదు పడుతుంది. బ్రిటీష్‌ వాళ్లు చేసిన చట్టాన్ని, స్వాతంత్య్రం వచ్చిన తర్వాత కూడా... ఇప్పటికీ ఇప్పటికీ మన దేశంలో అమలు చేస్తున్నారు. కొన్ని ప్రత్యేక పరిస్థితులున్నాయని న్యాయస్థానానికి చూపించడం కోసం 124(ఎ)ను ఉపయోగించుకుంటున్నారు. బ్రిటన్‌లో కూడా రాజద్రోహం చట్టాన్ని రద్దు చేయాలని భావిస్తున్నారు. మన దేశంలో 124(ఏ)ను అమలు చేయాలా, రద్దు చేయాలా అన్న అంశం సుప్రీంకోర్టులో పెండింగ్‌లో ఉంది! తాజాగా ఎంపీ రఘురామరాజుతోపాటు మీడియాపై పెట్టిన కేసుల విషయానికి వస్తే... ఇందులో మొత్తం నాలుగు సెక్షన్లు ప్రయోగించారు. ఏడేళ్లలోపు శిక్ష పడే కేసుల్లో అరెస్టులు వద్దని సుప్రీంకోర్టు చెప్పడంతో... బెయిలు రాకుండా చూసేందుకే 124(ఏ)తోపాటు 153(ఏ) సెక్షన్లను వాడుకున్నట్లు చెప్పవచ్చు.’’


Updated Date - 2021-05-19T09:23:57+05:30 IST