May 17 2021 @ 01:27AM

ఓటీటీలో తక్కువ సౌండ్‌ పెట్టుకుని చూస్తారు!

ఓటీటీ వేదికల్లో చిత్రాలు చూసేవారు సౌండ్‌ చాలా తక్కువ పెట్టుకుని చూస్తారని సంగీత దర్శకుడు ఏఆర్‌ రెహమాన్‌ అన్నారు. సంగీతాన్ని, అందులో మాధుర్యాన్ని సినిమా నుంచి దూరం చేయడం తనకు ఇష్టం లేదని ఓ ఆంగ్ల పత్రికతో ఆయన చెప్పారు. రెహమాన్‌ కథ, సంగీతం అందించడంతో పాటు స్వయంగా నిర్మించిన చిత్రం ‘99 సాంగ్స్‌’. ఈ కరోనా సెకండ్‌ వేవ్‌ సమయంలో థియేటర్లలో విడుదల చేశారు. అనిశ్చిత పరిస్థితుల నడుమ ఓటీటీలో ఎందుకు విడుదల చేయలేదన్న పశ్నకు... ‘‘థియేట్రికల్‌ అనుభూతి కోసమే మేం సినిమా తీశాం. థియేటర్‌ నుంచి దూరంగా తీసుకువెళ్లాలని అనుకోలేదు. అడ్డంకులెన్ని ఎదురైనా ధైర్యంగా నిలబడి పోరాటం చేసినప్పుడే... మనుగడ సాగించగలం. థియేటర్లలో విడుదల చేయడం ద్వారా ఇతరులకు ఓ హోప్‌ ఇవ్వాలనుకున్నాం’’ అని చెప్పారు. ప్రస్తుత సినిమాలు, పాటల గురించి రెహమాన్‌ మాట్లాడుతూ ‘‘ఇప్పుడు ఇండస్ట్రీలో సగం మంది సాంగ్స్‌ను అవాయిడ్‌ చేస్తున్నారు. సంగీత దర్శకులతో కూర్చుని కొంత సమయం వెచ్చించడం మానేసి, కేవలం రీమిక్స్‌లు చేస్తున్నారు. కొంతమంది నిబద్ధతతో పని చేస్తున్నారు. కొందరు చేయడం లేదు. డబ్బులు పెట్టి సినిమా తీసి ఓటీటీలో విడుదల చేస్తున్నారు’’ అని అన్నారు.


విపత్తులు ఎదుర్కొవడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు!

‘‘గతేడాది మానవాళిపై కరోనా అనూహ్యంగా విరుచుకుపడింది. అప్పటితో పోలిస్తే... ఇప్పుడు ఇటువంటి విపత్తులు ఎదుర్కొవడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని అనుకుంటున్నా’’ అని రెహమాన్‌ అభిప్రాయపడ్డారు. కరోనా నేపథ్యంలో ప్రజలందరూ ఒకరికొకరు అండగా ఉంటున్నారనీ, అలా ఉండాల్సిన నిలబడాల్సిన తరుణమిదని ఆయన చెప్పారు. ఇంకా రెహమాన్‌ మాట్లాడుతూ ‘‘ప్రస్తుతం సంక్షోభం నుంచి ఎలా బయటపడాలో, ఎలా కష్టపడాలో ప్రజలు నేర్చుకున్నారు. సామాజిక మాధ్యమాల ద్వారా ఆస్పత్రిపాలైన వారికి నిధులు సేకరిస్తున్నారు. ఇవాళ మనమంతా ఇబ్బంది పడుతున్నాం. త్వరలోనే దీన్నుంచి సమష్టిగా బయటపడతాం’’ అన్నారు.