Abn logo
Jun 6 2021 @ 22:46PM

అనుమతి లేని మిర్చి విత్తనాలు సీజ్‌

అన్నపురెడ్డిపల్లి మండలం గానుగపాడులో మిర్చి విత్తన ప్యాకెట్లను స్వాధీనం చేసుకుంటున్న అధికారులు

జూలూరుపాడు, అన్నపురెడ్డిపల్లిలో స్వాధీనం

జూలూరుపాడు/అన్నపురెడ్డిపల్లి, జూన్‌6: సరైన అనుమతి పత్రాలు లేకుండా విక్రయిస్తున్న మిర్చి విత్తనాలను భద్రాద్రికొత్తగూడెం జిల్లా జూలూరుపాడు, అన్నపురెడ్డిపల్లి మండలాల వ్యవసాయ, పోలీసు అధికారులు ఆదివారం స్వాధీనం చేసుకున్నారు. హైదారాబాద్‌లోని ఓ కంపెనీకి చెందిన యజమాని తన లైసెన్సు రెన్యువల్‌ చేయకుండానే వ్యాపారులకు మిర్చి విత్తనాలను విక్రయించారు. ఈ క్రమంలో జూలూరుపాడుకు చెందిన ఓ విత్తన వ్యాపారి తన షాపులో విక్రయించేందుకు సదరు కంపెనీకి చెందిన రెండు కిలోల ప్యాకెట్లను ఉంచాడు. విషయం తెలుసుకున్న జూలూరుపాడు మండల వ్యవసాయ అధికారి ఏవో రఘుదీపిక, ఏన్కూరు ఎస్‌ఐ శ్రీకాంత్‌ కలిసి సదరు దుకాణాన్ని తనిఖీ చేసి పత్రాలను పరిశీలించారు. రెండు కిలోలకు సంబంధించి 200 ప్యాకెట్లను సీజ్‌ చేశారు. వీటి విలువ రూ.1.30లక్షలు ఉంటుందని ఏవో తెలిపారు. ఎలాంటి అనుమతులు లేకపోవడం, సదరు కంపెనీ లైసెన్సు రెన్యువల్‌ చేయకపోవడంతో వాటిని సీజ్‌ చేశామని అధికారులు తెలిపారు. అలాగే అన్నపురెడ్డిపల్లి మండలం గానుగపాడు గ్రామంలోని ఓ ఫెర్టిలైజర్‌ షాపు యజమాని ఇంటివద్ద అక్రమంగా నిల్వ చేసిన అనుమతులు లేని రూ.1లక్షకు పైగా విలువైన మిర్చి విత్తన ప్యాకెట్లను ఏన్కురు ఎస్‌ఐ శ్రీకాంత్‌, మండల వ్యవసాయాధికారి చటర్జీలు ఆదివారం దాడి చేసి స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్‌కు చెందిన సదరు కంపెనీ లైసెన్స్‌ రెన్యువల్‌ లేకపోవడంతో ఆ కంపెనీ కి చెందిన విత్తనాల ప్యాకెట్టు రెండు కిలోలు ఉండటంతో వాటిని స్వాధీనం చేసుకుని.. సదరు డీలర్‌ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్టు ఎస్‌ఐ శ్రీకాంత్‌ తెలిపారు. 

Advertisement
Advertisement