విత్తన దుకాణాలలో తనిఖీలు

ABN , First Publish Date - 2021-06-24T04:25:12+05:30 IST

సరైన ధ్రువీకరణ పత్రాలులేని విత్తనాలు, పురుగు మందుల దుకాణాలపై వ్యవసాయశాఖ అధికారులు దాడి చేశారు. రూ.7.06 లక్షల విత్తనాలను సీజ్‌ చేశారు. మార్కాపురం సహాయ వ్యవసాయ సంచాలకులు లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో స్థానిక వ్యవసాయాధికారులు బుధవారం తనిఖీలు చేపట్టారు.

విత్తన దుకాణాలలో తనిఖీలు
విత్తన దుకాణాన్ని తనిఖీ చేస్తున్న వ్యవసాయాధికారులు

రూ.7 లక్షల విత్తనాలు సీజ్‌ చేసిన అధికారులు

గిద్దలూరు టౌన్‌, జూన్‌ 23 : సరైన ధ్రువీకరణ పత్రాలులేని విత్తనాలు, పురుగు మందుల దుకాణాలపై వ్యవసాయశాఖ అధికారులు దాడి చేశారు. రూ.7.06 లక్షల విత్తనాలను సీజ్‌ చేశారు. మార్కాపురం సహాయ వ్యవసాయ సంచాలకులు లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో స్థానిక వ్యవసాయాధికారులు బుధవారం తనిఖీలు చేపట్టారు. పట్టణంలో శ్రీసాయి ఆగ్రో ఏజెన్సీ, వంశీకృష్ణ ట్రేడర్స్‌, కన్యకాపరమేశ్వరి ట్రేడర్స్‌, శ్రీకృష్ణ ట్రేడర్స్‌, చీతిరాల నాగేశ్వరరావుకు చెందిన దుకాణాల్లో సోదాలు నిర్వహించారు. అన్ని షాపుల్లో 1471.8 కిలోల విత్తనాలు అనుమతులు లేనివి ఉన్నాయని, వీటి విలువ రూ.7,06,774  ఉంటుందని తెలిపారు. వీటి ప్రిన్సిపల్‌ సర్టిఫికెట్‌ లేనందున సీజ్‌ చేసినట్లు అధికారులు తెలిపారు. రైతులు విత్తనాలు, ఎరువు, పురుగు మందులు కొనుగోలు చేసినపుడు తప్పనిసరిగా బిల్లులు తీసుకోవాలని సూచించారు. ఎవరైనా షాపుల నిర్వాహకులు బిల్లులు ఇవ్వకపోతే ఫిర్యాదు చేయాలన్నారు. తనిఖీలో మండల వ్యవసాయాధికారి రామ్మోహన్‌రెడ్డి, వ్యవసాయ విస్తరణాధికారులు విజయభాస్కర్‌రెడ్డి, శ్రీనివాసరెడ్డి, సంపత్‌కుమార్‌ పాల్గొన్నారు.

పొదిలి : పట్టణంలోని పలు ఎరువుల దుకాణాలను బుధవారం స్పెషల్‌ కలెక్టర్‌ (వెలిగొండప్రాజెక్టు) శైౖలజావందనం తనిఖీలు నిర్వహించారు.పలు దుకాణాలలోని రికార్డులను పరిశీలించి స్టాకు లిస్టు వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం నిర్ణయించిన ధరలకు మాత్రమే ఎరువులు, పురుగుమందు, విత్తనాలు అమ్మాలని చెప్పారు. వ్యవసాయశాఖ డిప్యూటీ కలెక్టర్‌ ఎస్‌.శ్రీనివాసరావు, మార్కెట్‌ ఏడీ ఉపేంద్ర, ఏవో వెంకటేశ్వర్లు ఉన్నారు. 

Updated Date - 2021-06-24T04:25:12+05:30 IST