నిరంతన జ్ఞానాన్వేషి!

ABN , First Publish Date - 2021-02-26T05:47:36+05:30 IST

నిరంతన జ్ఞానాన్వేషి!

నిరంతన జ్ఞానాన్వేషి!

‘ప్రశ్నించడమే జ్ఞాన సంపాదనకు మార్గం’ అని నమ్మిన జెన్‌ గురువు బ్యాంకీ. అతను జపాన్‌లో 1622లో జన్మించాడు. తెలివైనవాడని బాల్యంలోనే గుర్తింపు పొందాడు. అతను దేన్నీ గుడ్డిగా నమ్మేవాడు కాదు. ప్రతిదాన్నీ ప్రశ్నించేవాడు. బ్యాంకీకి పదకొండేళ్ళ వయసున్నప్పుడు అతని తండ్రి సుగా డెసెట్స్‌ మరణించాడు. 


అల్లరి పిల్లవాడైన బ్యాంకీ పన్నెండో ఏట బడిలో చేరాడు. ఉపాధ్యాయులు బోధించే విషయాలపై అతనికి ఎన్నో ప్రశ్నలు, సందేహాలు కలిగేవి. ఆ రోజుల్లో, జపాన్‌ పాఠశాలల్లో కన్‌ఫ్యూషియ్‌స సిద్ధాంతాలనూ, తత్త్వాన్నీ బోధించేవారు. చురుకైన మేధస్సు ఉన్న బ్యాంకీ రకరకాల ప్రశ్నలతో గురువులను తికమక పెట్టేవాడు. గందరగోళమైన భావాలతో అతనికి ఆందోళనగా ఉండేది. పాఠశాలలో ఇమడలేకపోయాడు. ఉపాధ్యాయులు ఇచ్చిన జవాబులతో అతనికి తృప్తి కలగలేదు. దీనితో కన్‌ఫ్యూషియ్‌స మార్గానికీ, బౌద్ధ మతానికి చెందిన మేధావులను వెంబడించాడు. పంతొమ్మిదో యేట...  క్వోటో, ఔసాక, క్యూషు లాంటి పట్టణాలకు వెళ్ళి, అక్కడ ప్రసిద్ధులైన పండితులతో చర్చలు జరిపాడు. ‘ధర్మం అంటే ఏమిటి?’ అని వారిని ప్రశ్నించాడు. ఎవరి సమాధానమూ అతనికి సంతృప్తి కలిగించలేదు. అతను సంచారం మొదలుపెట్టాడు. ఎన్నో ప్రదేశాలు తిరిగాడు. ఆలయాల్లో బసచేసి, భిక్షాటనతో జీవించేవాడు. 


చివరకు అతను ఒక జెన్‌ పూజారిని కలిశాడు. ఆ పూజారి రింజై శాఖకు చెందినవాడు. ‘జాజెన్‌’ అనే ధ్యాన విధానాన్ని అనుసరిస్తే అంతరంగంలోనే అతని తగిన సమాధానం లభిస్తుందని బ్యాంకీకి ఆయన సలహా ఇచ్చాడు. ఆ విధానాన్ని బ్యాంకీ కొన్ని రోజులు అనుసరించాక... క్రమక్రమంగా కొన్ని అనుభవాల ద్వారా... అతని సందేహాలకు సమాధానాలు లభించాయి. ఒక కుటీరాన్ని నిర్మించుకొని, సాధువులా జీవిస్తూ, తన గురువు అంపో జెంజో సూచించిన ‘జాజెన్‌’ విధానాన్ని గంటల తరబడీ అభ్యాసం చేసేవాడు. ఆహారాన్నీ నిర్లక్ష్యం చేశాడు. ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేశాడు. పూర్తిగా ధ్యానంలో గడిపేవాడు. ఈ క్రమంలో అతనికి అనేక ఆధ్యాత్మిక అనుభవాలు కలిగాయి. అదే సమయంలో అతనికి క్షయ వ్యాధి సోకింది. ఒక వైద్యుడిని సంప్రతిస్తే, త్వరలోనే బ్యాంకీకి మరణం సంభవిస్తుందని ఆ వైద్యుడు సూచించాడు. 


అప్పుడు తనకు కలిగిన అనుభవం గురించి బ్యాంకీ వివరిస్తూ ‘‘నా కంఠంలో ఏదో వింత రాపిడి. ఎదురుగా ఉన్న గోడపైన ఉమ్మేసి, దాన్నే తదేకంగా చూస్తూ నిలబడ్డాను. నా తలలో ఆలోచనలు ప్రవాహంలా కదిలాయి. క్రమంగా ఊహకు అందని ప్రశాంతత నెలకొంది. అంతవరకూ దాగుడుమూతలు ఆడిన... జనన మరణాలకు అతీతమైన సత్యం ప్రకాశించింది. నా సందేహాలన్నీ, ప్రశ్నలన్నీ సమసిపోయాయి’’ అని చెప్పాడు.


అంతే! అప్పటి నుంచి ప్రశ్నించడం, తర్కించడం, వాదించడం... అన్నీ నిలిచిపోయాయి. అతని దేహం కొంత బలాన్ని పుంజుకుంది. తన గురువు అంపో జెంజో దగ్గరకు వెళ్ళాడు. జరిగిన దాన్ని వివరించాడు. ‘అది జ్ఞానోదయానికి సంకేతం’ అని అంపో ధ్రువీకరించాడు. ‘‘నాగసాకి నగరానికి వెళ్ళి, అక్కడ చైనా శైలిలో నిర్మించిన సోఫ్‌కూ-జి అనే మందిరంలో ఉండే జెన్‌ గురువు దోషా షోగెన్‌ను కలుసుకో!’’ అని సూచించాడు. 


ఆ సలహా ప్రకారం దోషా షోగెన్‌ను బ్యాంకీ కలుసుకొని, తన అనుభవాన్ని వివరించాడు. అంతా శ్రద్ధగా విన్న దోషా ‘‘ఇది మంచి అనుభవమే! కానీ అదే సంపూర్ణ జ్ఞానం, అత్యుత్తమ జ్ఞానం కాదు’’ అన్నాడు. బ్యాంకీకి బాధ కలిగింది. అక్కడే ఉండిపోయాడు. దోషా బోధలను వింటూ, ఆయన జీవన విధానాన్ని గమనిస్తూ ఉండేవాడు. 1652లో, సామూహిక ధ్యానంలో పాల్గొన్నప్పుడు బ్యాంకీకి సంపూర్ణ జ్ఞానం లభించింది. దోషా కూదా దాన్ని ధ్రువీకరించాడు. అక్కడ మఠంలో ఒక ఉన్నత పదవిని చేపట్టాల్సిందిగా బ్యాంకీని కోరాడు. దాన్ని బ్యాంకీ సున్నితంగా తిరస్కరించి, వంటశాలలో పని చేస్తానన్నాడు. కొంతకాలం అలా పని చేశాక, యెషినో అనే ప్రాంతానికి వెళ్ళి స్థిరపడి, సాధువుగా జీవించాడు. అతని ఉపదేశాలు వినడానికి జనం తండోపతండాలుగా వచ్చేవారు. 


ఒక రోజు బ్యాంకీ ఉపన్యసిస్తూ ఉండగా, అతని పట్ల ఈర్ష్యగా ఉన్న ఒక పూజారి అడ్డుతగిలాడు. ‘‘బ్యాంకీ! ఆపు, ఇక మాట్లాడవద్దు. తెలివి లేనివారే నీ మాటలు విని, నువ్వు చెప్పినట్టు విధేయతతో నడుచుకుంటారు. నాలాంటి వివేకవంతులతో వాదించి, మెప్పించి, విధేయులుగా చేసుకో, చూద్దాం!’’ అని గట్టిగా అరిచాడు.


‘‘నా దగ్గరకు రా!’’ అని అతణ్ణి బ్యాంకీ పిలిచాడు. ఆ పూజారి వెళ్ళాడు. 

‘‘నా ఎడమవైపు నిలబడు’’ అన్నాడు బ్యాంకీ. ఆ మాటను పూజారి పాటించాడు.

వద్దు, నా కుడి వైపు రా!’’ అన్నాడు బ్యాంకీ. పూజారి కుడివైపు వచ్చాడు.

‘‘చూశావా! నా ఆజ్ఞను ఎంత విధేయతతో పాటిస్తున్నావో!’’ అన్నాడు బ్యాంకీ నవ్వుతూ.



బ్యాంకీకి ఉపాధ్యాయులు ఇచ్చిన జవాబులతో అతనికి తృప్తి కలగలేదు. దీనితో కన్‌ఫ్యూషియ్‌స మార్గానికీ, బౌద్ధ మతానికి చెందిన మేధావులను వెంబడించాడు. పంతొమ్మిదో యేట...  అనేక ఊళ్ళకు వెళ్ళాడు. ప్రసిద్ధులైన పండితులతో చర్చలు జరిపాడు. ‘ధర్మం అంటే ఏమిటి?’ అని వారిని ప్రశ్నించాడు. ఎవరి సమాధానమూ అతనికి సంతృప్తి కలిగించలేదు. 


రాచమడుగు శ్రీనివాసులు


Updated Date - 2021-02-26T05:47:36+05:30 IST