సాహితీవేత్త, చిత్రకారుడు శీలా వీర్రాజు ఇకలేరు

ABN , First Publish Date - 2022-06-02T07:56:07+05:30 IST

హైదరాబాద్‌ సిటీ, రాజమహేంద్రవరం, జూన్‌1 (ఆంధ్రజ్యోతి): వచన కవిత్వ రచనలో కథా ప్రక్రియను సమ్మిళితం చేసి ‘కొడిగట్టిన సూరీడు’తో కొత్త శైలికి శ్రీకా రం చుట్టిన సాహితీవేత్త.. దాశరథి

సాహితీవేత్త, చిత్రకారుడు శీలా వీర్రాజు ఇకలేరు

-విద్యార్థి దశ నుంచే రచనా వ్యాసాంగం 

-వచన కవిత్వంలో కథా ప్రక్రియ సమ్మిళితం చేసి 

-‘కొడిగట్టిన సూరీడు’ రచన మైనా, కాంతిపూలు, వెలుగురేఖలు వంటి నవలలు

-వెయ్యికిపైగా సాహితీ పుస్తకాలకు ముఖచిత్రాలు

-సాహితీవేత్తల నివాళి.. నేడు అంత్యక్రియలు

-విద్యార్థి దశ నుంచే రచనా వ్యాసాంగం 

-పలువురు సాహితీవేత్తల నివాళి 

-నేడు సరూర్‌నగర్‌లో అంత్యక్రియలు

హైదరాబాద్‌ సిటీ, రాజమహేంద్రవరం, జూన్‌1 (ఆంధ్రజ్యోతి): వచన కవిత్వ రచనలో కథా ప్రక్రియను సమ్మిళితం చేసి ‘కొడిగట్టిన సూరీడు’తో కొత్త శైలికి శ్రీకా రం చుట్టిన సాహితీవేత్త.. దాశరథి ‘ధ్వజమెత్తిన ప్రజా’, సినారె ‘విశ్వంభర’ వంటి వెయ్యి పుస్తకాలకు ముఖచిత్రాలు గీసిన చిత్రకారుడు శీలా వీర్రాజు (83) ఇకలేరు. బుధవారం సాయంత్రం హైదరాబాద్‌ సరూర్‌నగర్‌లోని స్వగృహంలో గుండెపోటుతో మృతిచెందారు. వీర్రాజుకు భార్య సుభద్రాదేవి, కూతురు పల్లవి ఉన్నారు. సుభద్రాదేవి కూడా పేరున్న రచయిత్రి. వీర్రాజు స్వస్థలం ఏపీలోని రాజమండ్రి. పాఠశాల దశలోనే ‘బాలసాహితి’ అనే చేతిరాత పత్రిక నిర్వహణలో పాలుపంచుకున్నారు. కాలేజీ రోజుల్లో ‘రెండు జీవాలు’ జానపదకథతో రచనా ప్రస్థానాన్ని ప్రారంభించారు. అప్పట్లోనే వర దా వెంకటరత్నం వద్ద చిత్రలేఖనంలో శిక్షణ పొందారు. డిగ్రీ చదువుతున్న రోజుల్లోనే పలు పత్రికల్లో కథలతో పాటు ‘బతుకుబాట’, ‘సహృదయులు’ నవలలను సీరియల్‌గా రాశారు. 1961లో కృష్ణాపత్రికలో సబ్‌-ఎడిటర్‌గా ఉద్యోగ జీవితం ప్రారంభించారు. రెండేళ్లకు ఏపీ సమాచార పౌరసంబంధ శాఖ నిర్వహించే మేగజైన్‌లో వీర్రాజు సహాయ అనువాదకుడిగా చేరారు. అక్కడ అనువాదకుడిగా పనిచేసిన కుందుర్తి ఆంజనేయులు ప్రభావంతో వచన కవిత్వ రచనలో కథా ప్రక్రియను సమ్మిళితం చేసి ‘కొడిగట్టిన సూర్యుడు’ రాశారు. ‘కాంతిపూలు’, ‘కరుణించని దేవత’, ‘వెలుగు రేఖలు’ నవలలు రాశారు. ఆయన కథలతో ‘సమాధి’, ‘మబ్బుతెరలు’, ‘వీర్రాజు కథలు’, ‘రంగుటద్దాలు’, ‘మనసులోని కుంచె’, ‘ఊరు వీడ్కోలు చెప్పింది’ వంటి ఎనిమిది కథా సంపుటాలు.. ‘కలానికి ఇటూఅటూ’ వ్యాస సంపుటి వెలువడ్డాయి. ‘కిటికీ కన్ను’, ‘ఎర్రడబ్బా రైలు’, ‘పడుగుపేకల మధ్య జీవితం’ తదితర ఆరు కవితా సంకలనాలు రాశారు.  వీర్రాజు రాసిన ‘మైనా’ అత్యుత్తమ తెలుగు నవలల్లో ఒకటి. చిత్రకారుడిగానూ వీర్రాజు ఖ్యాతి పొందారు. ఆయన కుంచె నుంచి జాలువారిన లేపాక్షి శిల్ప రేఖాచిత్రాలు పేరు తెచ్చాయి. వీర్రా జు సాహిత్య, చిత్రకళా ప్రతిభకు నాటి సీఎం ఎన్టీఆర్‌ ముగ్ధుడై తన పేషీలో ఆయ న్ను స్ర్కిప్టు రైటర్‌గా నియమించారు. ఆయన రాసిన ‘మైనా’కి ఆంధ్రప్రదేశ్‌ సాహి త్య అకాడమీ పురస్కారం, ‘కొడిగట్టిన సూర్యు డు’ కి ఫ్రీవర్స్‌ ఫ్రంట్‌, కథాసంపుటాలకు తెలుగు వర్సిటీ ఉత్తమ కథా పురస్కారంతో పాటు డాక్టర్‌ బోయి భీమన్న వచన కవితా పురస్కారం, కొండేపూడి శ్రీనివాసరావు సాహితీ పురస్కారం దక్కాయి. వీర్రాజు భౌతికకాయానికి ప్రముఖ కవి కె. శివారెడ్డి నివాళులర్పించారు. అక్షర చిత్ర ప్రేమికుడు, మరో ప్రపంచ భావుకుడు శీలా వీర్రాజు దూరమవడం తీరని విషాదం అంటూ ప్రముఖ కవి నందిని సిధారెడ్డి విచారం వ్యక్తం చేశారు.  కవిత్వపు లోతులను అవగాహన చేసుకొని దానికి తగిన భావచిత్రాలను రూపొందించడంలో వీర్రాజు తనకు తానే సాటి అని తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్‌ జూలూరి గౌరీ శంకర్‌ పేర్కొన్నారు. వీర్రాజు అంత్యక్రియలు గురువారం ఉదయం పది గంటలకు సరూర్‌నగర్‌ పరిసరాల్లోని వివేకానంద నగర్‌ శ్మశానవాటికలో జరగనున్నట్లు కుమార్తె పల్లవి తెలిపారు. 

Updated Date - 2022-06-02T07:56:07+05:30 IST