Abn logo
Nov 30 2020 @ 03:19AM

భిన్న కోణాల సీమ ప్రేమకథ

చలం కథలు చదివినపుడంతా ప్రేమ కోసం పరితపించిన స్త్రీ మూర్తులందరూ కళ్ళముందు నుండి కదిలేవాళ్ళు కాదు. అలాంటి పాత్రలు రాయలసీమ, తెలంగాణ, ఉత్తరాంధ్రల నుండి ఎందుకు రాలేదా అని పరితపించేదాన్ని. దశాబ్దాలుగా వెంటాడుతున్న బాధకు విముక్తి వెతికే ప్రయత్నంలో- చలం స్త్రీ పాత్రలకు ధీటైన పాత్రలను రాయలసీమ కథా సాహిత్యంలో కలుసుకోగలిగాను.


రాయలసీమలో ప్రేమకథలు లేవా? - అనే ఆలోచన కలిగినపుడంతా ఆసక్తిగా పుస్తకాలు తిరగేయడం, మరు సటి రోజు మరో పనిలో కూరుకుపోవడం జరిగేది. చలం కథలు చదివినపుడంతా ప్రేమకోసం పరితపించిన స్త్రీ మూర్తు లందరూ కళ్ళముందు నుండి కదిలేవాళ్ళు కాదు. అలాంటి పాత్రలు రాయలసీమ, తెలంగాణ, ఉత్తరాంధ్రల నుండి ఎందుకు రాలేదా అని పరితపించేదాన్ని. దశాబ్దాలుగా వెంటాడుతున్న బాధకు విముక్తి వెతికే ప్రయత్నంలో- చలం స్త్రీ పాత్రలకు ధీటైన పాత్ర లను- రంగమ్మను, మెర్సీని, మధుర మీనాక్షిని, సిస్టర్‌ రెజీనాను, జాస్మిన్‌, సుధారాణి, అచ్చమ్మవ్వలను- రాయలసీమ కథా సాహిత్యంలో కలుసుకోగలిగాను.


స్త్రీ పురుషుల మధ్య వ్యక్త ప్రేమలున్నట్లే, అవ్యక్త ప్రేమలూ వుంటాయి. సాంఘిక అమోదం లభించ దన్న అనుమానంతో చొరవ తీసుకోలేక పోవడాన్ని గురించి ‘నిత్యకళ్యాణం పచ్చ తోరణం’ కథలో గోపిని కరుణాకర్‌, ‘హృదయం’ కథలో రమణజీవి చిత్రిం చారు. ‘హృదయం’ కథ మొత్తం కథకుని స్వగతంలో నడుస్తుంది. ‘‘నిజానికి ఇక్కడితో కథ అయిపోయింది’’ అంటాడు. కానీ కథ క్లైమాక్స్‌లో అతను అంతగా ఆరాధించిన ఆదిశేషమ్మ ‘‘తదేకమైన చూపు’’ దశాబ్దా లుగా అతని ఆరాధనకు లభించిన ఆమోదముద్ర. 


ప్రేమికులుగా తామున్న పరిస్థితుల్లో ప్రేమసంబంధాలను నిలబెట్టుకోలేని ఆర్థిక అసహాయ స్థితికి కథా రూపం సోదుం రామ్మోహన్‌ ‘క్లైమాక్స్‌ లేని కథ’. సరిగ్గా క్లైమాక్స్‌ వచ్చేసరికి కథను అర్ధాంతరంగా ముగించినట్లుగా, కథకుడు భావించినట్లుగానే పాఠకుడూ భావిస్తాడు. కానీ ఏ రచయితా కథను అర్ధాంతరంగా ముగించడు. కొన్ని సమస్యలకు పరిష్కా రాన్ని పాఠకుల ఊహలకే వదిలేస్తాడు. అంతేకాదు కొన్ని సమ స్యలకు పరిష్కారం కూడా వుండదు. సమస్యలు సమస్యలుగా మిగిలిపోవు. ఒక్కో సందర్భంలో ఒక సమస్య మరో సమస్యతో ముడిపడి వుంటుంది. లేదా మరో కొత్త సమస్యకు దారి తీయొచ్చు. సమస్య తీవ్రతనుబట్టి రచయిత ఎక్కడో ఒక దగ్గర కథను నిలపడం వల్లనే ప్రయోజనం ద్విగుణీకృతమవుతుంది. 


‘క్లైమాక్స్‌ లేని కథ’ (సోదుం రామ్మోహన్‌), ‘జాస్మిన్‌’ (యం.హరికిషన్‌), ‘మొలకలపున్నమి’ (వేంపల్లి గంగా ధర్‌) కథలు ఒకరకంగా విషాదాంత కథలు. ఈ కథలు చదివిన పాఠకుల కనుకొలుకులలో నిలిచిన కన్నీటి చుక్కలతో హృదయం ప్రక్షాళనమవుతుంది. 


రాయలసీమలో ప్రేమించాలన్నా, ప్రేమను వ్యక్తం చేయాలన్నా, ప్రేమలు నిలబడాలన్నా కూడా ఆర్థిక స్థితే ప్రధాన భూమిక పోషిస్తుందనిపిస్తుంది. ‘నీకూ నాకూ మధ్య నిశీధి’ (సింగమనేని నారాయణ), ‘క్లైమాక్స్‌ లేని కథ’ (సోదుం రామ్మోహన్‌), ‘ఇల్లీగల్‌ లవ్‌ స్టోరీ’ (సుంకోజి దేవేంద్ర), ‘ప్రేమ రూపం’ (కేతు విశ్వనాథరెడ్డి), ‘ఆగామి వసంతం’ (బండి నారాయణ స్వామి), ‘జాస్మిన్‌’ (యం. హరికిషన్‌) కథలు ఈ సత్యాన్నే ఎరుకపరిచాయి. 


‘టోపీ జబ్బార్‌’ (వేంపల్లి షరీఫ్‌) వస్తుపరంగా శిల్పపరంగా చాలా వైవిధ్యమైన కథ. మైనారిటీ అస్తిత్వాన్ని, కౌమారదశలోని ప్రేమను రెండింటిని సమపాళ్ళలో రంగరించిన శక్తివంతమైన కథ. అల్పసంఖ్యాకులకు సహజంగానే న్యూనతావం అంతర్లీనంగా వుంటుంది. అది సిగ్గు, బిడియాల రూపంలో వ్యక్తమవుతుంది. అలా వ్యక్తమవడానికి షరీఫ్‌ ఎంచుకున్న పాత్రలు కౌమార దశ లోనివి కావడం ఔచిత్య ప్రాధాన్యతను పొందింది. జబ్బార్‌ అమ్ములుకు టోపీతో కనబడక పోవడానికి కేవలం అందం మాత్రమే సమస్య కాదు. అది అస్తిత్వ సమస్య. ఏజుట్టైతే మత ప్రాధాన్యంగల టోపీని జబ్బార్‌ పెట్టుకోకపోవడానికి కారణమ య్యిందో, అదే అందమైన జుట్టును వదులుకోవడం ఆమె స్వేచ్ఛగా అంటే అధికసంఖ్యాకుల స్వేచ్ఛగా వ్యక్తీకరించబడింది. 


రాయలసీమ ఫ్యూడల్‌ భూస్వామ్యవర్గం స్త్రీలపట్ల ఎంత గాఢ మైన మోహావేశాలు కలిగివున్నా, అధిగమించలేని సామాజిక స్థితికి లోబడి వ్యవహరించాల్సివస్తుందనే ముసుగు వేయటం పరిపాటి. అలాంటి స్వార్థపూరిత అభిజాత్య ప్రవర్తనలను బట్ట బయలుచేసిన శక్తివంత  మైన స్త్రీ పాత్రలు పాలగిరి విశ్వ ప్రసాద్‌ ‘కరివేపాకు’, సన్నపు రెడ్డి వెంకట్రామిరెడ్డి ‘బొగ్గుల బట్టి’ కథల్లో చూడగలం. 


వీరిద్దరూ ఫ్యూడల్‌ కుటుంబ నేపథ్యం గల రచయితలు కావడం ఒక కారణమైతే, పితృస్వామిక తాత్విక రాజకీయాలను అర్థం చేసుకోవటం వల్ల కూడా ఇలాంటి పాత్రచిత్రణ సాధ్య మైంది. స్త్రీల ప్రేమను పొందేంతవరకు తపించిన బొగ్గులబట్టి యజమాని మస్తాన్‌ రెడ్డిగానీ, కరివేపాకులా మెర్సీ ప్రేమను పరిత్యజించిన విస్సుగానీ వాళ్ళను వశం చేసుకునేంతవరకు చూపించింది భౌతికపరమైన మోహావేశమే తప్ప, ప్రేమ కాదు. వాళ్ళ తత్వాన్ని గ్రహించలేనంత ప్రేమైక మోహంలో మునిగిన ప్రేమ మూర్తులు ఈ కథల్లోని స్త్రీలు. కానీ తమను, తమ ప్రేమను నిర్లక్ష్యంచేసిన పురుష, భూస్వామ్య అహంభావాలను నిరాకరించి, తృణీకరించిన మానసిక స్థైర్యమే వీరి వ్యక్తిత్వం. స్త్రీపురుషుల మధ్య మోహాన్నీ, స్నేహాన్నీ, ప్రణయాన్ని అర్థం చేసుకోగలిగే స్థాయిగల వాళ్ళు చాలా తక్కువమంది. వారి వెనుక లేకిగా మాట్లాడేవారే ఎక్కువ. ఆలాంటివాళ్ళు హృదయౌ న్నత్యాన్ని అలవరుచుకోవాల్సేవుందన్న సత్యాన్ని ఋజువుపరిచిన కథానాయికలు వీరు. ఎంత తీవ్రంగా ప్రేమకోసం తపించారో అంతే స్థిరంగా వాళ్ళను త్యజించగలిగారు. (ఈమాత్రం స్థైర్యం చలం రాజేశ్వరి కూడా చేయలేకపోయింది.)


స్త్రీ హృదయాన్ని అర్థం చేసుకోవడానికి శరీరాన్నీ, మనసునూ ఏకకాలంలో ఒకే రీతిగా ప్రేమించగలిగే హృదయం ‘జాస్మిన్‌’ (యం.హరికిషన్‌) కథలో పరిమళిస్తుంది. ఈనాటికి స్త్రీకి గుర్తింపు భౌతికం గానే వుంది. స్త్రీ శరీరం కోసం వేరే దారులు వెదుక్కొనే మగవాళ్ళు ఈనాటికీ కొత్తగాదు. కానీ పరిస్థితుల ప్రమేయంతో మరోదారిలేక తమ అందాన్నే జీవనోపాధిగా చేసుకొన్న స్త్రీల బతుకు గమ్యం -బస్టాండులో భిక్షువర్షీయసై దర్శనమిస్తే, పగిలింది ఆ ప్రేమికుని గుండేనా?... పాఠకుల గుండెలు కూడా.


ఆర్‌.యస్‌.సుదర్శనం ‘మధుర మీనాక్షి’ కథ ప్రేమైకతత్వాన్ని ఆధ్యాత్మిక, అస్తిత్వ, తాత్విక నేపథ్యం నుండి చిత్రించిన వైవిధ్య మైన కథ. మధురమీనాక్షి దర్శనం ద్వారా పొందిన మానసిక అనుభూతి, తత్వశాస్త్ర అధ్యాపకురాలి శారీరక అనుభవంతో పొందిన సంతృప్తితో లంకె. అందుకే భౌతిక అనుభవాన్ని అందిం చిన మీనాక్షిని సొంతం చేసుకోవాలని తపిస్తాడు. అతనికి ఆమెపై కలిగిన ఇష్టానికి ప్రాతిపదికలు లేవు. కథంతా ఆమె పట్ల అతని అనుభూతులు, అనుభవాలే వున్నాయి. రెండవ పార్శ్వం లో, అంటే ఆమెవైపు నుండి కూడా, చిత్రించివుంటే కథకు సమగ్రత చేకూరేది. అతని దృష్టిలో ఆమె ఒక విరాగి. అతన్ని గురించి ఆమె ఏమనుకుంటుందో రచయిత చెప్పలేదు. అతని కోరిక మేరకే ఆమె సమాగమానికి సంసిద్ధమవుతుంది. తరు వాత దగ్ధమౌతుంది. భౌతిక సుఖాన్నిచ్చిన మీనాక్షి మరణిం చింది. పారలౌకిక ఆనందాన్ని అందించే మధుర మీనాక్షి శాశ్వ తమైనదన్న గ్రహింపు కలుగుతుంది. ఈ అన్వేషణ అతనికి సంతృప్తినిచ్చింది. 


‘వెదురుపువ్వు’ (మధురాంతకం నరేంద్ర), ‘పదబంభరం’ (ఎన్‌. కృష్ణమూర్తి) కథలు చదవడం ఒక అనుభవం. చాలా సరదాగా సాగే కథనం. ప్రేమలోపడినవాళ్ళు మూర్ఖత్వంలోకి జారిపోతారని, తమ తెలివి, హోదా ఇవేవి మినహా యింపు కావనీ ఈ కథ చెబుతుంది. ‘వెదురుపువ్వు’ కథలో ప్రేమపిచ్చితో పడిన పాట్లను పాఠకులు ఎంత ఎంజాయ్‌ చేస్తారంటే, తమ పరిసరాలనే కాదు సమస్త ప్రపంచాన్ని మరచిపోతారు. 


ఏ అంశమైనా ఏ అనుభవమైనా స్త్రీలకెలా వుంటుందో ఆలోచించాలన్న కొత్త సంస్కారం ‘మొలకల పున్నమి’ (వేంపల్లి గంగాధర్‌) కథలో వ్యక్తమవు తుంది. కామందు తమ వ్యవసాయ క్షేత్రంలో పనిచేసే శ్యామలను అనుభవించేందుకు అనేక విధాలా ప్రయత్నం చేస్తాడు. ఆమె తన వెంటబడుతున్న కామందును కాక అతని స్నేహితుడు, పాలేరు లాంటి సాంబడిని ప్రేమిస్తుంది. సాంబడి మరణం తరువాత కూడా అతన్నే ప్రేమిస్తున్న శ్యామల నిర్మల మైన ప్రేమ అతని వాంఛను జయిస్తుంది. రాయలసీమలోని గిరిజన లంబాడీ బిడికీలలో మొల కల పున్నమి పండుగ చాలా విశేషంగా జరు పుకుంటారు. స్థానీ య, వైవిధ్య సాం స్కృతిక పరిమళం ఈ కథలో నిండుగా వుండటంతో పాఠకులు కరుణరసార్ద్రతలలో తడిసిపోతారు. 


విషమ పరిస్థితులలో విడాకులు తీసుకోవాల్సివచ్చిన భార్యా భర్తలు విడాకుల తరువాత కూడా ప్రేమికులుగానే కొనసాగు తారు; గుండె నిండా ప్రేమనింపుకున్న వారికి ఏవీ అవరోధాలు కావన్న భరోసా నిస్తుంది- ‘ఇల్లీగల్‌ లవ్‌ స్టోరీ’ (సుంకోజి దేవేంద్ర). ప్రేమైనా, వ్యవసాయమైనా ఆర్థికాంశాలకు అతీతం కాదని చెప్పిన కథ ‘నీకూ నాకూ మధ్య నిశీధి’ (సింగమనేని). ఆర్థిక విలువలు మానవీయ విలువల్ని కుంచింప జేస్తాయన్న సందే శాత్మక సూచన ఈకథలో వుంది. ఇక్కడే రచయిత ప్రాపంచిక దృక్పథం ప్రస్పుటంగా తెలుస్తుంది. ఈ కథకు ‘ఆగామి వసంతం’ కథ భిన్నమైనది. స్త్రీ పురుష సంబంధాలు అవసరాలకు అతీత మైనవేమి కావనీ, మానవ సంబంధాలను నిర్దేశించే శక్తి ఆర్థిక అంశాలకు లేదనీ అలా సిద్ధాంతీకరించే వారి వాదనను వ్యతిరే కిస్తూ, అలాంటి వ్యక్తీకరణలను అమానుషత్వంగా ఈ కథలో బండి నారాయణ స్వామి ప్రతిపాదించారు. మనిషి జీవితం కాలానుగుణంగా మారుతున్న క్రమంలో ప్రేమ, స్నేహం, సహా నుభూతుల స్వరూపంకూడా మారుతుంటాయన్న సూత్రీకరణ చేశారు. 


రాయలసీమ ప్రేమకథలు ఈ నేలలోని వ్యవసాయ సంక్షోభం (‘నీకూ నాకూ మధ్య నిశీధి’, ‘ఆగామి వసంతం’, ‘ప్రేమరూపం’), పేదరికం (‘క్లైమాక్స్‌ లేని కథ’, ‘జాస్మిన్‌’, ‘ఇల్లీగల్‌ లవ్‌ స్టోరీ’), భూస్వాముల అభిజాత్యం (‘ప్రియబాంధవి’, ‘బొగ్గులబట్టి’, ‘కరి వేపాకు’, ‘మొలకల పున్నమి’, ‘ప్రేమరూపం’), మైనారిటీ అస్తిత్వం (‘టోపీ జబ్బార్‌’), భార్యాభర్తల అన్యోన ప్రేమ (‘పదబంభరం’, ‘ఇల్లీగల్‌ లవ్‌ స్టోరీ’), తాత్విక కోణాన్ని అందించిన (‘మధుర మీనాక్షి’, ‘వెదురుపువ్వు’) కథలు వస్తుపరంగా, శిల్పపరంగా వైవిధ్యమైనవి. రాయల సీమకథా సాంస్కృతిక సరోవరంలో పరిమళించిన ప్రేమసుమాలివి.

కె. శ్రీదేవి,

94414 04080


Advertisement
Advertisement
Advertisement