సీమ సాహితీ పతాక సింగమనేని

ABN , First Publish Date - 2021-02-26T06:24:35+05:30 IST

ఇది1972 నాటి మాట గుం టూరులో విరసం సభల చివరి రోజు. బహిరంగ సభ ముగింపుకు వస్తోంది. ఏదో పని మీద గాంధీ పార్కు బైటికి వచ్చాను...

సీమ సాహితీ పతాక సింగమనేని

నివాళి : సింగమనేని నారాయణ 1943–2021

ఇది1972 నాటి మాట గుం టూరులో విరసం సభల చివరి రోజు. బహిరంగ సభ ముగింపుకు వస్తోంది. ఏదో పని మీద గాంధీ పార్కు బైటికి వచ్చాను. శ్రీశ్రీగారు మహాకవినని మర్చిపోయి సభలోంచి వచ్చి సామాన్యుడి మాదిరి నడిచిపోతున్నాడు. నేను శ్రీశ్రీగారిని కనిపించేంతవరకు చూసి పక్కకు తిరిగి చూస్తే నాలాగే ఒక ఎత్తయిన మనిషి శ్రీశ్రీని చూసి నా వైపు తిరిగి ‘చూసారా శ్రీశ్రీ ఎంత సామాన్యుడిలాగ వెళ్ళిపోతున్నాడో’ అన్నారు. ఆయనే సింగమనేని నారాయణ. ఆనాటి పరిచయం జనసాహితీ సమాఖ్యలో స్నేహంగా మారి, ఆ తర్వాత ఆప్తమిత్రులమై వ్యక్తిగత, రాజకీయ, సాహిత్య విషయాలన్నిటినీ స్వేచ్ఛగా మాట్లాడుకోగలిగేంత సన్నిహితులమయ్యాం. 


రాయలసీమ కథలెన్నింటినో చెప్పేవారు. అనంతపురంలో సింగమనేని ఇల్లే ఒక కథానిలయం. కథకుల నిలయం. ఎందరో మహారచయితలు వారింట్లోనే పరిచయమయ్యారు. కేవలం కథకులే కాదు. జలసాధన సమితి సభ్యులు, వామపక్ష రాజకీయ కార్యకర్తలు, ప్రజాస్వామ్య పరిరక్షణ సంఘాలవారూ ఎందరో వారింటికి వచ్చేవారు. అందరితో కలిసి పని చేస్తూనే తన ఆలోచనల విషయంలో అభిప్రాయాలలో, విలువలలో ఎంతో నిక్కచ్చిగా రాజీపడకుండా ఉండే ఆయన తీరు ఆశ్చర్యమనిపించేది. తనకు నచ్చని వైఖరులను చెప్పేటప్పుడు ఎంత నిష్కర్షగానో ఉంటూ అందరితోనూ ఆప్యాయంగా ఉండటం ఆయన ఒక్కరికే సాధ్యం. 


ఆయన సంపాదకత్వంలో వచ్చిన ‘సీమ కథలు’ సంకలనంతో రాయలసీమ కథకులంతా ఒకచోటికి చేరారు. అనంతపురం కథకుల జిల్లా అయింది. అనంతపురం అంటే సింగమనేనికి వల్లమాలిన మమకారం. నాలుగు రోజులు అనంతపురం ఒదిలివుంటే నీళ్ళలోనుంచి బైటపడ్డ చేపలా గిలగిలలాడి పోయేవారు. అనంతపురం జిల్లా వైశాల్యం, జనాభా, వనరులు, సమస్యలు సమస్తం ఆయనకు కంఠోపాఠం. ఏ విషయం మీద మాట్లాడుతున్నా అనంతపురాన్ని అక్కడికి తెచ్చేవారు. చాలాసార్లు హాస్యంగా మీరు ఆవు వ్యాసం రాస్తున్నారని అంటే నవ్వుకునేవారే గాని అనంతపురం గురించి మాట్లాడటం మానేవారు కాదు. 


‘అడుసు’, ‘జూదం’ కథలతో రాయలసీమ రైతు జీవితాన్ని తెలుగువారందరికీ చూపించిన సింగమనేని తన చివరి కథలో స్త్రీల ఇంటి చాకిరిని వస్తువుగా తీసుకున్నారు. ‘తెలుగు కథకులు - కథన రీతులు’ అనే శీర్షికతో తెలుగు సాహిత్యంలోని ముఖ్యులైన కథకులపై వ్యాసాలు రాయించి సంపాదకునిగా సంకలనాలు తీసుకువచ్చారు. ఆయన చేసిన సాహిత్య కృషి గురించి ఒక్కమాట ఎన్నడూ ఆడంబరంగా, అతిశయంగా మాట్లాడలేదు. అదంతా చేయవలసిన బాధ్యతవలే స్వీకరించారు. 


వృత్తిరీత్యా ఉపాధ్యాయుడు. తన తరగతిలో చురుకుగా చదువుకునే ఆడపిల్లలను చూసి ఎంత సంతోషపడేవారో చెప్పలేము. రాబోయే రోజులన్నీ ఈ ఆడపిల్లలవే అని ఆనందంగా చెప్పేవారు. తెలుగు పద్యాలను అర్థవంతంగా చదువుకుంటూ, చదివి వినిపిస్తూ ఆనందపడేవారు. భర్తృహరి, పోతన, తిక్కన పద్యాలు, శ్రీశీ, తిలక్ కవితలు నిద్రలో లేపి అడిగినా చెప్పేవారు. మార్క్సిజాన్ని మనసా వాచా నమ్మి ఆ విలువల ప్రకారం జీవించేందుకు చివరి వరకూ ప్రయత్నించారు. ఆయన మంచి వక్త కూడా. అనేక విషయాల గురించి ఆయన చేసిన ఉపన్యాసాలు రికార్డు చేసి ఉంచాల్సినంత విలువైనవి. తెలుగు రాష్ట్రాలలో సాహితీపరులు, సాహిత్యాభిమానులందరూ ఆయన ఉపన్యాసాలు వినే ఉంటారు. అంత విరివిగా సభలలో పాల్గొని వివిధ విషయాల మీద మాట్లాడేవారు. 


నేనూ, కుటుంబరావు సింగమనేనిగారి కోసం అనంతపురం వెళ్ళేవాళ్ళం. వారి కుటుంబంలో అందరూ మాకు ఆప్తులే. నారాయణగారు హైదరాబాదు వస్తే మా ఇంటికే వచ్చేవారు. 2018లో ఆయనకు 75 సంవత్సరాలు నిండిన సందర్భంలో వెళ్ళాం. నాలుగైదు రోజులు సన్నపురెడ్డి వెంకటరామిరెడ్డి కవితలు, కథలు చదువుకుంటూ గడిపాం. ఆయన గౌరవార్థం జూన్ 26న 


ఒక సభ జరిగింది. ఎంతో విలువైన రోజులని అప్పుడు తెలియలేదు. ఆ తర్వాత సింగమనేని గారి దగ్గరకు వెళ్ళటం కుదరలేదు. ఫోనులో తరచూ మాట్లాడుతూనే ఉన్నాం. ఆయన ఆరోగ్యం గురించి ఆందోళన పడుతూనే ఉన్నాం. ఆయన హాస్పిటల్‌లో చేరటానికి ముందురోజు ఫోన్‌ చేశారు. ఒక కవిత చదివి ‘ఎవరిది ఈ కవిత. కవి పేరు గుర్తురావటం లేదు’. అన్నారు. తిలక్‌ కవిత కదా అంటే– చూశారా ఎలా మర్చిపోతున్నానో అంటూ ఆ కవిత విశిష్టత గురించి చాలాసేపు మాట్లాడారు. ‘తిలక్‌ శత జయంతి బాగా జరపాలి. నేను మంచి వ్యాసం రాస్తాను’ అన్నారు. ఆ మాట నిలబెట్టుకోకుండానే వెళ్లి పోయారు.


సింగమనేని నారాయణ గారు లేరనుకుంటే ఒక పెద్ద అండ కోల్పోయినట్లు బాధపడే రచయితలు, మిత్రులు ఎందరో ఉంటారు. ఆయన ఇచ్చే నైతిక స్ధైర్యం మాటలలో చెప్పలేనిది. ఆయన పంచిపెట్టే స్నేహ వాత్సల్యాలు ఏ కొలతలకూ అందనివి. రాయలసీమ గౌరవ పతాకవలే జీవించారు. తెలుగు సాహిత్యమే ఊపిరిగా బతికారు. ప్రజా ఉద్యమాలన్నిటితో కలిసి నడిచారు. అర్ధవంతమైన జీవితమాయనది. తన పిల్లలలో ఇద్దరు తెలుగు ఉపాధ్యాయులైనందుకు ఆయన గర్వపడినట్టుగా ఒక సాఫ్ట్‌వేర్‌ కంపెనీ సిఇవో తండ్రి కూడా గర్వపడి ఉండడు. ప్రభుత్వ పాఠశాలలో తెలుగు పాఠాలు చెప్పే అదృష్టం కలిగినందుకు చాలా అతిశయం పోయేవారు. తెలుగు భాషా సౌందర్యాన్ని, మాధుర్యాన్ని ఆయనవలే అనుభవించి పలవరించేవారు అతి తక్కువగా ఉంటారు. నిరాడంబరంగా, గౌరవంగా, విలువలు పాటిస్తూ జీవించిన గొప్ప మనిషి. అలాంటి మనుషులు వెళ్ళిపోతే ఆ వెలితి ఎన్నటికీ పూడదు. ఆయనకు వీడ్కోలు చెప్పాలంటే చాలా కష్టంగా ఉంది. అయోమయంగా మాటలు రానట్టుగా ఉంది. ఏమైనా జీవితమంతా నిజాయితీగా తల ఎత్తుకు జీవించిన, అలాగే వెళ్ళిపోయిన మంచి మిత్రునికి వీడ్కోలు చెబుతూ..

ఓల్గా

Updated Date - 2021-02-26T06:24:35+05:30 IST