సీమసాహితి పాండురంగారెడ్డి మృతి

ABN , First Publish Date - 2020-08-04T10:48:01+05:30 IST

ప్రముఖ కవి, రచయిత, రాయలసీమ ఉద్యమకారుడు బి. పాండురంగారెడ్డి(74) సోమవారం ఉదయం కన్నుమూశారు.

సీమసాహితి పాండురంగారెడ్డి మృతి

ఉపాధ్యాయ ఉద్యమ నాయుడిగా సేవలు

రాయలసీమ పార్టీ నాయకుడిగా ఉద్యమాలు

పలువురు ప్రముఖుల సంతాపం


కర్నూలు (కల్చరల్‌)/నంద్యాల(ఎడ్యుకేషన్‌), ఆగస్టు 3: ప్రముఖ కవి, రచయిత, రాయలసీమ ఉద్యమకారుడు బి. పాండురంగారెడ్డి(74) సోమవారం ఉదయం కన్నుమూశారు. అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరిన ఆయన కోలుకోలేక మృతి చెందారు. ఆయన మృతికి విప్లవ రచయితల సంఘం, అభ్యుదయ రచయితల సంఘం, సాహిత్య పరిషత్‌, ఆంధ్రప్రదేశ్‌ టీచర్స్‌ ఫెడరేషన్‌, రాయలసీమ పార్టీ నాయకులు సంతాపాన్ని వ్యక్తం చేశారు.


విప్లవ భావాలతో సాహిత్య కృషి 

పాండురంగారెడ్డి 1946లో నంద్యాల సమీపంలోని గోవిందపల్లెలో జన్మించారు. తిరుపతిలో విద్వాన్‌ చదివి 1968లో మొలగవల్లి గ్రామంలో ఉపాధ్యాయ వృత్తిలో ప్రవేశించారు. ఇప్పటి సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ, ప్రముఖ గాయకుడు అరుణోదయ రామారావు ఈయనకు ప్రత్యక్ష శిష్యులు. ఆయన తర్వాత హైస్కూల్‌లో పనిచేశారు. ఆంధ్రప్రదేశ్‌ ఉపాధ్యాయ ఫెడరేషన్‌ (ఏపీటీఎఫ్‌)లో నాయకత్వ బాధ్యతలు చేపట్టి, ఆ సంఘం నేతగా ఉపాధ్యాయుల సమస్యలపై అనేక పోరాటాలు చేశారు. ప్రభుత్వాల ఉద్యోగ, కార్మిక వ్యతిరేక విధానాలపై 1970వ దశకంలోనే సమరశీల పోరాటాలకు నాయకత్వం వహించారు. ఉపాధ్యాయ ఉద్యమాల నిర్మాతగా రెండు దశాబ్దాల పాటు ఏపీటీఎఫ్‌ నాయకుడిగా పని చేశారు. ‘ఉపాధ్యాయ’ పత్రికకు 1992 నుంచి 2006 వరకు సంపాదకుడిగా పనిచేశారు.


ఏపీటీఎఫ్‌ ప్రచురించిన ‘కెరటాలు’ అనే కవితా సంకలనానికి ప్రధాన సంపాదకుడిగా వ్యవహరించారు. నంద్యాల సాహిత్య పరిషత్‌ అధ్యక్షుడిగా, పెన్షనర్ల అసోసియేషన్‌ అధ్యక్షుడిగా పాండురంగారెడ్డి సేవలు అందించారు. ఓపీడీఆర్‌లో కొంతకాలం పనిచేశారు. 1970లలో విరసంలో కొంతకాలం పని చేశారు. ఆయన ‘సంకెళ్లు తెంచుదాం’ అనే విప్లవ కావ్యం రాశారు. 1975లో అనంతపురంలో జరిగిన విరసం మహాసభలో సంస్థకు రాజీనామా చేసి ‘జనసాహితి’ సంస్థలో భాగమయ్యారు. ఆ తర్వాత రాయలసీమ ఉద్యమ సంయుక్త కార్యాచరణ సమితిని ఏర్పాటు చేశారు. తర్వాత రాయలసీమ పార్టీని ఏర్పాటు చేశారు. 


ప్రజా పోరాటాల్లో.. 

1991లో వచ్చిన సారా వ్యతిరేక ఉద్యమంలో ఆయన చురుకుగా పాల్గొన్నారు. 1993లో పౌర హక్కుల నేత బాలగోపాల్‌, సంధ్య నేతృత్వంలో ఏర్పడిన ‘రాయలసీమ సాయుధ ముఠాల వ్యతిరేక పోరాట సమితి’కి అండగా నిలిచారు. 


సీమ సాహిత్యానికి విస్తృత సేవ...

రాయలసీమలోని రచయితలను ఏకం చేసి 1996లో నంద్యాల్లో ఆయన ‘సీమ సాహితి’ అనే పత్రికను ఏర్పాటు చేశారు. మొదటి సంచికను ‘శ్రీబాగ్‌ ఒడంబడిక’ పై ప్రచురించారు. విద్వాన్‌ విశ్వం రచించిన ‘పెన్నేటి పాట’ అనే కావ్యాన్ని పునర్ముద్రించారు. 3వ సంచికగా ‘బళ్లారి రాఘవ’ జీవిత చరిత్రను వెలువరించారు. భూమన్‌ రాసిన ‘రాయలసీమ ముఖచిత్రం’, పి.రామకృష్ణారెడ్డి పెన్నేటి కథలు, మనిషి-పశువు పాండురంగారెడ్డి సంపాదకత్వంలో వచ్చినవే. 

Updated Date - 2020-08-04T10:48:01+05:30 IST