చూశావుగా.. మా వాళ్లు ఎలా ఆడారో: పాంటింగ్‌ను ట్రోల్ చేసిన సెహ్వాగ్

ABN , First Publish Date - 2021-01-12T01:27:59+05:30 IST

బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా భారత్-ఆస్ట్రేలియా మధ్య సిడ్నీలో జరిగిన మూడో టెస్టు డ్రాగా ముగిసింది.

చూశావుగా.. మా వాళ్లు ఎలా ఆడారో: పాంటింగ్‌ను ట్రోల్ చేసిన సెహ్వాగ్

న్యూఢిల్లీ: బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా భారత్-ఆస్ట్రేలియా మధ్య సిడ్నీలో జరిగిన మూడో టెస్టు డ్రాగా ముగిసింది. మ్యాచ్ ఇలా ముగిసిందో, లేదో టీమిండియా మాజీ డ్యాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ ఆసీస్ మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్‌ను ట్రోల్ చేస్తూ ట్వీట్ చేశాడు. భారత్ తన రెండో ఇన్సింగ్స్‌లో 200 పరుగులు కూడా చేయలేదన్నవుగా.. చూడు మావాళ్లు ఎలా ఆడారో అన్నట్టుగా ఉన్న ట్వీట్ వైరల్ అవుతోంది.


ఇంతకీ ఏం జరిగిందంటే.. చానల్ 7కు బ్రాడ్‌కాస్టర్‌గా వ్యవహరిస్తున్న రికీ పాంటింగ్ ట్విట్టర్‌లో క్యూ అండ్ ఎ (క్వశ్చన్ అండ్ ఆన్సర్స్)  సెషల్‌లో.. ఇండియా మూడో టెస్టు రెండో ఇన్సింగ్స్‌లో 200 పరుగులు కూడా చేయదని అభిప్రాయపడ్డాడు. అయితే,  పాంటింగ్ అంచనా తప్పయింది. భారత్ తన రెండో ఇన్నింగ్స్‌లో 5 వికెట్ల నష్టానికి 334 పరుగులు చేసింది. 


రిషభ్ పంత్, పుజారాలు కలిసి జట్టును విజయం దిశగా నడిపించారు. అయితే, సెంచరీకి మూడు పరుగుల ముందు పంత్ అవుటవడంతో భారత శిబిరంలో ఆందోళన నెలకొన్నా, ఆ తర్వాత పుజారా ఇన్నింగ్స్‌ను నిలబెట్టాడు. 77 పరుగులు చేసి పుజారా అవుటైన తర్వాత ఇక భారత్ పని అయిపోయిందనుకున్న సమయంలో హనుమ విహారి, రవిచంద్రన్ అశ్విన్‌లు అద్భుత ఆటతీరుతో ఆస్ట్రేలియా విజయాన్ని అడ్డుకున్నారు. మ్యాచ్‌ను డ్రాగా ముగించి ప్రశంసలు అందుకున్నారు. 


200 పరుగులు కూడా చేయదన్న భారత జట్టు 334 పరుగులు చేయడంతో స్పందించిన సెహ్వాగ్.. పాంటింగ్‌ను ఓ ఫొటోతో ట్రోల్ చేశాడు. ఐపీఎల్‌ 2020లో పంత్ ఢిల్లీకి ఆడాడు. అతడికి పాంటింగ్ శిక్షణ ఇచ్చాడు. పాంటింగ్ ఐపీఎల్ బ్రాడ్‌కాస్టర్లతో మాట్లాడుతుండగా, వెనక నుంచి అతడి ముఖాన్ని చూస్తున్న పంత్ ఫొటోను పోస్టు చేసిన సెహ్వాగ్.. కింద పాంటింగ్ ట్వీట్‌ స్క్రీన్‌షాట్‌తో ట్రోల్ చేశాడు. ఇప్పుడీ ట్వీట్ వైరల్ అవుతోంది.

Updated Date - 2021-01-12T01:27:59+05:30 IST