Abn logo
Sep 21 2021 @ 00:02AM

బంధుప్రీతి వల్లే కలివరం టీసీ ఓటమి

విలేఖరుల సమావేశంలో మాట్లాడుతున్న కోట గోవిందరావు

- వైసీపీ నాయకుడు కోట గోవిందరావు ఆవేదన

- నియోజకవర్గ పార్టీ పెద్దలపై విమర్శలు

ఆమదాలవలస : బంధుప్రీతి, ఆశ్రితపక్షపాతంవల్లే కలివరం ప్రాదేశికంలో వైసీపీ ఎంపీటీసీ అభ్యర్థి  కోట కృష్ణకుమారి ఓటమి పాలయ్యారని ఆ పార్టీ నాయకుడు, కనీసవేతనాల అమలు కార్పొరేషన్‌ మాజీ డైరెక్టర్‌ కోట గోవిందరావు ఆరోపించారు. సోమవారం ఆమదాలవలసలోని ఆయన విలేఖరులతో మాట్లాడారు. నియోజకవర్గ పెద్దలు నోటిఫికేషన్‌ వెలువడిన నాడు ఇచ్చిన మాటను నిలబెట్టుకోకుండా బంధుప్రీతి చూపించారని ఆరోపించారు. ఎంపీపీని చేస్తానని కలివరం ప్రాదేశికం నుంచి తన భార్య కృష్ణకుమారిని పోటీ చేయాలని బీఫారం ఇచ్చి, సొంతపార్టీ అభ్యర్థినే ఓడించిన ఘనత నియోజకవర్గ పార్టీ పెద్దలకు దక్కుతుందన్నారు. నాడు అసెంబ్లీ ఎన్నికల సమయంలో తమను వేడుకొని... వాడుకుని, చివరికి పార్టీ అభ్యర్థులనే ఓడించడం వారికే చెల్లుతుందని మండిపడ్డారు. అందరూ ఉంటేనే పార్టీ అని... మీరొక్కరే ఉండాలనుకోవడం మంచిపద్ధతికాదని హితవు పలికారు. ఈ ఓటమిపై ఆయన సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు.  అహంకారపూరిత రాజకీయాలతో ఎక్కువకాలం ప్రజలను మభ్యపెట్టలేరని గుర్తించుకోవాలన్నారు. ఈ వ్యవహారంపై రాష్ట్ర నాయకత్వానికి ఫిర్యాదు చేశామని, పార్టీ అభ్యర్థి ఓటమికి గల కారణాలు అన్వేషించాలని అధిష్ఠానాన్ని కోరినట్టు తెలిపారు. సమావేశంలో మాజీ సర్పంచ్‌ కోట వెంకటరామారావు, కె.శ్రీను, జశ్వంత్‌ తదితరులు పాల్గొన్నారు.