ఆత్మాలోచన

ABN , First Publish Date - 2020-07-26T08:10:25+05:30 IST

మోక్షమంటే జన్మరాహిత్యం. జీవుడు శరీరం నుంచి విడివడి శాశ్వతంగా పరమాత్మలో ఐక్యం కావడం. కానీ.. కోటానుకోట్ల జన్మలలో జీవుడు తాను ధరించిన శరీరాన్ని తోడు చేసుకుని ఏన్నో అఘాయిత్యాలు...

ఆత్మాలోచన

మోక్షమంటే జన్మరాహిత్యం. జీవుడు శరీరం నుంచి విడివడి శాశ్వతంగా పరమాత్మలో ఐక్యం కావడం. కానీ.. కోటానుకోట్ల జన్మలలో జీవుడు తాను ధరించిన శరీరాన్ని తోడు చేసుకుని ఏన్నో అఘాయిత్యాలు, కుట్రలు, కుతంత్రాలు, మోసాలు చేస్తాడు. అసూయ, డాంబికం వంటి లక్షణాలకు లోబడి.. క్షణిక సుఖాలను ఆశిస్తూ నీచాతినీచమైన పనులు చేయడానికీ వెనుకాడడు. అటువంటి జీవుడు ఏదో ఒక మంత్రాన్ని నమ్మి జపం చేసినంత మాత్రాలన పాపాలన్నీ నశించి మోక్షం వస్తుందా? రాదు. సదాచారం, సత్‌ ప్రవర్తన, పవిత్రజీవనం, విశేష జ్ఞాన సంపద కారణంగా మోక్షం లభిస్తుంది. సత్యం, శాంతి, ప్రేమ, దయ, సుబుద్ధి తనను తాను తెలుసుకోవడం, త్యాగం, శీలం, ఓర్పు, నేర్పు,  సదా భగవత్‌ చింతన, ఈశ్వరారాధన వంటి సద్గుణ సంపదతో వికార గుణాలపై విజయం సాధించినప్పుడు ఆత్మకు మోక్షం వస్తుంది. అది జరగాలంటే.. తనను తాను తెలుసుకోవడం ముఖ్యం. అలా తెలుసుకోవాలంటే ఎవరికి వారు ‘నేను’ ఎవరు అనే విచారణ చేయాలి. ‘నేను’ అంటే.. మనసా? బుద్ధియా? చిత్తమా? ఈ దేహమా? ఈ ‘నేను’ ఎక్కడి నుంచి వచ్చింది? అది ఎట్టిది? భౌతికంగా కనిపిస్తున్న ఈ దేహం పోయాక ‘నేను’ ఎక్కడికి పోతుంది? ..ఈ విచారణ చేయాలి.


మనస్సే బంధమోక్షాలకు కారణం. కాబట్టి అది బుద్ధి ఆధీనంలో ఉండాలి. మనసు చేసిన పాపాలు.. సత్సంగం ద్వారా, సాధు సత్పురుషుల పాదసేవ ద్వారా, విచారసాగరం ద్వారా పోతాయి. పాపాలు పోతేనే పుణ్యం నిలుస్తుంది. అయితే, పుణ్యం వల్ల మోక్షం రాదు. పాపం వల్ల నరకప్రాప్తి కలిగితే.. పుణ్యం వల్ల కేవలం స్వర్గం లభిస్తుంది. పాపపుణ్యాలూ రెండూ తీరేవరకు స్వర్గ, నరకాలు అనుభవించడం జరుగుతుంది. రెండూ సమభాగాలుగా ఉంటే మనిషి జన్మ. ఆ రెండూ అసలు లేకుండా పోయినప్పుడే ఆత్మ పరమాత్మలో లీనమై మోక్షం లభిస్తుంది. మరింక జన్మలు ఎత్తాల్సిన పని ఉండదు. కానీ.. జన్మ జన్మాలుగా అనేక భవబంధాలు, వ్యామోహ మమకారాలలో చిక్కిన మనసుకు మోక్షమెలా వస్తుంది? ఋషభుడనే పేరుతో మానవజన్మ ఎత్తిన విష్ణుమూర్తికి జన్మించి.. గొప్ప యోగిగా బతికి చివరి శ్వాసలో జింకపై మమకారంతో చనిపోయి.. మృగంగా జన్మించిన జడభరతుడి చరిత్ర చెప్పే పాఠమిదే కదా. అంతటి మహనీయుడికే వ్యామోహ, మమకారాలతో జన్మ తప్పలేదు. మనమెంత?


ఈ జన్మ ఆరంభం నుండి ఆఖరి శ్వాస వరకు ఎలాంటి దుర్గుణాల కూ తావివ్వక, సత్యం, ధర్మం, నీతి, శీలం, త్యాగం, ఉపకారం, దైవ చిం తన, పాపభీతి, సంఘనీతి, దైవప్రీతితో మెలగాలి. ‘ఈ శరీరం నాది కా నీ నేను శరీరాన్ని కాను. ఈ గృహం నాది కానీ నేను గృహమును కా ను. ధనము నాదే కానీ నేను ధనమును కాను, అధికారం ఉన్నది కానీ అధికారాన్ని నేను కాను. నేను పరమాత్మ నుండి విడబడిన ఆత్మను. నేను సాక్షీభూతుడను. నేను ఒక్కడినే వచ్చాను. మళ్లీ ఒక్కడినే పోతాను. ఎలా వచ్చానో అలాగే పోతాను. మళ్లీ పరమాత్మలో ఐక్యం అవుతాను’’ అనే ఎరుకను కలిగి ఉండాలి. చేసే కర్మల తాలూకూ పాపపుణ్యాల ఫలాన్ని పరమాత్మకు ధారపోయాలి. అప్పుడే జన్మరాహిత్యం.


- గోశికొండ మురారి పంతులు, 8978974367

Updated Date - 2020-07-26T08:10:25+05:30 IST