Abn logo
Aug 7 2020 @ 00:00AM

మనోబలమే మహాబలం

గుణశేఖరుడు ఒక గ్రామవాసి. అతను పని మీద పొరుగూరికి వెళ్ళాడు. అతను వెళ్ళిన నాలుగు రోజులకు తన ఊరిలో కలరా వచ్చి వందమంది చనిపోయారని తెలిసింది. పని మానుకొని సొంత ఊరుకు బయలుదేరాడు. ఆ రోజుల్లో కలరా వ్యాధికి కారణం ఒక దేవత అని నమ్మేవారు. అతను తన గ్రామ పొలిమేరలోకి వచ్చేసరికి, గ్రామం నుంచి కలరా దేవత బయటకు వస్తూ ఎదురుపడింది.


ఆమెను చూసిన గుణశేఖరుడు ఆవేశంగా, ‘‘ఓ మహా తల్లీ! మీకు మా గ్రామమే దొరికిందా? వందమందిని పొట్టన పెట్టుకున్నావటగా!’’ అన్నాడు.

కలరా దేవత నవ్వి  ‘‘నువ్వు విన్నది తప్పు. నేను చంపింది పదిమందినే! మిగిలిన తొంభై మందీ భయంతో చచ్చారు’’ అని తన దారిన తాను వెళ్ళిపోయింది.

ఇది కల్పిత కథే కావచ్చు, కానీ దీనిలో ఒక పచ్చి నిజం ఉంది. కలరా కన్నా భయమే ప్రమాదం అనేది. ఇప్పుడు కరోనా కష్టకాలం కూడా ఒకనాటి కలరా లాంటిదే! ఒక విధంగా చెప్పాలంటే కరోనా కన్నా కలరా చావులే అధికం. ఒక అంచనా ప్రకారం కరోనా వల్ల సంభవిస్తున్న మరణాలలో వృద్దాప్యం, దీర్ఘకాలిక రోగాల కన్నా భయం వల్లే ఎక్కువ మంది మరణిస్తున్నారు. ముఖ్యంగా యువకులు, మధ్యవయస్సువారు, దీర్ఘకాలిక రోగాలు లేనివారూ ఇలాంటి మరణాల్ని భయం వల్ల కొనితెచ్చుకుంటున్నారు.

భయం వల్ల మనసు కుంచించుకుపోతుంది. శరీరంలో వికృత రసాయనాల ఉత్పత్తి జరుగుతుంది. మన శరీరం వాటి నుంచి రక్షించుకోవడానికే తన శక్తినంతా వినియోగించుకుంటుంది. చివరకు బయట నుంచి వచ్చే శత్రువును ఎదిరించలేక నిస్తేజంగా మిగిలిపోతుంది. గత కాలాల్లో వచ్చిన మలేరియా, టైఫాయిడ్‌, ప్లేగు, కలరా, అనేర రకాల ఫ్లూ వ్యాధుల కన్నా కరోనా మరణాల రేటు తక్కువే. కానీ భయం చాలా ఎక్కువగా ఉంది. ఈ భయం నుంచి బయటపడాలి. 

మనిషికి మనో బలాన్ని మించినది లేనే లేదు. పిరికితనం కన్నా మృత్యువూ లేదు. మరణభయం లేని జీవి ఏదీ లేదు. మరణానికి భయపడడం జీవుల ప్రాథమిక లక్షణం. ఇతర జీవులు కేవలం ప్రాకృతిక ధర్మంగానే భయపడతాయి. కానీ మనిషికి వాటికన్నా ఎన్నో రెట్లు మరణ భయం ఉంటుంది.  కారణమేమిటంటే... సంపదలు, కీర్తి, కుటుంబం, ప్రేమ... వీటన్నిటితోపాటు తాను ఆచరించిన చెడు నడత, అలవాట్లు... ఇవన్నీ ముసురుకొని చావు భయాన్ని రెట్టింపు చేస్తాయి. చావు భయం పట్టుకున్న వాడు నీటిలో దిగిన వాడిలా నాలుగు రకాలుగా భయపడతాడు.

భయం గురించి బుద్ధుడు చెబుతూ ‘‘నీటిలో దిగేవాడికి నాలుగు రకాల భయాలుంటాయి. మొదటిది అలల భయం, రెండోది మొసళ్ళ బయం, మూడోది సుడిగుండాల భయం, నాలుగోది సొరచేపల భయం. అలాగే చెడ్డ కర్మలు చేస్తూ జీవించిన వారు కూడా మృత్యువు ముంచుకొచ్చే సమయాల్లో ఇన్ని రకాలుగానూ భయపడతారు. ఇన్ని భయాలు పడే జీవి మానవుడు ఒక్కడే!’’ అన్నాడు. 

కామం, ద్వేషం, వ్యామోహం, తృష్ణ... ఇవన్నీ భయ హేతువులే! పేరాశ లేనివాళ్ళు, దుష్టకర్మలు చేయనివాళ్ళు, దురలవాట్లు లేనివాళ్ళు ఇలాంటి భయాలకు గురికారు. అంటే సచ్ఛీలతే సగం బలం, మనోధైర్యం మరో సగం బలం.

‘కామతో జాయతే భయం, తణ్హాయ జాతయే భయం

రతియా జాయతే భయం, పియతో జాయతే భయం’ - ‘ఈ భయాలే దుఃఖ కారణాలు’ అంటుంది ధమ్మపదం. ‘భయం వీడితే దుఃఖం దూరం అవుతుంది’ అంటుంది బౌద్ధం. కాబట్టి ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో సదాచారం, సత్యదృష్టి, సరైన అవగాహన చాలా అవసరం. మనసును మలినరహితం చేసుకోవడానికీ, స్థిరచిత్తానికీ, మనోధైర్యానికీ మంచి ఔషధం బుద్ధ ప్రబోధాలే!

- బొర్రా గోవర్ధన్‌


Advertisement
Advertisement
Advertisement