Abn logo
Feb 23 2021 @ 00:56AM

అమ్మకానికి ఆత్మగౌరవం!

బూర్జువాల రాజ్యాంగపు బూజంతా దులపండి, భూతలాన స్వర్గపు నిర్మాతలుగా నిలవండని నాడు శ్రీశ్రీ అన్న మాటలు నేడు ప్రతి ఒక్క ఆంధ్రుడు జ్ఞప్తికి తెచ్చుకుని మరోసారి విప్లవజ్వాలను రగిలించాల్సిన తరుణం ఆసన్నమైంది. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కంటూ 32మంది ప్రాణత్యాగాలు, వేలాదిమంది పోరాటం, వేల ఎకరాల భూముల త్యాగం, లక్షలాదిమంది ప్రజల ఆరాటం నేడు విశాఖ ప్రైవేటీకరణతో విలువ లేకుండా పోయింది. నాడు దేనిని సాధించేందుకు ప్రతి ఒక్క ఆంధ్రుడు తపించిపోయాడో నేడు మళ్లీ అదే ఉక్కు కోసం సమరశంఖం పూరించాల్సి రావడం బాధాకరం.


టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు వాజపేయి ప్రభుత్వంపై చంద్రబాబు ఒత్తిడి చేసి విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను నివారించారు. 1998 మే 3న ఎర్రన్నాయుడు నేతృత్వంలో టీడీపీ ఎంపీలు అప్పటి ఉక్కుశాఖ మంత్రి నవీన్ పట్నాయక్ను కలిసి ఆ పరిశ్రమను నష్టాల నుంచి గట్టెక్కించేందుకు కేంద్రం ఇచ్చిన ఋణాన్ని ఈక్విటీగా మార్చాలని, రుణంపై వడ్డీని మాఫీ చేసి బీఐఎఫ్ఆర్‌కు వెళ్లకుండా తప్పించాలని కోరారు. 1998 ఆగస్టు 11న నవీన్ పట్నాయక్ దీనికి అంగీకరిస్తూ రూ.1333కోట్ల ఋణాన్ని ఈక్విటీగా మార్చారు. విశాఖ స్టీలుప్లాంటు సమగ్రాభివృద్ధికి కన్సల్టెంటును కూడా ఏర్పాటు చేశారు. ఉక్కు కర్మాగారానికి రికార్డు స్థాయిలో లాభాలు వచ్చేలా నాటి టీడీపీ ప్రభుత్వం కృషి చేసిందని 2002లో అప్పటి కేంద్రప్రభుత్వం (మినిస్టరీ ఆఫ్ స్టీల్) స్పష్టంగా పేర్కొంది. 


ఇప్పుడు విశాఖ ఉక్కు కర్మాగారాన్ని అమ్మేస్తుంటే అధికారపక్షం, ముఖ్యమంత్రి ఏమి చేస్తున్నట్టు? ప్రధానమంత్రికి లేఖ రాస్తే ప్రైవేటీకరణ ఆగుతుందా? 25కి 25మంది ఎంపీలనివ్వండి కేంద్రం మెడలు వంచుతానని బీరాలు పలికినవారు నేడు ఎందుకు యూటర్న్ తీసుకున్నారు? అధికారపక్షానికి ఉభయసభల్లో 28 ఎంపీలున్నా ఎందుకు నోరు కుట్టేసుకున్నారు? 


విశాఖ ఉక్కు కర్మాగారాన్ని అమ్మేయాలనుకోవడమే తప్పుడు నిర్ణయం. పెట్టుబడుల ఉపసంహరణ, ప్రైవేటీకరణ వంటి అంశాల్లో బీజేపీ అయోమయాన్ని సృష్టిస్తోంది. పెట్టుబడుల ఉపసంహరణ అంటే 51శాతం ప్రభుత్వం దగ్గర, 49శాతం ఇతరుల దగ్గర ఉంచినా అది ప్రభుత్వరంగ సంస్థనే అవుతుంది. వ్యూహాత్మకంగా 26శాతం ఉంచుకుని మిగతాదంతా ఇచ్చేసినా ప్రభుత్వానికి నియంత్రణ ఉంటుంది. ఇలా ఏదీ కాకుండా 100 శాతం ప్రైవేటీకరణ అంటే ఆమోదించాల్సిన అంశం కాదు. కేంద్రప్రభుత్వమే ఈ కర్మాగారాన్ని లాభసాటి కాకుండా చేసింది. 2015లో పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ చైర్మన్ రాకేష్ సింగ్ విశాఖ స్టీలు ప్లాంటుకు గనులు కేటాయించాలని సిఫారసు చేశారు. టీడీపీ ప్రభుత్వం కూడా ఉన్నత స్థాయి అధికారులతో కలిసి, కేజీ బేసిన్ ఆంధ్ర మీదుగా వెళ్తుంది కాబట్టి రాయల్టీ కావాలని, రాష్ట్రీయ ఇస్పాత్ నిగం లిమిటెడ్‌కు గనులను కేటాయించాలని కోరింది. విశాఖ స్టీలుకు తప్ప మిగిలిన స్టీల్స్‌కు సొంత గనులు ఉన్నాయి. అందువల్ల ఈ కర్మాగారానికి గనులు, ముడిసరుకు, ఆర్థిక చేయూత కల్పించాలి. ప్రైవేటీకరణ ముసుగులో విశాఖ స్టీలుప్లాంటుకు ఉన్న 22వేల ఎకరాలు కొట్టేయాలన్న కుట్ర కూడా జరుగుతోంది.


విశాఖ ఉక్కు కర్మాగారం అనేక ఒడిదుడుకులు ఎదుర్కొంటూ 2018–19 నాటికి రూ.95 కోట్ల లాభంతో ఉంది. ఆ నాటికి విశాఖ ఉక్కు మొత్తం ఆస్తుల విలువ (యంత్రాలు, 22వేల ఎకరాల భూములు కలుపుకొని) రూ.35,201కోట్లు. కర్మాగారం పరిధిలో ఉన్న 22వేల ఎకరాల పారిశ్రామిక భూముల విలువ ప్రభుత్వ లెక్కల ప్రకారం 2 వేల కోట్లు మాత్రమే. వాస్తవానికి మార్కెట్ లెక్కల ప్రకారం ఒక ఎకరా రూ.10కోట్లు పైనే ఉంటుంది. అంటే విశాఖ ఉక్కుకి చెందిన భూములు మాత్రమే రూ.2లక్షల కోట్లు పైన విలువ చేస్తాయి. 2018–19 నాటికి 17,574 మంది కంపెనీలో శాశ్వత ఉద్యోగులుగా పని చేస్తున్నారు. కాంట్రాక్ట్ పద్ధతిన సుమారు 25వేల మంది పని చేస్తున్నారు. అంటే, ప్రత్యక్షంగా పరోక్షంగా సుమారు 45వేల మందికి పైనే ఉద్యోగాలు కల్పించింది.


విశాఖ ఉక్కు కర్మాగారం ఇనుప ఖనిజాన్ని ఒడిశా, ఛత్తీస్‌గ‌ఢ్‌ రాష్ట్రాల నుంచి భారీ మొత్తంలో కొనుగోలు చేస్తోంది. ఇతర రాష్ట్రాల నుంచి తక్కువ మొత్తంలో తీసుకొంటోంది. అయితే ఉమ్మడి రాష్ట్రంలో ముడి ఇనుప ఖనిజం ఉన్న ఓబులాపురం, బయ్యారంలో గనులు 2005 నుంచి అందుబాటులోకి వచ్చాయి. కానీ అప్పటి ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి బయ్యారం గనులను తన అల్లుడు బ్రద‌ర్ అనిల్‌కు, ఓబుళాపురం గనులను గాలి జనార్దన్ రెడ్డికి అప్పజెప్పారు. ఒడిశా, ఛత్తీస్‌గ‌డ్‌ ప్రభుత్వాలు పోస్కో, జిందాల్, టాటా వంటి కంపెనీలకు గనులు కేటాయించడం వల్ల విశాఖ ఉక్కు ఫ్యాక్టరీకి గనుల కొరత ఏర్పడింది. అప్పటి నుంచి పోస్కో, జిందాల్, టాటా వంటి వాటి దగ్గర ముడి ఇనుమును ఎక్కువ ధరకు కొనుగోలు చేసి ఉత్పత్తి చేయటం వల్ల విశాఖ కర్మాగారానికి ఉత్పత్తి వ్యయం పెరిగింది. గత రెండేళ్ళ నుంచి పోస్కో ఈ కర్మాగారానికి ముడి సరకు అందకుండా పక్కా ప్రణాళికతో నష్టాల బాట పట్టించింది.


వైసీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి విశాఖ ఉక్కును ప్రైవేటీకరించే దిశగా అడుగులు వేసింది. అధికారంలోకి వచ్చిన వెంటనే 2019 జూన్‌లో పోస్కో ప్రతినిధులు ముఖ్యమంత్రిని కలిసి ఈ కర్మాగారాన్ని దక్కించుకోవటానికి సహకరించాలని కోరారు. ఆ తరువాత నవంబర్ 2019న కేంద్ర ఉక్కుమంత్రి సైతం పెట్టుబడి పేరుతో ముఖ్యమంత్రితో తాడేపల్లిలోని ఇంటిలో భేటీ అయ్యారు. అక్టోబర్ 29, 2020న పోస్కో ప్రతినిధులను ముఖ్యమంత్రి మళ్లీ కలిశారు. ఆ కలయికల ఆంతర్యం ఏమిటో అప్పుడు ప్రజలకు అర్థం కాలేదు. కాని కేంద్రప్రభుత్వం విశాఖను ప్రైవేటీకరణ చేస్తున్నామని ప్రకటన వెలువరించిన వెంటనే నాటి భేటీలు ఎందుకో ఇప్పుడు అర్థమవుతున్నాయి. వాస్తవానికి ఒడిశాలో పోస్కో గనులు ఉన్న ప్రాంతంలో భూములు కేంద్రంలో చక్రం తిప్పే ఒక ప్రముఖ నాయకుడివే. అందుకే వైజాగ్ స్టీలును పోస్కోకు అప్పగించే ప్రయత్నాలు ముమ్మరంగా జరుగుతున్నాయి. పోస్కో చేతికి విశాఖ ఉక్కు ప్లాంటు చిక్కితే ఒడిశాలో ఉన్న గనుల నుంచి ముడి ఇనుము తెచ్చి ఇక్కడ పనులు ప్రారంభించి అంతర్జాతీయ మార్కెట్టులో లాభాలు ఆర్జిస్తుంది. వైజాగ్ స్టీలుప్లాంటు పరిస్థితి ఇలా ఉంటే ఇక కడప స్టీలు ప్లాంటు పరిస్థితి ఏమిటి? అదంతా ఉత్త డ్రామానేనా? ప్రతిపక్షాలు, ఉక్కు కార్మికులు, ఉద్యోగ సంఘాలు ప్రైవేటీకరణను అడ్డుకోవ‌డానికి ధర్నాలు, నిరాహార దీక్షలు చేస్తారు. కాబట్టి వాళ్ళ మధ్య గొడవలు పెట్టి గ్రూపులుగా విడగొట్టాల్సిన బాధ్యత అధికారపక్షం మీద పడింది. ఎటూ రాష్ట్రంలో అధికారంలో ఉన్నారు కాబట్టి అందరినీ కట్టడి చేసేందుకు పోలీస్ బలగాలను ఉపయోగించనున్నారు. ఎక్కువ కాలం ధర్నాలు, దీక్షలు లేకుండా చేసి వాళ్ళను, మళ్ళీ ఇదే ప్రైవేట్ కంపెనీలో తమ‌కు ఉద్యోగాలుంటే చాలు అనే స్థితికి వాళ్లను తీసుకువచ్చే కుట్రలకు తెరలేపుతున్నారు.


ఏది ఏమైనా విశాఖ ఉక్కు – ఆంధ్రుల హక్కు అనే నినాదాన్ని మళ్లీ ఎలుగెత్తి గర్జించాల్సిన తరుణం ఆసన్నమైంది. ఆ కర్మాగారం అనేది ఒక్క ఉత్తరాంధ్ర ప్రాంతానికే చెందింది కాదు, యావత్ తెలుగు ప్రజలందరికీ చెందినది. రాజ్యాంగాన్ని కాపాడాల్సిన నాయకులు దళారులుగా మారి మనకు ఉరితాళ్లు బిగించి, స్టీలుప్లాంటును పరాయి పంచన చేర్చాలనే దుష్ట సంప్రదాయానికి పూనుకోవడం జాతిద్రోహమే! ఆంధ్రులకు గర్వకారణంగా ఉన్న విశాఖ ఉక్కు కర్మాగారాన్ని అమ్మకానికి పెట్టడమంటే మన ఆత్మాభిమానాన్ని అమ్ముకున్నట్లే. జాతి సంపదకు సంరక్షకుడిగా ఉంటానని ప్రమాణం చేసిన ముఖ్యమంత్రి నేడు జాతి సంపద దోపిడీ అవుతున్నా మిన్నకుండిపోవడం సమంజసం కాదు. పాలకులు తమ అధికారాన్ని దుర్వినియోగం చేయకుండా నిలువరించగలిగే సామర్థ్యం ప్రజలందరికీ దక్కినప్పుడే స్వరాజ్యం వచ్చినట్లు. నేడు ఏపీలో స్వరాజ్య స్థాపనకు ప్రజలు నడుం బిగించాలి. మన రాష్ట్రాన్ని మనమే కాపాడుకోవాలి.

వంగలపూడి అనిత

తెలుగు మహిళ రాష్ట్ర అధ్యక్షురాలు

Advertisement
Advertisement
Advertisement