Abn logo
Aug 24 2021 @ 03:01AM

స్వయం పోషకత్వమే ఆర్థిక సార్వభౌమత్వం

విదేశీ సరుకుల వెల్లువ మన ఆర్థిక వ్యవస్థను కుదిపివేస్తోంది. ముఖ్యంగా చైనా నుంచి చౌకవస్తువుల దిగుమతులు మన జాతీయభద్రతకు ముప్పుగా పరిణమిస్తున్నాయి. ఈ కారణంగా అనేక చైనా యాప్స్‌ను మన ప్రభుత్వం నిషేధించింది. వందకు పైగా రక్షణ పరికరాల దిగుమతిని నిలిపివేసింది. ఆభరణాలు, ప్లాస్టిక్స్, రసాయనాలు, చర్మ ఉత్పత్తులతో సహా పలు ఎంపిక చేసిన వస్తువులపై దిగుమతి సుంకాలను పెంచింది. అధిక వ్యయ దేశీయఉత్పత్తులను ఉపయోగించుకోవాలా లేక స్వల్ప వ్యయ దిగుమతులను వినియోగించుకోవాలా అన్నది మన ముందున్న ప్రశ్న. అధిక వ్యయ దేశీయ ఉత్పత్తులకు మద్దతునివ్వడాన్ని సంరక్షణవాద (భారీ దిగుమతి సుంకాలు విధించడం ద్వారా విదేశీ వస్తువుల పోటీ నుంచి మన పరిశ్రమలకు రక్షణ కల్పించడం) విధానం అంటారు. స్వయం పోషకత్వాన్ని ప్రోత్సహించే సంరక్షణ విధానాలు దేశ ఆర్థిక సార్వభౌమత్వాన్ని కాపాడతాయనడంపై ఎవరికీ మరో అభిప్రాయం లేదు. అయితే చైనా యాప్‌లపై నిషేధం మొదలైన చర్యలు సరైన దిశలో తీసుకున్నవే అయినప్పటికీ అవే సరిపోవు. ఇంకా పలు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ సందర్భంగా సంరక్షణ విధానాలకు వ్యతిరేకంగా ఉన్న వాదనలను నిశితంగా పరిశీలిద్దాం. 


ప్రతి దేశమూ తాను చౌకగా ఉత్పత్తి చేయగల వాటిపై దృష్టిని కేంద్రీకరించాలి, ఇతర దేశాలు చౌకగా ఉత్పత్తిచేసే సరుకులను దిగుమతి చేసుకోవాలి- ఇదీ సంరక్షణ వాదానికి వ్యతిరేకంగా చేసే ప్రధాన వాదన. ఈ వాదనలోని తర్కం మౌలికంగా సరైనదే. అయితే దాని రెండు అనుషంగిక ప్రభావాలను మనం విస్మరించకూడదు. ఒకటి- దిగుమతులకు ప్రాధాన్యమిచ్చినప్పుడు ఆర్థిక పరాధీనత మూల్యాన్ని మనం భరించవలసి ఉంటుంది. ఒక కారును కొన్నప్పుడు దాన్ని బీమా చేయిస్తాం. అందుకు అయ్యే వ్యయాన్ని మనమే చెల్లిస్తాం. బీమా వ్యయాన్ని కారు కొనుగోలు ధరకు కలిపివేస్తాం. అదే విధంగా ఆర్థిక పరాధీనత మూల్యాలను దిగుమతుల ఖర్చులో కలిపివేయాలి. ఏమిటా మూల్యాలు? ఉదాహరణకు చైనానుంచి చౌక ఉక్కును దిగుమతి చేసుకుంటామనుకోండి. ఉక్కు కోసం మనం పూర్తిగా చైనాపై ఆధారపడతాం. అయితే యుద్ధం సంభవించినప్పుడు మనకు అవసరమైన ఉక్కు మనకు అందుబాటులో ఉండదు. దానిని ఉత్పత్తి చేసుకోగల సామర్థ్యమూ మనకు ఉండదు. ఇది కేవలం ఆర్థికపరమైన నష్టమే కాదు జాతి నవనాడులనూ కుంగదీసే నష్టం. ఇటువంటి చిక్కుల పాలవకుండా మనలను మనం కాపాడుకోవాలి. ‘అవసరమైన సరుకులను, సౌకర్యవంతంగా సుసాధ్యమయినప్పుడు స్వదేశంలోనే ఉత్పత్తి చేసుకోవడం అన్ని విధాల శ్రేయస్కరమని ఆర్థిక వేత్త కీన్స్ అన్నారు. మరింత స్పష్టంగా చెప్పాలంటే ప్రజల నిత్య జీవితానికి ముఖ్యమైన, అనివార్యమైన వస్తువుల ఉత్పత్తిలో స్వావలంబన అత్యంత అవసరం. అంతగా ముఖ్యంకాని వస్తువులకు విదేశీ వాణిజ్యంపై ఆధారపడవచ్చు. అంటే దిగుమతలు ద్వారా వాటి అవసరాలను తీర్చుకోవచ్చు. 


దేశీయఉత్పత్తి కార్యకలాపాలే మన సాంకేతికతా సామర్థ్యాలకు పునాదులు అనే మౌలికవాస్తవం నిరక్ష్యానికి గురవడమనేది ఆర్థిక పరాధీనత రెండో అనుషంగిక ప్రభావం. మనం మన సొంత పారిశ్రామిక ఉక్కును తయారుచేసుకోగలిగితే వంతెనలు, ఫిరంగులు, ట్యాంకులు, ఉపగ్రహాలు మొదలైన వాటిని సొంతగా తయారు చేసుకోగలుగుతాం. మన ఆటోమొబైల్ పరిశ్రమకు అవసరమైన పారిశ్రామిక ఉక్కును తయారు చేసుకోలేనప్పుడు ప్రత్యేక ఉపయోగాలకు అవసరమైన ఉక్కును కూడా తయారుచేసుకోలేము. మరింత స్పష్టంగా చెప్పాలంటే మనం సొంత ఉక్కును ఉత్పత్తి చేసుకోగలిగినప్పుడే అధునాతన సాంకేతికతల అభివృద్ధిలో పురోగతికి పటిష్ఠపునాదులు నిర్మించుకోగలుగుతాం. చెప్పవచ్చినదేమిటంటే విదేశీ వాణిజ్యానికి సానుకూలంగా చేసే వాదనలు సమర్థించలేనివి. ఆర్థిక పరాధీనత వల్ల ఎదురయ్యే చిక్కులను, నవీన సాంకేతికతల రూపకల్పన, అభివృద్ధి సామర్థ్యం కొరవడడం అనే వాస్తవాలను ఆ వాదనలు పరిగణనలోకి తీసుకోవడం లేదు. 


స్వతంత్ర భారతదేశం తొలి నాలుగు దశాబ్దాల పాటు దేశీయపరిశ్రమల సంరక్షణకే అధిక ప్రాధాన్యమిచ్చినప్పటికీ ఆర్థిక స్వావలంబన సాధనలో మనం పూర్తిగా ఎందుకు వెనుకబడిపోయాం? ఇది, సంరక్షణా విధానాలను వ్యతిరేకించే వారి మరో ప్రధాన వాదన. ప్రభుత్వ రంగ పరిశ్రమల ద్వారా పారిశ్రామికాభివృద్ధి సాధించాలన్న విధానానికి ప్రథమ ప్రధానమంత్రి జవహర్ లాల్ నెహ్రూ అగ్రప్రాధాన్యమిచ్చిన విషయం నిజమే. అయితే నెహ్రూ, ఆయన అనంతరం దేశాన్ని పాలించిన వారు రెండు పొరపాట్లు చేశారు. ప్రభుత్వరంగ సంస్థలకు నేతృత్వం వహించిన ఉన్నతాధికారులు, రాజకీయవేత్తలు జవాబుదారీతనంతో వ్యవహరించేలా చూడడంలో నెహ్రూ, ఆయన వారసులు విఫలమయ్యారు. తత్ఫలితంగా ఆ సంస్థలు ఆశ్రితపక్షపాతం, అసమర్థతకు నెలవులుగా పరిణమించాయి. అంతేకాదు, ఆర్థిక పురోగతికి జీవ ధాతువు అయిన పోటీని అణచివేశాయి. దేశీయ పరిశ్రమల మధ్య పోటీ అనేది లేకుండా చేశాయి . 


ఉదాహరణకు చిన్నకారుల రంగాన్ని చూడండి. 1980దశకం వరకు మనదేశంలో కేవలం రెండే రెండు చిన్న కార్లు తయారవుతుండేవి. బిర్లా, వాల్‌చంద్ కంపెనీలు వాటి ఉత్పత్తిదారులు. చిన్నకార్లపై దిగుమతి సుంకాలు చాలా హెచ్చుస్థాయిలో ఉండేవి. కనుక ఆ రెండు ఆటోమొబైల్ సంస్థలకు పోటీ అనేది ఉండేది కాదు. పోటీ ముప్పు లేక పోవడంతో నాసిరకం కార్లను ఉత్పత్తి చేసి అవి అధిక లాభాలకు అమ్ముకోగలిగాయి. మరో ప్రముఖ పారిశ్రామిక దిగ్గజం టాటా కంపెనీ చిన్నకార్ల ఉత్పత్తికి లైసెన్స్ కోసం ఎన్నిసార్లు దరఖాస్తు చేసుకున్నా అనుమతి ఇవ్వడానికి మన పాలకులు ససేమిరా అన్నారు. మారుతీ కార్ల కంపెనీని సంజయ్‌ గాంధీ ప్రారంభించేంతవరకు బిర్లా, వాల్‌చంద్ కంపెనీలే చిన్నకార్ల రంగంలో రాజ్యమేలాయి. చిన్నకార్ల ఉత్పత్తిలో అసమర్థత అనేది సంరక్షణ విధానాల ఫలితం కాదనేది దీనివల్ల స్పష్టమవుతోంది. పోటీ కొరవడడంతో పాటు సంరక్షణ విధానాలు ఆటోమొబైల్ రంగంలో అభివృద్ధిరాహిత్యానికి దారితీశాయి. ఆహారం తీసుకోకుండా యాంటీ బయోటిక్స్ తీసుకోవడం హానికరం కాదూ? అలాగే పోటీ అనేది లేకుండా సంరక్షణ విధానాలను అనుసరించడం కూడా అటువంటిదేనని రుజువయింది.  


సంరక్షణ విధానాల వ్యతిరేకవాదనలు నిలిచేవి కావు. ప్రస్తుత పరిస్థితుల్లో దిగుమతి సుంకాలను రెండురెట్లు పెంచే విషయాన్ని ప్రభుత్వం చురుగ్గా పరిగణనలోకి తీసుకోవాలి. దిగుమతి సుంకాలను పెంచడంతో పాటు ఆటోమెటిక్ మెషీన్స్‌తో ఉత్పత్తి కార్యకలాపాలను సాగించే ఫ్యాక్టరీలపై అధిక పన్నులు విధించి తీరాలి. దీనివల్ల ఉద్యోగితను సృష్టించే చిన్న పరిశ్రమలు మనుగడ, అభివృద్ధికి విశేషంగా తోడ్పడతాయి. అదే సమయంలో దేశీయ పరిశ్రమల మధ్య పోటీని ఇతోధికంగా పెంపొందించేందుకు ప్రపభుత్వం పూనుకోవాలి. పోటీ ఉన్నప్పుడు మాత్రమే పరిశ్రమలు విశేషంగా పురోగమించగలుగుతాయనేది ఒక నిరూపిత సత్యం. 


ప్రస్తుతం విదేశీవాణిజ్యానికి అనుకూలవాదనలు అంతకంతకూ ఉద్ధృతమవుతున్నాయి. ప్రపంచం ఒక కుగ్రామంగా పరిణమించిన కాలంలో గిరిగీసుకుని కూర్చోవడం మంచిది కాదని విదేశీవాణిజ్య సమర్థకులు వాదిస్తున్నారు. ఈ వాదనలు చేస్తున్నది ఎవరు? విశ్వవిద్యాలయ ఆచార్యులు, ప్రభుత్వ ఉన్నతాధికారులు, రాజకీయవేత్తలు. ఈ పెద్దమనుషుల కుమారులు, కుమార్తెలలో అత్యధికులు బహుళజాతి సంస్థలు, ప్రపంచ బ్యాంకు, అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ మొదలైన వాటిలో ఉద్యోగాలు చేస్తున్నవారే కావడం గమనార్హం. విదేశీవాణిజ్యం వర్థిల్లడమే తమ ప్రయోజనాలకు శ్రీరామరక్ష అని వారు విశ్వసిస్తున్నారు. దేశీయ పరిశ్రమలు సృష్టించే ఉద్యోగాలు వారికి ఏ మాత్రం అవసరం లేదు. తమ వ్యక్తిగత ప్రయోజనాలు విదేశీవాణిజ్యం మాత్రమే నెరవేర్చగలదని వారు నమ్ముతున్నారు. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వం ముందున్న సవాల్ చైనీస్ దిగుమతుల వెల్లువను ఎలా నిరోధించాలన్నది కాదు. దేశంలో ప్రభావశీలంగా వ్యవహరిస్తున్న విదేశీవాణిజ్య అనుకూల లాబీవర్గాలను ఎలా ఎదుర్కోవాలన్నదే మన పాలకులు ముందున్న అసలు సమస్య.

భరత్ ఝున్‌ఝున్‌వాలా

(వ్యాసకర్త ఆర్థికవేత్త, బెంగుళూరు ఐఐఎం రిటైర్‌్డ ప్రొఫెసర్‌)

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కేమరిన్ని...