స్వీయ ప్రయత్నమే జ్ఞాన మార్గం

ABN , First Publish Date - 2020-12-04T05:37:31+05:30 IST

జెన్‌ గురువు లిన్‌ ఛి గొప్ప ఉపన్యాసకుడు. ఆయన ప్రసంగాలు వినడానికి జనం తండోపతండాలుగా వచ్చేవారు. లిన్‌ ఛి బోధించే విధానం, శ్రోతల ప్రశ్నలకు సమాధానం ఇచ్చే పద్ధతి చాలా వింతగా ఉండేవి.

స్వీయ ప్రయత్నమే జ్ఞాన మార్గం

జెన్‌ గురువు లిన్‌ ఛి గొప్ప ఉపన్యాసకుడు. ఆయన ప్రసంగాలు వినడానికి జనం తండోపతండాలుగా వచ్చేవారు. లిన్‌ ఛి బోధించే విధానం, శ్రోతల ప్రశ్నలకు సమాధానం ఇచ్చే పద్ధతి చాలా వింతగా ఉండేవి. ఆయన ఎప్పుడు ఏ విధంగా స్పందిస్తాడో ఎవరి ఊహకూ అందేది కాదు. ఆయన ప్రవర్తించే తీరులో, బదులిచ్చే విధానంలో కొంత కాఠిన్యం, మొరటుతనం ఉండేవి. అయినా ఎందరో ఆయన పట్ల ఆకర్షితులయ్యేవారు.


ఒక రోజు బహిరంగ వేదిక మీద లిన్‌ ప్రసంగిస్తున్నాడు. మధ్యలో ఒక వ్యక్తి లేచి నిలబడి ‘‘నా ప్రశ్నకు సమాధానం చెప్పండి. నేను ఎవరు?’’ అని అరిచాడు.


లిన్‌ తన ప్రసంగాన్ని ఆపేశాడు. ప్రేక్షకులందరూ ఏం జరుగుతుందోనని ఊపిరి బిగబట్టి చూడసాగారు. 


లిన్‌ తన ఆసనం పైనుంచి లేచి, ఆ ప్రశ్న వేసిన వ్యక్తి వైపు చకచకా నడచి వెళ్ళాడు. ఆ వ్యక్తి ఆయనను చూసి భయపడ్డాడు. అయితే, లిన్‌ ఏం చేసినా తనకు మంచే జరుగుతుందని అతనికి తెలుసు.


లిన్‌ అతని దగ్గరకు వచ్చి తీక్షణంగా చూశాడు. అతని గొంతును తన రెండు చేతులతో పట్టుకున్నాడు. కోపంగా అతన్ని ఊపుతూ ‘‘కళ్ళు మూసుకో!’’ అని గద్దించాడు. 


ఆ వ్యక్తి కళ్ళు మూసుకున్నాడు. ‘‘నేను ఎవరు? అని నువ్వు దేని గురించి ప్రశ్నించావో దాన్ని చూడు’’ అన్నాడు లిన్‌. జనమంతా నిశ్శబ్దంగా గమనిస్తున్నారు.


కొద్ది సేపటికి ఆ వ్యక్తిని లిన్‌ కుదిపి ‘‘ఇప్పుడు మామూలు స్థితికి వచ్చావు కదా! ఏం తెలుసుకున్నావో అందరికీ చెప్పు’’ అన్నాడు.


ఆ వ్యక్తి సమాధానం చెప్పలేదు. కానీ అతని ముఖంలో అంతులేని ఆనందం... అతనికి దివ్యమైన అనుభవం ఏదో కలిగిందని అందరికీ అర్థమయింది.


అతని ప్రశ్నకు మాటలతో సమాధానం చెప్పకుండా... స్వీయానుభవంతో అతను తెలుసుకొనేలా చేశాడు లిన్‌ ఛీ.


‘దేవుడున్నాడా? ఆత్మ ఉందా? నేను ఎవరు? పునర్జన్మ ఉందా?’... ఇలాంటి ప్రశ్నలకు ఎంత గొప్పవారు ఎన్ని సమాధానాలు చెప్పినా మన సందేహాలు తీరవు. ప్రశ్నలు ప్రశ్నలుగానే మిగిలిపోతాయి. మన దప్పిక తీరాలంటే మనమే నీరు తాగాలి. మన ఆకలి తీరాలంటే అన్నం మనమే తినాలి. అలాగే మన సందేహాలు తీరాలంటే మనమే ప్రయత్నించాలి. అప్పుడే జ్ఞానం కలుగుతుంది. అందుకే ‘అప్పో దీపోభవ’ అని బుద్ధుడు, ‘ఉద్ధరేదాత్మనాత్మానం’ అని భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్పారు. ఏ గురువైనా, ఎంతటి గురువైనా చేయగలిగేది మనకు ఎదురవుతున్న ఆటంకాలను తొలగించడమే. అది కూడా సామాన్యమైన విషయం కాదు. కాబట్టి వారిపట్ల భక్తి శ్రద్ధలతో మెలగాలి. 

 రాచమడుగు శ్రీనివాసులు


Updated Date - 2020-12-04T05:37:31+05:30 IST