ప్రాణాలు తీసిన సెల్ఫీ సరదా

ABN , First Publish Date - 2021-10-18T06:21:09+05:30 IST

నల్లగొండ జిల్లా డిండి ప్రాజెక్టు స్పిల్‌వే వద్ద సెల్ఫీ దిగుతూ నీటిలో మునిగి ఇద్దరు యువకులు ప్రాణాలు కోల్పోయారు.

ప్రాణాలు తీసిన సెల్ఫీ సరదా
మృతదేహాలను బయటికి తీసుకొస్తున్న జాలర్లు, స్నేహితులు

డిండి స్పిల్‌వే వద్ద మునిగి ఇద్దరి మృతి

నల్లగొండ జిల్లాలో డిండిలో ఘటన  

డిండి, అక్టోబరు 17: నల్లగొండ జిల్లా డిండి ప్రాజెక్టు స్పిల్‌వే వద్ద సెల్ఫీ దిగుతూ నీటిలో మునిగి ఇద్దరు యువకులు ప్రాణాలు కోల్పోయారు. ఎస్‌ఐ పోచయ్య, ప్రత్యక్ష సాక్షుల సమాచారం మేరకు వివరాలిలా ఉన్నాయి. దసరా పండుగ నేపథ్యంలో హైదరాబాద్‌లో ఉంటున్న ఆరుగురు స్నేహితులు వంగరి విశాల్‌, బచ్చినేని బలరాం, పకాలి వంశీ, కటిక అనిల్‌కుమార్‌, మహ్మద్‌ సాగర్‌(21), ప్రవీణ్‌కుమార్‌(23) మూడు బైక్‌ లపై ఈ నెల 15వ తేదీన దైవ దర్శనానికి శ్రీశైలం వెళ్లారు. తిరుగు ప్రయాణంలో మార్గమధ్యలో ఆదివారం జిల్లా డిండి ప్రాజెక్టు వద్ద కొద్దిసేపు ఆగారు. స్పిల్‌వే వద్ద సెల్ఫీ దిగేందుకు వెళ్లారు. స్పిల్‌వే ముందు భాగంలోని గోడ జారుడుగా ఉంది. ఆ గోడపై నుంచి నడుస్తున్న మహ్మద్‌ సాగర్‌(21) నీటిలో పడిపోయాడు. సాగర్‌కు ఈత రాక నీటిలో మునిగిపోతుండగా ప్రవీణ్‌కుమార్‌(23) నీటిలోకి దూకి కాపాడే ప్రయత్నం చేశాడు. సాగర్‌ భయంతో ప్రవీణ్‌కుమార్‌ను గట్టిగా అల్లుకోవడంతో ఇద్దరూ నీట మునిగారు. తమతో మూడు రోజులుగా సరదాగా గడిపిన స్నేహితులిద్దరూ నీట మునుగుతుండడంతో వారిని కాపాడేందుకు గట్టులో ఉన్న నలుగురు ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. స్థానిక జాలర్లు వలలు వేసి ఇద్దరిని బయటకు తీసుకువచ్చి ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించగా, అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. 

ఆ ఇద్దరిదే కుటుంబ పోషణ భారం

హైదరాబాద్‌ బంజారాహిల్స్‌ ప్రాంతానికి చెందిన మహ్మద్‌ సాగర్‌ పె యింటర్‌గా పనిచేస్తూ జీవనం సాగిస్తుండగా, భార్య, కుమార్తె ఉన్నారు. రంగారెడ్డి జిల్లా జహీరాబాద్‌ మండలం చిన్న హైదరాబాద్‌కు చెందిన ప్రవీణ్‌కుమార్‌ చర్లపల్లిలోని క్యాంటీన్‌లో పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ప్రవీణ్‌ తండ్రికి పక్షవాతం రావడంతో మంచానపడ్డాడు. దీంతో కుటుంబానికి ప్రవీణ్‌కుమార్‌ పెద్దదిక్కయ్యాడు. ప్రవీణ్‌కుమార్‌ అవివాహితుడు. మిగిలిన స్నేహితుల్లో నలుగురైన సంగారెడ్డి జిల్లా జహీరాబాద్‌ మండలం బాగారెడ్డిపల్లి గ్రామానికి చెందిన వంగరి విశాల్‌, వికారాబాద్‌ జిల్లా పంటారం గ్రామానికి చెందిన పకాలి వంశీ ల్యాబ్‌ టెక్నీషియన్‌ కోర్సు చదువుతున్నారు. సంగారెడ్డి జిల్లా కోహినూరు మండలం పైడి గుమ్మాల్‌ గ్రామానికి చెందిన బుచ్చినేని బాల్‌రామ్‌ బీ.ఈడీ పూర్తిచేశాడు. వికారాబాద్‌ జిల్లాకు చెందిన కటిక అనిల్‌కుమార్‌ హైదరాబాద్‌ ఫిల్మ్‌నగర్‌ ఉంటూ పెయింటర్‌గా పనిచేస్తున్నాడు. అనిల్‌కుమార్‌ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ పోచయ్య తెలిపారు. 

 పొంచి ఉన్న ప్రమాదం

డిండి రిజర్వాయర్‌ చూసి ఆహ్లాదం ఆస్వాదించాలనుకునే పర్యాటకులకు స్పిల్‌వే వద్ద ప్రమాదం పొంచి ఉంది. శ్రీశైలం- హైదరాబాద్‌ ప్రధాన రహదారిపై ఉన్న డిండి ప్రాజెక్టును చూసేందుకు పర్యాటకులు పెద్దసంఖ్యలో ఇక్కడ ఆగుతారు. ప్రాజెక్టు వద్ద ఎలాంటి భద్రత, రక్ష ణ చర్యలు లేకపోవడంతో గతంలోనూ ప్రమాదాలు చోటు చేసుకున్నాయి.   

దసరా సెలవుల్లో ఇంటికి వచ్చి...

నేరేడుగొమ్ము: ఈత కొట్టడానికి వెళ్లిన బాలుడు కెనాల్‌లో శవమై కనిపించడం ఆ కుటుంబాన్ని శోకసంద్రంలో ముంచింది. నేరేడుగొమ్ము ఎస్‌ఐ సతీష్‌ తెలిపిన వివరాల ప్రకారం.. నల్లగొండ జిల్లా నేరేడుగొమ్మ మండలం పీర్లబాయితండాకు చెందిన గంగ, కమల దంపతుల పెద్ద కుమారుడు శ్రీనివాస్‌(14) ఇబ్రహీంపట్నంలోని గురుకుల పాఠశాలలో 8వ తరగతి చదువుతున్నాడు. దసరా పండగకు పాఠశాలకు సెలవులు ఇవ్వడంతో సొంతతండాకు చేరుకున్నాడు. శుక్రవారం మధ్యాహ్నం ఇంట్లో ఎవరికీ చెప్పకుండా తండాకు సమీపంలో ఉన్న ఎస్‌ఎల్‌బీసీ ఓపెన్‌కెనాల్‌లో నిలువ ఉన్న వర్షపునీటిలోకి స్నానానికి వెళ్లాడు. ఈత రాకపోవడంతో శ్రీనివాస్‌ నీటిలో మునిగి మృతిచెందాడు. ఇంటి నుంచి వెళ్లిన కుమారుడు ఇంటికి చేరుకోకపోవడంతో కుటుంబ సభ్యులు, బంధువులు పరిసర ప్రాంతాల్లో వెతుకగా రాత్రి ఓపెన్‌ కెనాల్‌లో శవమై కనిపించాడు. 

Updated Date - 2021-10-18T06:21:09+05:30 IST