స్వార్థం వినాశకారకం

ABN , First Publish Date - 2021-01-05T08:38:45+05:30 IST

మానవజీవన పురోగతికి, ఉత్తమ సమాజ నిర్మాణానికి స్వార్థ గుణం పెద్ద అవరోధం. ఏ విధమైన వికాసం జరగడానికైనా ముఖ్యమైన అడ్డంకి అది.

స్వార్థం వినాశకారకం

మానవజీవన పురోగతికి, ఉత్తమ సమాజ నిర్మాణానికి స్వార్థ గుణం పెద్ద అవరోధం. ఏ విధమైన వికాసం జరగడానికైనా ముఖ్యమైన అడ్డంకి అది. ఎవరికైనా కొంత వరకూ స్వార్థం ఉండవచ్చు. ఆ స్వార్థం వారికి కొంతవరకు ఉపయోగపడచ్చు. కానీ.. ఆ గుణం ఎక్కడ శ్రుతి మించుతుందో అక్కడ మానవసంబంధాలు, మానవవిలువలు విధ్వంసానికి గురవుతాయి. భాగవతంలో కంసుని విషయంలో ఇదే జరిగింది. సోదరి దేవకీదేవిని, వసుదేవుని వారి వివాహానంతరం తానే సారథిగా మారి రథంలో తీసుకెళ్తుండగా.. అశరీరవాణి మాటలు విన్న కంసుడు తన సోదరిని, వసుదేవుని సంహరించే ప్రయత్నం చేశాడు. చివరకు వారి వినతి కారణంగా బంధించాడు. తాను పూర్వం కాలనేమినని, తనను విష్ణువు సంహరించాడని తెలుసుకున్న కంసుడు విష్ణుద్వేషంతోనే తన జీవితాన్ని గడిపాడు. కన్న తండ్రినే కారాగారంలో బంధించి శూరసేన రాజ్యపాలన మొదలుపెట్టాడు. తాను మాత్రమే రాజుకావాలన్న స్వార్థం బాంధవ్యాన్ని కూడా విస్మరించేలా చేసింది. ఆ సన్నివేశంలో వేదవ్యాస మహర్షి స్వార్థ జీవుల లక్షణాలను వివరిస్తూ..


మాతరం పితరం భ్రాతౄన్‌ పుత్రాంశ్చ సుహృదస్సఖీన్‌!

ఘృంతిహ్యసుతృప్తో లుబ్ధా రాజానః ప్రాయశోభువిః!!


నే శ్లోకం చెప్పారు. ‘‘సాధారణంగా ఈ భూమిపై లుబ్ధులైన రాజులు అసంతుష్టులై, మిక్కిలి స్వార్థబుద్ధితో తమ తల్లిదండ్రులను, సోదరులను, ఒక్కోసారి పుత్రులను, అవసరమైతే స్నేహితులను, సఖీజానాన్ని కూడా వధించడానికి వెనకాడరు’’ అని దీని అర్థం. అదే విషయాన్ని పోతన మహాకవి ఇలా అందంగా తెనిగించారు..


తల్లిదండ్రినైనఁ దమ్ముల నన్నల

సఖులనైన బంధుజనులనైన

రాజ్యకాంక్ష జేసి రాజులు చంపుడు

రవనిఁదఱచు జీవితార్థులగుచు


కేవలం తన స్వార్థం కోసం ఆత్మీయులను కూడా చంపాలన్న యోచన ఎంత అమానుషమో భాగవతం చెబుతుంది. పరమ స్వార్థపరుడు కనుకనే కంసుడు యదువంశీయులతో వైరం పెంచుకొని ఇతర రాక్షస రాజులు, బాణుడు, భౌముడు, జరాసంధుడు మొదలైన వారి సాయంతో వారితో కయ్యం కొనసాగిస్తూ వచ్చాడు. శ్రీమహావిష్ణువే మరోచోట పుట్టి పెరుగుతున్నాడన్న సమాచారం తెలియగానే.. ప్రలంబుడు, బకుడు, చాణూరుడు, తృణావర్తుడు, అఘాసురుడు, ముష్టికుడు, అరిషుడు, ద్వివిదుడు, పూతన, కేశి, ధేనుకుడు మొదలైనవారిని ప్రయోగించడం అతనిలోని క్రూరత్వానికి పరాకాష్ట. అతడి స్వార్థమే అతడి సర్వనాశనానికి దారి తీసింది.     

- గన్నమరాజు గిరిజామనోహర బాబు


Updated Date - 2021-01-05T08:38:45+05:30 IST