రోగులను పంపించండి కమీషన్లు అందుకోండి

ABN , First Publish Date - 2021-09-01T05:01:31+05:30 IST

‘రోజుకు పది మంది రోగులను రక్త పరీక్షలకు పంపించండి. నెలకు రూ.30 వేలు కమీషన్‌ తీసుకోండి’..ఇదీ చాపరలోని ఓ ప్రైవేట్‌ ల్యాబ్‌ యజమాని ఆర్‌ఎంపీలకు ఇచ్చిన బంపర్‌ ఆఫర్‌. దీంతో ఆర్‌ఎంపీలు పనిగట్టుకొని మరీ రోగులను సదరు ల్యాబ్‌కు పంపిస్తున్నారు.

రోగులను పంపించండి  కమీషన్లు అందుకోండి
రక్త పరీక్షలు నిర్వహించే ప్రైవేట్‌ ల్యాబ్‌



ఆర్‌ఎంపీలకు ల్యాబ్‌ నిర్వాహకుల ఆఫర్‌

అవసరం లేకున్నా రక్త పరీక్షలు

కొరవడుతున్న నిఘా

ఏజెన్సీలో సాగుతున్న దందా

(మెళియాపుట్టి)

‘రోజుకు పది మంది రోగులను రక్త పరీక్షలకు పంపించండి. నెలకు రూ.30 వేలు కమీషన్‌ తీసుకోండి’..ఇదీ చాపరలోని ఓ ప్రైవేట్‌ ల్యాబ్‌ యజమాని ఆర్‌ఎంపీలకు ఇచ్చిన బంపర్‌ ఆఫర్‌. దీంతో ఆర్‌ఎంపీలు పనిగట్టుకొని మరీ రోగులను సదరు ల్యాబ్‌కు పంపిస్తున్నారు. ప్రస్తుతం అంతటా సీజనల్‌ వ్యాధులు విజృంభిస్తున్నాయి. మలేరియా, టైఫాయిడ్‌, డెంగ్యూ జ్వరాలు ప్రబలుతున్నాయి. ఈ పరిస్థితుల్లో ప్రైవేట్‌ మెడికల్‌ ప్రాక్టీషనర్లు, ఆర్‌ఎంపీల వద్దకు రోగులు క్యూకడుతున్నారు. అటువంటి వారిని ముందుగా రక్త పరీక్షలు చేయించుకోవాలని, ప్రైవేటు ల్యాబ్‌లకు వెళ్లాలని సూచిస్తున్నారు. వాస్తవానికి ఎంబీబీఎస్‌ పూర్తిచేసిన వారు మాత్రమే రక్త పరీక్షలకు సిఫారసు చేయాలి. కానీ చాపరలో నేరుగా ఆర్‌ఎంపీలే రక్త నమూనాలు తీసుకొచ్చి కమీషన్లు దండుకుంటున్నారన్న ఆరోపణలున్నాయి. ప్రభుత్వాస్పత్రుల్లో మలేరియా, టైఫాయిడ్‌, డెంగ్యూ నిర్థారణ పరీక్షలు జరుగుతున్నా ప్రజలకు అవగాహన లేక వినియోగించుకోలేకపోతున్నారు. గత ఏడాది కరోనా విజృంభణ సమయంలో సీజనల్‌ వ్యాధుల ప్రభావం అంతగా లేదు. ప్రస్తుతం ఎక్కడికక్కడే సీజనల్‌ వ్యాధులు భయపెడుతున్నాయి. ముఖ్యంగా ఐటీడీఏ సబ్‌ప్లాన్‌ మండలాల్లో పరిస్థితి నివురుగప్పిన నిప్పులా ఉంది. 

 ఇష్టారాజ్యంగా ఫీజులు

ప్రైవేటు ల్యాబ్‌లపై పర్యవేక్షణ కొరవడుతుంది. దీంతో నిర్వాహకులు ఇష్టారాజ్యంగా ఫీజులు వసూలు చేస్తున్నారు. టైఫాయిడ్‌, మలేరియా రక్త పరీక్షలకు రూ.450 వరకూ ఫీజు ఉంటుంది. కానీ మారుమూల మండలాల్లో మాత్రం రూ.1,000 నుంచి రూ.1,500 వరకూ వసూలు చేస్తున్నారు. ల్యాబ్‌లు ఒక లాభసాటి వ్యాపారంగా మారిపోయాయి. చాపరలో కొత్తగా పెట్టిన ల్యాబ్‌కు నెలకు రూ.7 లక్షల వరకూ ఆదాయం సమకూరుతోందన్న ప్రచారం ఇప్పుడు హాట్‌టాపిక్‌గా మారింది. చిన్న ల్యాబ్‌లకే ఇంతపాటి ఆదాయమంటే...పెద్ద ల్యాబ్‌ పరిస్థితి ఏమిటో అర్థం చేసుకోవచ్చు. ప్రైవేట్‌ ల్యాబ్‌ల దందాపై చాపర పీహెచ్‌సీ వైద్యాధికారి గణపతిరావు వద్ద ‘ఆంధ్రజ్యోతి’ ప్రస్తావించగా నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్న ల్యాబ్‌ల యాజమాన్యాలపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ఇటీవల ల్యాబ్‌ యజమానులతో సమావేశం నిర్వహించినట్టు చెప్పారు. పీహెచ్‌సీల్లో వైద్య పరీక్షలు జరుగుతున్న విషయాన్ని ప్రజలు గుర్తుంచుకోవాలి. సద్వినియోగం చేసుకోవాలి. 

 అక్కరకు రాని ‘ప్రభుత్వ’ సేవలు

సీతంపేట ఐటీడీఏ పరిధిలో 29 పీహెచ్‌సీలు, సీహెచ్‌సీలు 5, రెండు ప్రాంతీయ ఆస్పత్రులు, 151 ఆరోగ్య ఉప కేంద్రాలు ఉన్నాయి. వందలాది మంది వైద్యఆరోగ్య శాఖ సిబ్బంది పని చేస్తున్నప్పటికీ సరైన వైద్యసేవలందడం లేదు. ఏజెన్సీలో 346 హై రిస్క్‌ గ్రామాలు ఉన్నాయి. ఏరియా ఆస్పత్రుల్లో 40 రకాలు, సీహెచ్‌సీ, పీహెచ్‌సీల్లో 20 రకాల వైద్య పరీక్షలు చేయాల్సి ఉన్నా... చేపట్టడం లేదు. టీడీపీ ప్రభుత్వ హయాంలో మెడల్‌ సంస్ధ ద్వారా వైద్య పరీక్షలు సక్రమంగా జరిగేవి. డెంగ్యూ, కిడ్నీ, లివర్‌ వంటి కీలక పరీక్షలు చేసేవారు. ప్రస్తుతం కొన్నిరకాల పరీక్షలు చేస్తున్నారు. డెంగ్యూ, ప్లేట్‌లెట్స్‌ తక్కువ కావడం వంటి వాటికి మాత్రం రిమ్స్‌కు రిఫర్‌ చేస్తున్నారు. ప్రభుత్వాస్పత్రుల్లో వైద్య పరీక్షలపై ఎక్కువ మంది అవగాహన లేక ప్రైవేటు ల్యాబ్‌లను ఆశ్రయించి వేలాది రూపాయలు పోగొట్టుకుంటున్నారు.  





Updated Date - 2021-09-01T05:01:31+05:30 IST