సీనియర్‌ సిటిజన్లు గృహ రుణం తీసుకోవచ్చిలా..

ABN , First Publish Date - 2020-11-29T07:12:43+05:30 IST

సీనియర్‌ సిటిజన్లకు దీర్ఘకాల గృహ రుణం లభించడం మిగతా వారితో పోలిస్తే కష్టమే. అప్పటికే ఆరు పదులు దాటిన వారికి వృద్ధాప్యంలో రుణాన్ని తిరిగి చెల్లించే సామర్థ్యం ఉండదన్న ఉద్దేశంతో బ్యాంక్‌లు, ఆర్థిక సంస్థలు రిస్క్‌ తీసుకోవు. రుణం ఇచ్చే ఇంటిని తాకట్టు పెట్టుకుప్పటికీ...

సీనియర్‌ సిటిజన్లు గృహ రుణం తీసుకోవచ్చిలా..

సీనియర్‌ సిటిజన్లకు దీర్ఘకాల గృహ రుణం లభించడం మిగతా వారితో పోలిస్తే కష్టమే. అప్పటికే ఆరు పదులు దాటిన వారికి వృద్ధాప్యంలో రుణాన్ని తిరిగి చెల్లించే సామర్థ్యం ఉండదన్న ఉద్దేశంతో బ్యాంక్‌లు, ఆర్థిక సంస్థలు రిస్క్‌ తీసుకోవు. రుణం ఇచ్చే ఇంటిని తాకట్టు పెట్టుకుప్పటికీ.. ఆచితూచి ముందడుగు వేస్తాయి. హోమ్‌ లోన్‌ కోసం ప్రయత్నించే సీనియర్‌ సిటిజన్ల కోసం కొన్ని సూచనలు.. 


సహ- దరఖాస్తుదారును చేర్చండి.. 

సాధారణంగా సీనియర్‌ సిటిజన్ల గృహ రుణ దరఖాస్తును తిరస్కరించడానికి వారి ఆదాయ పరిమితులు, జీవితకాలంపై అనిశ్చితే ప్రధాన కారణం. ఈ అవరోధాలను అధిగమించేందుకు గృహ రుణ దరఖాస్తులో మీ కుటుంబంలోనే ఎవరినైనా కో-అప్లికెంట్‌ (సహ దరఖాస్తుదారు)గా చేర్చండి. యుక్త లేదా నడి వయసులో ఉన్న, ఆదాయం ఆర్జిస్తున్న వ్యక్తిని సహ దరఖాస్తుదారుగా ఎంచుకోవాలి. ఆ వ్యక్తి మెరుగైన క్రెడిట్‌ స్కోర్‌ కలిగి ఉండటమూ ముఖ్యమే. సహ దరఖాస్తుదారును చేర్చడం ద్వారా దీర్ఘకాలానికి రుణం పొందగలగడమే కాకుండా, అధిక మొత్తంలో రుణం మంజూరయ్యేందుకు అవకాశం ఉంటుంది. తీసుకున్న రుణం తిరిగి చెల్లించడంలో విఫలమైతే మాత్రం ఇద్దరి క్రెడిట్‌ స్కోర్‌పై ప్రభావం పడుతుంది. 


ఈఎంఐ చెల్లింపు సామర్థ్యాన్ని పరిశీలించుకోండి.. 

బ్యాంక్‌లు, ఆర్థిక సంస్థలు గృహ రుణగ్రహీత ఈఎంఐ చెల్లింపుల సామర్ధ్యాన్నీ నిశితంగా గమనిస్తాయి. మీరు కొత్తగా తీసుకోబోయే గృహ రుణంపై చెల్లించాల్సిన ఈఎంఐతో పాటు గతంలో తీసుకున్న రుణాలపై చెల్లిస్తున్న ఈఎంఐల మొత్తం విలువ మీ నెలవారీ నికర ఆదాయంలో 50-50 శాతానికి మించకూడదు. ఈ పరిమితిని దృష్టిలో ఉంచుకొని గృహ రుణం దరఖాస్తు సమయంలో ఈఎంఐ ఆప్షన్‌ను ఎంచుకోవాలి. తద్వారా మీకు రుణం లభించే అవకాశాలు మెరుగుపడటంతో పాటు భవిష్యత్‌లో ఈఎంఐ చెల్లింపుల్లో డిఫాల్ట్‌ కాకుండా జాగ్రత్తపడగలుగుతారు. 


క్రెడిట్‌ స్కోర్‌ బాగుంటేనే.. 

రుణం కోసం దరఖాస్తు చేసే ముందు మీ క్రెడిట్‌ స్కోర్‌ను పరిశీలించుకోండి. సాధారణంగా బ్యాంక్‌లు, ఆర్థిక సంస్థలు సాధారణంగా 700కు పైగా క్రెడిట్‌ స్కోర్‌ కలిగిన వారికి రుణాలిచ్చేందుకు ఆసక్తి చూపుతాయి. క్రెడిట్‌ స్కోర్‌ మెరుగ్గా ఉంటే, కనిష్ఠ వడ్డీ రేటుకే రుణం పొందే అవకాశం ఉంటుంది. లేదంటే, అధిక వడ్డీ చెల్లించాల్సి ఉంటుంది. 



వీలైనంత తక్కువ రుణం తీసుకోండి..  

బ్యాంక్‌లు తాకట్టు పెట్టుకునే ఇంటి విలువతో పోలిస్తే మంజూరు చేసే రుణం నిష్పత్తిని లోన్‌ టు వేల్యూ (ఎల్‌టీవీ) రేషియో అంటారు. ఆర్‌బీఐ మార్గదర్శకాల ప్రకారం.. ఇంటి విలువలో 75-90 శాతం వరకు రుణం మంజూరు చేయవచ్చు. సీనియర్‌ సిటిజన్లు ఎల్‌టీవీ రేషియోను ఎంత తగ్గించుకోగలిగితే రుణం లభించేందుకు అవకాశాలు అంతగా మెరుగుపడతాయి. అయితే, ఇంటి కొనుగోలుకు తమ జేబుల్లోంచి అధిక మొత్తంలో డౌన్‌పేమెంట్‌ చెల్లించాల్సి వస్తుంది. 

                                                                                      - రతన్‌ చౌదరీ,  హెడ్‌ (హోమ్‌లోన్‌), పైసాబజార్‌


Updated Date - 2020-11-29T07:12:43+05:30 IST