సీనియర్‌ పాత్రికేయుడు ‘తుర్లపాటి’ కన్నుమూత

ABN , First Publish Date - 2021-01-12T08:31:11+05:30 IST

సీనియర్‌ పాత్రికేయుడు, ప్రముఖ వక్త తుర్లపాటి కుటుంబరావు ఇక లేరు. ఆదివారం అర్ధరాత్రి విజయవాడలో ఆయన కన్నుమూశారు. నగరంలోని శిఖామణి సెంటర్లో నివాసం ఉంటున్న

సీనియర్‌ పాత్రికేయుడు ‘తుర్లపాటి’ కన్నుమూత

శ్వాస సంబంధ సమస్యతో ఆగిన ఊపిరి 

విజయవాడలో అంత్యక్రియలు పూర్తి

సుదీర్ఘకాలం ‘ఆంధ్రజ్యోతి’లో బాధ్యతలు

ఉపన్యాసాలతో గిన్నిస్‌ బుక్‌ రికార్డ్స్‌లోకి

2002లో పద్మశ్రీ పురస్కారం ప్రదానం

ఆంధ్రకేసరికి సహాయకుడిగా విధులు

ఉపరాష్ట్రపతి, జగన్‌, చంద్రబాబు, పవన్‌ నివాళి

సుదీర్ఘకాలం ‘ఆంధ్రజ్యోతి’లో కీలక బాధ్యతలు

2002లో పద్మశ్రీతో గౌరవించిన ప్రభుత్వం


విజయవాడ/అమరావతి/న్యూఢిల్లీ, జనవరి 11(ఆంధ్రజ్యోతి): సీనియర్‌ పాత్రికేయుడు, ప్రముఖ వక్త తుర్లపాటి కుటుంబరావు ఇక లేరు. ఆదివారం అర్ధరాత్రి విజయవాడలో ఆయన కన్నుమూశారు. నగరంలోని శిఖామణి సెంటర్లో నివాసం ఉంటున్న ఆయనకు శ్వాస సంబంధ సమస్య తలెత్తడంతో ఆస్పత్రికి తరలించగా, అప్పటికే ప్రాణాలు కోల్పోయినట్టు వైద్యులు తెలిపారు. ఆయన వయసు 87 ఏళ్లు. 1933 ఆగస్టు 10న విజయవాడలో జన్మించారు. ప్రముఖ పాత్రికేయుడు నార్ల వెంకటేశ్వరరావు సంపాదకీయాలకు ఆకర్షితుడైన తుర్లపాటి 14 ఏళ్ల వయసులోనే పత్రికా రంగంలోకి అడుగుపెట్టిన ఆయన అనేక పత్రికల్లో పనిచేశారు. ఆయన మంచి వక్త కూడా. తన ఉపన్యాసాలతో గిన్నిస్‌ బుక్‌లోనూ స్థానం సంపాదించారు. ఆయన సేవలను గుర్తించిన కేంద్ర ప్రభుత్వం 2002లో పద్మశ్రీ పురస్కారంతో సత్కరించింది. 


‘ఆంధ్రజ్యోతి’తో సుదీర్ఘ అనుబంధం..

తుర్లపాటి తొలుత మద్రాసు నుంచి వెలువడే మాతృభూమి రాజకీయ వారపత్రికలో ‘స్వరాజ్యంలో స్వరాష్ట్రం’ శీర్షికకు వార్తారచన చేశారు. ఆంధ్రరాష్ట్రం ఏర్పాటుపై దృష్టి పెట్టాల్సిన ఆవశ్యకతను వివరిస్తూ వ్యాసం రాశారు. ఆ తర్వాత వివిధ పత్రికల్లో పనిచేశారు. ఎన్‌జీ రంగా నిర్వహించిన వాహిని పత్రికకు సహ సంపాదకుడిగా, చలసాని రామారాయ్‌ నడిపిన ప్రతిభ పత్రికకు సంపాదకుడిగా, ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు నిర్వహించిన ప్రజాపత్రికలో ఆంధ్ర ప్రాంత వార్తల సంపాదకుడిగా పనిచేశారు. 1955లో డాక్టర్‌ టీవీఎస్‌ చలపతిరావు స్థాపించిన ప్రజాసేవ పత్రికలో పనిచేశారు. 1965 నుంచి 1991 వరకు ‘ఆంధ్రజ్యోతి’ దినపత్రిక ఎడిటోరియల్‌ విభాగంలో కీలక బాధ్యతలు నిర్వర్తించారు. ‘ఆంధ్రజ్యోతి’ అనుబంధ పత్రిక జ్యోతిచిత్ర (సినిమా మ్యాగజైన్‌)కు సుదీర్ఘకాలం సంపాదకుడిగా వ్యవహరించారు.ఉద్యోగ విరమణ తరువాత కొన్నాళ్లు ఫ్రీలాన్స్‌ జర్నలిస్టుగా వ్యవహరించారు. 1960 నుంచి 2010 వరకు ‘వార్తల్లోని వ్యక్తి’ శీర్షికన వ్యాసాలు రాశారు. 1993 నాటికి ఆయన 10వేలకు పైగా ఉపన్యాసాలు చేశారు.


అర్ధశతాబ్ద కాలంలో ఉపన్యాసకుడిగా, సభలకు అధ్యక్షత వహించిన వ్యక్తిగా గిన్నిస్‌ బుక్‌ ఆఫ్‌ వరల్డ్‌ రికార్డ్స్‌లో ఆయన స్థానం సంపాదించారు. 2010 జూన్‌ 21న సమైక్య రాష్ట్రంలో గ్రంథాలయ పరిషత్‌ అధ్యక్షుడిగా ఆయన బాధ్యతలు చేపట్టారు.   తెలుగు భాషకు ప్రాచీన హోదా కల్పించాలని, హిందీ తర్వాత రెండో అధికార భాషగా తెలుగును గుర్తించాలన్న ఉద్యమాలకు తుర్లపాటి బీజం వేశారు. ఆంధ్రరాష్ట్ర తొలి ముఖ్యమంత్రి టంగుటూరి ప్రకాశం పంతులు వద్ద వ్యక్తిగత సహాయకుడిగా పనిచేశారు. కృష్ణాజిల్లా గన్నవరంలో 1947లో జరిగిన కాంగ్రెస్‌ కమిటీ సమావేశంలో ప్రసంగించి మంచి వక్తగా   పొందారు. కొన్నాళ్లపాటు ఫిలిం సెన్సార్‌ బోర్డు సభ్యుడిగా పనిచేశారు. రాష్ట్రంలో ఫిలిం ఫ్యాన్స్‌ అసోసియేషన్‌ వార్షిక ఫిలిం అవార్డుల ప్రదానోత్సవాలకు ప్రధాన వ్యాఖ్యాతగా వ్యవహరించారు. 1957లో విజయవాడలో అక్కినేని నాగేశ్వరరావుకు నటసామ్రాట్‌ బిరుదును ప్రదానం చేయడానికి ఆయన మూలకర్త. 2002లో కేంద్రం ఆయనను పద్మశ్రీ బిరుదుతో సత్కరించింది. మాజీ సీఎం మర్రి చెన్నారెడ్డి తుర్లపాటిని గవర్నర్‌ కోటాలో శాసనమండలికి పంపాలని భావించినా కొన్ని కారణాలరీత్యా సాధ్యం కాలేదు. 


తుర్లపాటితో చిరకాల అనుబంధం: వెంకయ్యనాయుడు

తుర్లపాటి మరణం పట్ల ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు, సీఎం జగన్‌, టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. తుర్లపాటి మరణవార్త విని తన మనసెంతో కలవరపడిందని వెంకయ్యనాయుడు అన్నారు. అనర్గళంగా మాట్లాడే వక్తగా తుర్లపాటి పేరుగాంచారని సీఎం జగన్‌ పేర్కొన్నారు. అనర్గళంగా మాట్లాడే వక్తగా తుర్లపాటి పేరుగాంచారని సీఎం జగన్‌ పేర్కొన్నారు. బహుముఖ ప్రజ్ఞావేత్తను కోల్పోయామని చంద్రబాబు అన్నారు. తెలుగు పాత్రికేయ రంగంలో ఆయన విలువలకు పట్టంగట్టారనిపవన్‌కల్యాణ్‌ కొనియాడారు. 

Updated Date - 2021-01-12T08:31:11+05:30 IST