పదోన్నతులకు సీనియారిటీ రెండేళ్లే

ABN , First Publish Date - 2021-01-12T08:07:01+05:30 IST

ఉద్యోగులు, అధికారులు పదోన్నతులు పొందేందుకు రెండేళ్ల సీనియారిటీ సరిపోతుందని ప్రభుత్వం ప్రకటించింది. ఇదివరకు ఉన్న మూడేళ్ల సర్వీసు సీనియారిటీ ప్రాతిపదికను రెండేళ్లకు తగ్గించింది. తాజాగా చేపడుతున్న

పదోన్నతులకు సీనియారిటీ రెండేళ్లే

మూడేళ్ల నుంచి రెండేళ్లకు తగ్గింపు

ఫైలుపై సీఎం సంతకం.. వెంటనే జీవో 

ఉద్యోగ సంఘాల విజ్ఞప్తి మేరకు నిర్ణయం

ఆగస్టు 31 వరకే ఉత్తర్వులు వర్తింపు

అన్ని శాఖల్లో వెంటనే పదోన్నతులు 

ఏకకాలంలో ఖాళీల భర్తీ: సీఎం కేసీఆర్‌


హైదరాబాద్‌, జనవరి 11 (ఆంధ్రజ్యోతి): ఉద్యోగులు, అధికారులు పదోన్నతులు పొందేందుకు రెండేళ్ల సీనియారిటీ సరిపోతుందని ప్రభుత్వం ప్రకటించింది. ఇదివరకు ఉన్న మూడేళ్ల సర్వీసు సీనియారిటీ ప్రాతిపదికను రెండేళ్లకు తగ్గించింది. తాజాగా చేపడుతున్న పదోన్నతులకు రెండేళ్ల సీనియారిటీనే ప్రాతిపదికగా తీసుకోనుంది. ఈ సడలింపుతో ఒక ఉద్యోగి ఏదైనా కేటగిరీ, క్లాస్‌, గ్రేడ్‌లో రెండేళ్ల సర్వీసును పూర్తి చేసుకుంటే.. పదోన్నతికి అర్హుడవుతాడు.


ఈ మేరకు సీనియారిటీని తగ్గిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమే్‌షకుమార్‌ సోమవారం ఉత్తర్వులు (జీవో నంబర్‌ 3) జారీ చేశారు. ఈ ఉత్తర్వులు వెంటనే అమల్లోకి వస్తాయని, ఈ ఏడాది ఆగస్టు 31 వరకు అమల్లో ఉంటాయని పేర్కొన్నారు. 2020-21 ప్యానల్‌ ఇయర్‌ కోసం ఈ సడలింపు ఉత్తర్వులను జారీ చేశారు. ఇది తాత్కాలిక సడలింపు మాత్రమేనని తెలిపారు. ఫీడర్‌ కేటగిరీ పోస్టుల్లో అర్హులైన ఉద్యోగులు లభించకపోవడంతో పదోన్నతులు, బదిలీలు, నియామకాలతో ఉన్నత స్థాయి పోస్టులు భర్తీ కావడం లేదని ప్రభుత్వం పేర్కొంది. పర్యవసానంగా ఆయా శాఖలకు కేటాయించిన కేడర్‌ స్ట్రెంథ్‌లో చాలా పోస్టులు ఖాళీగా పడి ఉంటున్నాయని తెలిపింది. పదోన్నతుల సీనియారిటీని తగ్గిస్తే ఆ పోస్టులు భర్తీ అవుతాయన్న ఉద్దేశంతో తాత్కాలికంగా ఈ సడలింపునిస్తున్నామని వివరించింది. పైగా పదోన్నతులతో ఏర్పడే ఖాళీలను భర్తీ చేయడానికి కూడా అవకాశం ఏర్పడుతుందని పేర్కొంది. 


పదోన్నతులుపెండింగ్‌లో ఉంటున్నందునే..

ఇప్పటివరకు అన్ని శాఖల్లోని మొత్తం కేటగిరీల సిబ్బంది, అధికారులకు మూడేళ్ల సీనియారిటీ ప్రాతిపదికన ప్రమోషన్లు కల్పిస్తున్నారు. అయితే... కొన్ని శాఖల్లో పదోన్నతులు సుదీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్నాయని, ఈ దృష్ట్యా రెండేళ్లనే పరిగనణలోకి తీసుకోవాలంటూ ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు ప్రభుత్వాన్ని కోరుతూ వచ్చాయి. ఇటీవల సీఎంను కలిసిన సందర్భంలోనూ ఈ విషయాన్ని ఆయన దృష్టికి తెచ్చాయి. పైగా 2016, 2017 సంవత్సరాల్లో ఇలాంటి మినహాయింపులిచ్చారని గుర్తు చేశాయి. అయితే ఏడాదిపాటు మాత్రమే వర్తించేలా ఈ ఉత్తర్వులిచ్చారని, దాంతో వివిధ శాఖల్లో చాలా మందికి పదోన్నతులు లభించాయని ఉద్యోగ సంఘాల నేతలు తెలిపారు. పైగా రెండేళ్లకు తగ్గించడం వల్ల ఎక్కువ ఖాళీలు ఏర్పడతాయని, వీటిని ప్రత్యక్ష ఎంపిక విధానంలో భర్తీ చేయడం ద్వారా నిరుద్యోగులకు అవకాశాలొస్తాయని వివరించారు. దీంతో రెండేళ్ల సర్వీసుపై సాధారణ పరిపాలనా శాఖ ఫైలును సిద్ధం చేసి.. సీఎం ఆమోదం కోసం పంపించింది. ఈ ఫైలుపై ముఖ్యమంత్రి సోమవారం సంతకం చేశారు. వెంటనే జీవో జారీ చేయాల్సిందిగా సీఎస్‌ సోమే్‌షకుమార్‌ను ఆదేశించగా.. ఆయన తక్షణమే ఉత్తర్వులిచ్చారు. 


సీఎంకు ఉద్యోగ సంఘాల జేఏసీ కృతజ్ఞతలు

పదోన్నతుల కనీస సీనియారిటీని రెండేళ్లకు తగించినందుకు ఉద్యోగ సంఘాల జేఏసీ నేతలు సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపారు. ఉద్యోగుల ఆకాంక్షల మేరకు ఉద్యోగులకు పీఆర్సీ ఫిట్‌మెంట్‌ ఉంటుందని భావిస్తున్నామని జేఏసీ చైర్మన్‌ మామిళ్ల రాజేందర్‌, సెక్రటరీ జనరల్‌ వి.మమత తదితరులు అన్నారు. ఏపీలో పని చేస్తున్న ఉద్యోగులను కూడా తెలంగాణకు తీసుకువస్తారని తెలిపారు. కాగా, ఈ నెల 31లోపు అన్ని శాఖల్లో పదోన్నతులను పూర్తి చేయాల్సిందిగా సీఎం కేసీఆర్‌ ఆదేశించిన నేపథ్యంలో వివిధ శాఖల్లో ఉద్యోగులు, అధికారుల సీనియారిటీ జాబితాల తయారీ, డీపీసీల ఏర్పాటు వంటి ప్రక్రియ కొనసాగుతోంది. ఈ నెల 24కల్లా డీపీసీలు పూర్తి చేయడానికి చర్యలు తీసుకుంటున్నారు. 31కల్లా అందరికీ పదోన్నతుల ఆర్డర్లు జారీ చేయనున్నారు. జిల్లాల్లో కలెక్టర్లు, జిల్లా స్థాయి అధికారుల డీపీసీలు, జోనల్‌ పోస్టుల కోసం విభాగాధిపతుల ఆధ్వర్యంలోని డీపీసీలు, సచివాలయ పోస్టుల కోసం సాధారణ పరిపాలన శాఖ ముఖ్యకార్యదర్శి ఆధ్వర్యంలోని డీపీసీ ప్రమోషన్ల ప్రక్రియను వేగవంతం చేశాయి.

Updated Date - 2021-01-12T08:07:01+05:30 IST