తూటిపాల భూ కుంభకోణంపై రెవెన్యూలో కలకలం

ABN , First Publish Date - 2020-11-17T06:21:22+05:30 IST

మండలంలోని తూటిపాల భూ కుంభకోణంపై సోమవారం ‘ఆంధ్రజ్యోతి’లో ప్రచురితమైన కథనం రెవెన్యూ వర్గాల్లో కలకలం రేపింది.

తూటిపాల భూ కుంభకోణంపై రెవెన్యూలో కలకలం
తహసీల్దార్‌ కార్యాలయం ముందు ఆందోళన చేస్తున్న దృశ్యం

‘ఆంధ్రజ్యోతి’ కథనంతో స్పందించిన కలెక్టర్‌ వినయ్‌చంద్‌

విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని నర్సీపట్నం సబ్‌ కలెక్టర్‌కు ఆదేశం

రెవెన్యూ అధికారులు, అక్రమార్కుల్లో గుబులు

సాగుదారులకే పట్టాలు ఇవ్వాలని జనసేన డిమాండ్‌ 

తహసీల్దార్‌ కార్యాలయం ఎదుట ఆందోళన


మాకవరపాలెం, నవంబరు 16: మండలంలోని తూటిపాల భూ కుంభకోణంపై సోమవారం ‘ఆంధ్రజ్యోతి’లో ప్రచురితమైన కథనం రెవెన్యూ వర్గాల్లో కలకలం రేపింది. ‘ప్రభుత్వ భూమికి టెండర్‌’ శీర్షికతో వెలువడిన ప్రత్యేక కథనంపై జిల్లా అధికార యంత్రాంగం స్పందించింది. ఈ వ్యవహారంపై వెంటనే విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని జిల్లా కలెక్టర్‌ వినయ్‌చంద్‌ సోమవారం నర్సీపట్నం సబ్‌ కలెక్టర్‌ ఎన్‌.మౌర్యను ఆదేశించినట్టు తెలిసింది. దీంతో సంబంధిత రెవెన్యూ ఉద్యోగులతోపాటు, ఈ కుంభకోణంలో ముఖ్యపాత్ర పోషించిన వ్యక్తులు ఆందోళన చెందుతున్నారు. మాకవరపాలెం మండలం తూటిపాల రెవెన్యూ పరిధిలోని సర్వే నంబర్‌ 210లో ‘రావు ఖాతా’ భూమిగా నమోదైన 76.55 ఎకరాలను, బినామీ పేర్లతో వెబ్‌ల్యాండ్‌లో నమోదు చేయించడం, ఇందులో అధికార పార్టీకి చెందిన ఇద్దరు ప్రజాప్రతినిధులు కీలకపాత్ర పోషించిన వైనంపై సోమవారం ‘ఆంధ్రజ్యోతి’లో వచ్చిన కథనం నర్సీపట్నం డివిజన్‌లో రెవెన్యూ శాఖ, అధికార పార్టీ వర్గాల్లో తీవ్ర సంచలనం రేపింది. దీని నుంచి ఎలా బయటపడాలా అని రెవెన్యూ అధికారులు మల్లగుల్లాలు పడుతున్నట్టు తెలిసింది. అయితే ఈ వ్యవహారంలో తమకు సంబంఽధం లేదని కిందిస్థాయి రెవెన్యూ సిబ్బంది చెబుతున్నారు. కొత్తగా ఎవరి భూములనైనా ఆన్‌లైన్‌ చేయాలంటే ముందుగా క్షేత్రస్థాయిలో సర్వే చేయాలని, తూటిపాల భూములను 12 మంది పేర్లతో ఆన్‌లైన్‌ చేయడానికి ముందు సర్వే చేయలేదని వారు స్పష్టంచేస్తున్నారు. కాగా గత నెల 21వ తేదీన 12 మంది బినామీ పేర్లతో వెబ్‌ల్యాడ్‌లో నమోదు చేయగా, నవంబరు ఒకటో తేదీన తహసీల్దార్‌ డిజిటల్‌ సంతకాలను తొలగించడం పలు అనుమానాలకు తావిస్తున్నది. తహసీల్దార్‌ డిజిటల్‌ సంతకాలు లేకపోతే భూముల క్రయవిక్రయాలను వీలుపడదు. సామాన్య రైతుల భూములను ఆన్‌లైన్‌ చేయాలంటే సవాలక్ష పత్రాలు అడిగే రెవెన్యూ అధికారులు....‘రావు ఖాతా’లో వున్న 76.55 ఎకరాల భూమిని సర్వే చేయకుండా 12 మంది బినామీల పేరు మీద ఎలా ఆన్‌లైన్‌ చేశారో సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది.


సాగుదారులకు పట్టాలు ఇవ్వాలని డిమాండ్‌ 

తూటిపాలలో ‘రావు ఖాతా’గా నమోదైన భూమిని బినామీ పేర్లతో ఆన్‌లైన్‌ చేయడాన్ని నిరసిస్తూ జనసేన పార్టీ నర్సీపట్నం నియోజకవర్గ సమన్వయకర్త రాజన్నవీరసూర్య ఆధ్వర్యంలో ఆ పార్టీ శ్రేణులు తహసీల్దార్‌ కార్యాలయం ముందు ఆందోళన చేశాయి. రూ.4 కోట్ల ఉపాధి నిధులతో అభివృద్ధి చేసిన సాగు నీటి చెరువులను కూడా బినామీ పేర్లతో వెబ్‌ల్యాండ్‌లో ఎలా నమోదు చేస్తారని ఆయన ప్రశ్నించారు. ఉన్నతాధికారులు స్పందించి, సర్వే నంబరు 210లో 76.55 ఎకరాలనూ ఏళ్ల తరబడి సాగు చేసుకుంటున్న వారికి అందజేయాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు చక్రవర్తి, కర్రి సురేష్‌, సత్తిబాబు, రాజాన లోవకుమార్‌ పాల్గొన్నారు.

Updated Date - 2020-11-17T06:21:22+05:30 IST