నల్లజాతి గుండెల్లో నల్లకోటు.. ఈ అమెరికా లాయరు!

ABN , First Publish Date - 2020-09-13T15:50:49+05:30 IST

అమెరికాలో ఇప్పుడొక కొత్త హీరో అన్ని పత్రికల్లో కనిపిస్తున్నాడు. ఈ మధ్యనే శ్వేతజాతి పోలీసు చేతిలో చనిపోయిన జార్జ్‌ ఫ్లాయిడ్‌ కేసు వాదిస్తున్నదీ అతనే

నల్లజాతి గుండెల్లో నల్లకోటు.. ఈ అమెరికా లాయరు!

అమెరికాలో ఇప్పుడొక కొత్త హీరో అన్ని పత్రికల్లో కనిపిస్తున్నాడు. ఈ మధ్యనే శ్వేతజాతి పోలీసు చేతిలో చనిపోయిన జార్జ్‌ ఫ్లాయిడ్‌ కేసు వాదిస్తున్నదీ అతనే! నల్లజాతి గుండెల్లో నల్ల కోటు లాయర్‌గా  నిలిచిన ఆ అమెరికా లాయరు బెంజిమన్‌ క్రంప్‌.. అట్టడుగువర్గాల ఆరాధ్యయోధుడు...


అమెరికాలో తెల్లజాతి పోలీసు చేతిలో మరణించిన జార్జ్‌ఫ్లాయిడ్‌ సంఘటన.. పెద్ద ఉద్యమానికి ప్రాణం పోసింది. ఇప్పటికీ అమెరికాలో ఏదో ఒక చోట ఉద్యమం ఉడుకుతూనే ఉంది. ఫ్లాయిడ్‌ కుటుంబం తరఫున న్యాయపోరాటం చేస్తున్న బెంజిమన్‌ క్రంప్‌ ఆ ఉద్యమంలో ప్రముఖపాత్ర పోషిస్తున్నాడు. అగ్రరాజ్యంలోని అణగారిన వర్గాలకు ఇప్పుడు అతనొక ఆరాధ్య న్యాయవాది. ఎంతోమంది పేదలకు అండగా నిలుస్తున్న లాయరు. లక్షల రూపాయల పరిహారాన్ని రాబట్టిన మొండిఘటం. 


‘‘అమెరికాలో జాతివివక్ష అనుభవిస్తేనే అర్థం అవు తుంది. అధికారిక నేర సమాచారాన్ని నేను అధ్యయనం చేశాను. అత్మరక్షణ కోసం నల్లజాతీయులపై తెల్లవాళ్లు కాల్పులు జరిపితే.. పదిహేడు శాతం సమర్థనీయం. అదే ఆత్మరక్షణ పేరుతో తెల్లవాళ్లను నల్లవాళ్లు చంపితే.. కేవలం ఒక శాతం సమర్థనీయం. ఇది అధికారిక గణాంకాలు చెబుతున్న సత్యం. ఆధిపత్య భావజాలం కంటికి కనిపించని శత్రువు. నిర్ణయాత్మక స్థాయిల్లో అది చేయాల్సిన పని చేస్తుంటుంది. ఇదేమీ అమెరికాకే పరిమితం కాదు. ప్రపంచ దేశాల్లోని అట్టడుగు వర్గాలన్నీ అనుభవిస్తున్న బాధ..’’ 


అది జనవరి 2006.. పద్నాలుగేళ్ల మార్టిన్‌లీ అండర్‌సన్‌ సరదాగా పనామాలోని ఒక బూట్‌క్యాంప్‌కు వెళ్లాడు. ఏం జరిగిందో తెలీదు. కుప్పకూలిపోయాడు. వైద్య పరీక్షల్లో బ్లడ్‌ డిజాస్టర్‌ అని తేలింది. అతని తల్లి ప్రముఖ న్యాయవాది బెన్‌ క్రంప్‌ దగ్గరికెళ్లి గోడు వెళ్లబోసుకుంది. అతను రంగంలోకి దిగి శోధించాడు. రెండోసారి శవపరీక్షకు పట్టుబట్టాడు. అదేశించింది కోర్టు. సెక్యూరిటీ వీడియో పుటేజీలో.. కొందరు తెల్లజాతి సెక్యూరిటీగార్డులు అండర్‌సన్‌ను కాళ్లతో తన్నుతూ.. పిడిగుద్దులు కురిపిస్తూ కనిపించారు. ఆ వీడియోను మీడియాకు విడుదల చేశాడు క్రంప్‌. అమ్మోనియాను పీల్చమని ఆ కుర్రాన్ని బలవంతం చేస్తే, నిరాకరించినందుకు చంపేశారు వాళ్లు. అదీ వాస్తవం. ఏడాది న్యాయపోరాటం తరువాత.. రాష్ట్ర ప్రభుత్వం ఐదు మిలియన్‌ డాలర్ల పరిహారం చెల్లించక తప్పలేదు. క్రంప్‌ కోర్టులో పొరాడకపోతే.. ఆ సత్యం సమాధి అయ్యేది. 


ఫ్లోరిడాలోని ఒక గేటెడ్‌ కమ్యూనిటీలో బంధువులుంటే అక్కడికి వెళ్లాడు ఓ నల్లజాతి విద్యార్థి ట్రైవాన్‌మార్టిన్‌. అక్కడొక శ్వేతజాతి వ్యక్తితో వాగ్వాదం జరిగింది. నన్నే ఎదిరిస్తావా? అంటూ జేబులోని తుపాకీతీసి నిర్ధాక్షిణ్యంగా కాల్చేశాడతను. మార్టిన్‌ అక్కడికక్కడే ప్రాణాలు వదిలాడు. పత్రికల్లో వార్తను చదివిన క్రంప్‌.. ఆ కేసును బలమైన ఆధారాలతో వాదించి.. కోర్టు ద్వారా పరిహారం రాబట్టాడు. 


లీగల్‌ క్రూసేడ్‌.. 

మాకు ఎవరూ దిక్కులేరు అనుకునేవాళ్లకు క్రంప్‌ దిక్కవుతాడు. పేదలు, నల్లజాతీయులకు ఏ కష్టం వచ్చినా.. నల్లకోటు తొడుక్కుని అక్కడ వాలిపోవడం అతని నైజం. ప్రతి క్షణం ఖరీదైన కాలంగా భావించే అమెరికాలో .. ఫీజులేని లాయర్లను ఊహించగలమా? ఒక్కడున్నాడు.. అని వాషింగ్టన్‌ పోస్టు, బ్లాక్స్‌ హీరో అని న్యూయార్క్‌టైమ్స్‌, లీగల్‌ క్రూసేడ్‌ అని మరో అగ్రపత్రిక కీర్తిస్తున్నాయంటే.. అదంతా క్రంప్‌ న్యాయసేవల్లోని మంచితనమే! ఈ మధ్య తెల్లజాతి పోలీసు చేతిలో చనిపోయిన జార్జ్‌ఫ్లాయిడ్‌ కుటుంబం తరఫున వాదిస్తున్నదీ ఇదే లాయరు. దీంతో నల్లజాతీయుల్లో హాలీవుడ్‌ హీరోకంటే క్రేజ్‌ సంపాదించుకున్నాడు బెంజిమన్‌ క్రంప్‌. ఒకప్పుడు చేగువేరా బొమ్మల్ని టీషర్టులపై వేసుకున్నట్లే.. ఇప్పుడు నల్లజాతి గుండెల్లో ఆ నల్లకోటు క్రంప్‌ కనిపిస్తున్నాడు.  


బాల్యం నుంచే బాధలు..

నార్త్‌కరోలినాలోని లంబర్టన్‌లో పెరిగాడు క్రంప్‌. రైలు పట్టాల పక్కనున్న ప్రభుత్వ సబ్సిడీ గృహాల్లో ఉండేది కుటుంబం. ఒకరకంగా మన దేశంలో పక్కకు విసిరేసినట్లుండే దళితవాడల్లాంటివి ఆ ఇళ్లు. అమెరికాలో జాతివివక్షను చిన్నప్పటి నుంచే అనుభవించాడు. స్కూల్‌లో తోటి తెల్లజాతి విద్యార్థులు ధనవంతులు. వంద డాలర్లు పెట్టి ఖరీదైన భోజనం చేసేవారు. తను మాత్రం ఉచిత భోజనం కోసం క్యూలో నిల్చోవాల్సి వచ్చేది. ఒక భోజనానికి వాళ్లు పెట్టే వంద డాలర్ల కోసం తన తల్లి వారం రోజులు పనిమనిషిగా చేసేది. ఆమె ఒక హోటల్‌లో అంట్లు తోమేది, చెప్పుల ఫ్యాక్టరీలో పనిచేసేది. ‘‘మేము నివసించే నగరంలో కూడా వాళ్లు (శ్వేతజాతి) ఒకవైపు, మేము ఒక వైపు ఉండేవాళ్లం. ఆ జాతి విభజన ఇళ్లకే పరిమితం కాలేదు. ఎక్కడికెళ్లినా కనిపించీ కనిపించని ఒక చిన్న గీతలాంటి అడ్డుగోడ ఉండేది. ఆ వ్యత్యాసం నన్ను ఎంతో బాధించేది..’’ అన్నాడు. నీ ఆవేదన అక్కడితోనే ఆగిపోకూడదు. ఆలోచనకు దారితీసి, ఆచరణకు పూనుకోవాలి.. అంది అమ్మ. ఆమె - థూర్‌గుడ్‌ మార్షల్‌ గురించి చెప్పుకొచ్చింది. అతను పౌరహక్కుల న్యాయవాది. ఆ రోజుల్లో నల్లజాతి, శ్వేతజాతి విద్యార్థులకు సమానమైన విద్య అందేది కాదు. అందుకోసం ఆయన న్యాయపోరాటం చేసి విద్యా సమానత్వం సాధించాడు. ‘‘నాకు అతనే ప్రేరణ. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు అమెరికాలో అట్టడుగు బలహీన వర్గాల కోసమే నేను బతుకు తున్నాను..న్యాయం ఇప్పుడు నా చేతిలో ఉన్న అస్త్రం..’’ అని చెప్పుకొచ్చాడు. 


ముక్కుపిండి వసూలు..

హైస్కూలు చదువు పూర్తి కాగానే.. ఫ్లోరిడా స్టేట్‌ యూనివర్శిటీలో స్కాలర్‌షిప్‌తో చదువుకున్నాడు. అక్కడ ప్రగతిశీల భావజాలం కలిగిన విద్యార్థి నేతలతో జత కుదిరింది. హైన్స్‌ అనే చిన్న పట్టణం నుంచి వచ్చిన డారిల్‌పార్క్స్‌ పరిచయం అయ్యాడు. ఇద్దరూ లా చదివారు. ఇద్దరి లక్ష్యం ఒక్కటే- పేదల పక్షం. డిగ్రీ చదివాక న్యాయసేవల సంస్థను ప్రారంభించారు. అప్పట్లో అమెరికాలో ఏ సంఘటన జరిగినా - తెల్లవాళ్లకు ఒక న్యాయం, నల్లవాళ్లకు ఒక న్యాయం ఉండేది. ఎందుకంటే అన్ని రంగాల్లో తెల్లవాళ్లదే ఆధిపత్యం కనుక. డెటోనాలో ఒక డేకేర్‌ సెంటర్‌ వాళ్లు రెండేళ్ల పాపను స్కూల్‌వ్యాన్‌లోనే మరిచి పోయారు. ఆ పాప చనిపోయింది. వాళ్లమ్మకు లాయర్లకు డబ్బులు చెల్లించి, కోర్టుకు ఎక్కే స్థోమత లేదు. క్రంప్‌ వాళ్ల తరఫున కోర్టుకు వెళ్లాడు. 2.4 మిలియన్‌ డాలర్ల పరిహారం రాబట్టాడు. అదే అతని తొలి న్యాయ విజయం. ఇంకోసారి.. ఒక ఆటోడీలర్‌ తన ఖరీదైన కారులో అతివేగంగా వెళుతూ.. ఒక సామాన్య మహిళను ఢీకొట్టాడు. ఆమె తీవ్రంగా గాయపడింది. ఆమె తరఫున ఎవరూ లేరు. క్రంప్‌ అండగా నిలిచి, ఆ ఆటోడీలర్‌పై కేసు వేశాడు. 3.5 మిలియన్‌ డాలర్ల జ్యూరీ అవార్డు గెలిచాడు. కోర్టుల ద్వారా వచ్చిన పరిహారమంతా బాధితులకే. క్రంప్‌ పైసా ఫీజు తీసుకోడు. 


సొంత గళం..

కార్పొరేట్‌ కంపెనీలు, ధనవంతుల కోసం ఎంతోమంది పేరుమోసిన లాయర్లు ఉన్నారు. నల్లజాతి పేదలకు అవసరమైనంత మంది లాయర్లు లేరు. ఆ కొరతను తీర్చేందుకు - అమెరికాలో భావసారూప్యత కలిగిన లాయర్లతో నెట్‌వర్క్‌ ఏర్పాటు చేశాడు క్రంప్‌. కాలిఫోర్నియా, జార్జియా, ఇల్లినాయిస్‌, టెక్సాస్‌, వాషింగ్టన్‌లకు అతని సేవలు విస్తరించాయి. అమెరికాలో ప్రధాన మీడియా కూడా శ్వేతజాతి ఆధిపత్యంలోనే ఉంటోంది. తన భావాలు, ఆలోచనలకు అనుకున్నంత చోటు దక్కేది కాదు. బ్రూక్‌లిన్‌ మీడియా పేరుతో సొంత టీవీ ఛానల్‌ మొదలుపెట్టాడు.అందులో జాతివివక్షకు మూలాలు వెతుకుతూ ప్రత్యేక డాక్యు మెంటరీలను ప్రసారం చేయడం మొదలు పెట్టాడు. కమర్షియల్‌ టీవీల్లో  వచ్చే స్కిన్‌షోలు, ఊకదంపుడు చర్చలు, వికృతమైన హాస్యం.. ఇవేవీ ఉండవు. అణగారిన వర్గాల గళం.. బడుగుల వేదన.. న్యాయ పోరాట విజయాలు.. ఇవే ప్రసారం అవుతుంటాయి. కొన్ని సంఘటనలు జరిగినప్పుడు.. ప్రధాన మీడియాలో పడి కొట్టుకుపోదు తన ఛానల్‌. వర్గదృక్పథంతో న్యాయాన్యాయాలను బేరీజు వేస్తుంది. బాధితుల పక్షాన నిలబడుతుంది.   


న్యాయంలోనూ వివక్ష..

లూసియానాలోని ఒక కిరాణాకొట్టులో ఒక నల్ల జాతీయుడు అక్రమంగా సీడీలు అమ్ముతున్నాడంటూ.. అతన్ని ఒక తెల్లపోలీసు కాల్చి చంపాడు. ఆ సంఘటన అన్యాయమైనదంటూ తోటి పోలీసైన నాకియాజోన్స్‌ ఫేస్‌బుక్‌లో ఒక పోస్టు పెట్టింది. పోలీసు వ్యవస్థలోని లోపాలను ఎత్తి చూపింది. అందుకు ఆగ్రహించిన పోలీసుశాఖ ఆమెను ఉద్యోగం నుంచి తొలగించింది. ఇప్పుడామె తరఫున కోర్టులో వాదిస్తున్నాడు క్రంప్‌. ఇలా.. ప్రభుత్వంలోనూ ప్రశ్నించే స్వరాలకు.. ఆయన న్యాయపరమైన అండ లభిస్తోంది. 


Updated Date - 2020-09-13T15:50:49+05:30 IST