Abn logo
Sep 15 2021 @ 12:33PM

Minister Anil అనుచరుల నీతిమాలిన పని.. హైదరాబాద్‌లోనే తిష్ట.. పరువు పోయిందని తీవ్ర ఆగ్రహం.. లెక్క చేయని పోలీసులు!

ఏపీ మంత్రి అనిల్ కుమార్ హైదరాబాద్‌లో ఎందుకు తిష్ట వేశారు? తెలంగాణ అధికారులు మంత్రి అనిల్‌ను ఎందుకని లెక్క చేయలేదు? ఆయన అనుచరులు చేసిన పెద్ద తప్పిదం ఏమిటి? నెల్లూరీయులందరికీ ఆగ్రహం తెప్పించేంత నీతిమాలిన పని ఏం చేశారు? హైదరాబాద్‌లో నెల్లూరు పరువు పోయిందని ఎందుకంటున్నారు? క్రికెట్ బెట్టింగ్ వ్యవహారం మళ్లీ తెరపైకి ఎందుకొచ్చింది? అనే ఆసక్తికర విషయాలు ‘ఏబీఎన్-ఆంధ్రజ్యోతి’ ఇన్‌సైడ్‌లో చూద్దాం.

కొన్ని వారాలుగా హైదరాబాద్‌లో తిష్ట..!

"ఎప్పుడొచ్చాం అని కాదన్నయ్య... బుల్లెట్ దిగిందా? లేదా? అన్నది ముఖ్యం.. మా జోలికి వస్తే ఎంతటి వారినైనా అంతు చూస్తాం... రండి చూసుకుందాం, మగాళ్లైతే..." ఇవీ ఏపీ మంత్రి అనిల్ కుమార్ ప్రతిసారీ ఆవేశంగా తొడలు చరుస్తూ చెప్పే సినీ డైలాగులు. అయితే ఇలా గంభీరంగా డైలాగులు పలికే అనిల్‌కు ఇటీవల త్రోట్ ఇన్ఫెక్షన్ వచ్చిందట. గత కొన్నివారాలుగా హైదరాబాద్‌లోనే తిష్ట వేసి వైద్యం చేయించుకుంటున్నారట. ఇదిలా ఉంటే, అనిల్‌ను పరామర్శించేందుకు నెల్లూరు నుంచి ఆయన అనుచరులు వెళ్లి వస్తున్నారు. ఈ క్రమంలో అనిల్ ముఖ్య అనుచరుడు, ఆప్తుడు నాగూర్ నాగార్జునరెడ్డి కొంతమందితో కలిసి ఇటీవల హైదరాబాద్‌కు వెళ్లారు. మంత్రి అనిల్‌ను పరామర్శించారు. అయితే పరామర్శ కోసం హైదరాబాద్‌కు వచ్చిన వారు.. నగరంలో అనైతిక వ్యవహారానికి పాల్పడుతూ పోలీసులకు అడ్డంగా దొరికిపోయారు. ఇది మంత్రి అనిల్‌కు తలవొంపులు తెచ్చిపెట్టిందని టాక్.

అనుచరుల నీతిమాలిన పని..!

మాదాపూర్ కావూరి హిల్స్‌లోని ఎన్ స్క్వేర్ బిల్డింగ్‌లో హవెన్ స్పా పేరుతో వ్యభిచార గృహం నిర్వహిస్తున్నారని ఎస్ఓటీ విభాగానికి సమాచారం అందింది. ఆకస్మికంగా దాడులు నిర్వహించగా 23 మంది దొరికిపోయారు. వారందర్నీ అదుపులోకి తీసుకుని మాదాపూర్ పోలీసులకు అప్పగించారు. 20 లక్షల రూపాయలు విలువ జేసే సొమ్ము, సొత్తులు స్వాధీనం చేసుకున్నారు. అరెస్ట్ అయినవారిలో నెల్లూరుకు చెందిన నాగూర్ నాగార్జునరెడ్డి, సన్నపరెడ్డి కిరణ్‌కుమార్‌రెడ్డి, కోడూరు హరి, నిమ్మల శ్రీనివాసులు, తోట వినీల్ పేర్లు ఎఫ్ఐఆర్‌లో నమోదయ్యాయి. వీరంతా మంత్రి అనిల్ కుమార్‌కు ముఖ్య అనుచరులు. అయితే అరెస్ట్ అయినప్పటి ఫోటోలలో మంత్రి అనిల్ మరో ముఖ్య అనుచరుడు బాహుబలి గంగాధర్ కూడా ఉన్నారు. గంగాధర్ పేరు మార్చి చెప్పి ఉండొచ్చనే చర్చలు సాగుతున్నాయి. నాగార్జునరెడ్డి ఇటీవల కొన్ని కాంట్రాక్డులు చేసి నాలుగు రాళ్లు వెనకేసుకున్నారనీ, నెల్లూరు గొలగమూడి రోడ్డులోని ఓ బార్ అండ్ రెస్టారెంట్‌ను గంగాధర్, హరిలు లాగేసుకున్నారనీ కూడా చర్చలు సాగుతున్నాయి.

అక్కడ పట్టుబడ్డారు.. ఇక్కడ హాట్ టాపిక్..

మంత్రి అనిల్‌ పరామర్శ కోసం హైదరాబాద్‌కు వెళ్లిన ఆయన అనుచరులు వ్యభిచారానికి పాల్పడుతూ పట్టుబడిన విషయం నెల్లూరీయుల్లో హాట్‌టాపిక్‌గా మారింది. మంత్రిని పరామర్శించేందుకు హైదరాబాద్‌కు వెళ్లి.. అక్కడ నీతిమాలిన పనేమిటని నెల్లూరీయులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ వ్యవహారంతో తమ ప్రాంతీయుల పరువు పోయినట్లు అయిందని నెల్లూరీయులు ఆగ్రహంతో కూడిన ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇంతలా పాడు పనికి పాల్పడిన వారిని కాపాడేందుకు మంత్రి అనిల్, మరికొంత మంది తమకున్న పలుకుబడితో తీవ్ర ప్రయత్నాలు చేశారట. అయితే తెలంగాణ పోలీసులు ఒత్తిళ్లకి తలొగ్గలేదు. అందర్నీ అరెస్ట్ చేసి రిమాండుకి పంపారు. అంతేకాదు, దాడి సమయంలో ఫోటోలను రిలీజ్ చేశారు. మంత్రి అనిల్ నిందితుల తరపున చేసిన సిఫార్సు చేయలేదని, ఆయన అనుచరులు కొందరు చెబుతున్నారు. ఏదిఏమైనా హైదరాబాద్‌లో నెల్లూరు పరువు పోయింది అనడంలో‌ సందేహం లేదన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

అప్పుడు బెట్టింగ్.. ఇప్పుడు బ్రోతల్.. ఏంటిది..!?

నిజానికి టీడీపీ హయాంలో నెల్లూరు జిల్లాలో క్రికెట్ బెట్టింగ్ కేసు సంచలనం రేపింది. ఈ కేసులో అప్పట్లో ఎమ్మెల్యేగా ఉన్న ప్రస్తుత మంత్రి అనిల్ కుమార్ కూడా విచారణ ఎదుర్కొన్నారు. ప్రస్తుతం హైదరాబాద్ మాదాపూర్ బ్రోతల్ కేసులో పట్టుబడిన మంత్రి అనుచరుడు నాగార్జునరెడ్డి.. క్రికెట్ బెట్టింగ్ కేసులోనూ నిందితుడు. అప్పట్లో బెట్టింగ్ వ్యవహారంతో తనకు సంబంధమే లేదని, అందులో పట్టుబడిన నిందితులు కూడా తనకు ఎవరో తెలియదని అనిల్ ప్రకటనలు చేశారు. ఈ క్రమంలో ఇప్పుడు మంత్రి అనిల్, నాగార్జునరెడ్డి కలిసి ఉన్న ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో హల్‌చల్‌ చేస్తున్నాయి.

లెక్క చేయని తెలంగాణ ఖాకీలు!

గతంలో క్రికెట్ బెట్టింగ్ కేసు, ఇప్పుడు బ్రోతల్ కేసులోని నిందితులతో మంత్రి అనిల్‌కు మంచి స్నేహమే ఉందనీ, ఇవిగో ఆధారాలు అంటూ చేసిన పోస్టింగ్‌లు చక్కర్లు కొడుతున్నాయి. మొత్తంమీద, మాదాపూర్ కేసు వ్యవహారంలో ఏపీ పెద్దల సిఫార్సులను తెలంగాణ పోలీసు అధికారులు లెక్క చేయకపోవడం, మంత్రి అనిల్‌ కుమార్‌ అనుచరులు బ్రోతల్ కేసులో అరెస్ట్ కావడంపై నెల్లూరు జిల్లాలో జోరుగా చర్చ జరుగుతోంది.


క్రైమ్ మరిన్ని...