Bank Of Baroda కుంభకోణంలో నేడు భారీగా అరెస్టులు.. తీవ్ర ఉత్కంఠ!

ABN , First Publish Date - 2021-09-14T12:10:20+05:30 IST

సోమవారం అరెస్టు చేస్తారనే ప్రచారం జరిగినా అది మంగళవారానికి ..

Bank Of Baroda కుంభకోణంలో నేడు భారీగా అరెస్టులు.. తీవ్ర ఉత్కంఠ!

  • డ్వాక్రా సంఘాల నిధుల్లో 
  • బీవోబీ చేతి వాటం రూ.2.18 కోట్లు

హైదరాబాద్ సిటీ/కలికిరి : కలికిరి బ్యాంక్‌ ఆఫ్‌ బరోడాలో ఖాతాలున్న మహిళా సంఘాలకు సంబంధించిన రూ.2.18 కోట్ల అక్రమాలు  సోమవారం నాటికి వెలుగు చూశాయి. 233 సంఘాలుండగా, 199 గ్రూపుల్లో తనిఖీలు పూర్తి చేశారు. ఇందులో సగం గ్రూపుల్లో నుంచి రూ. 2,17,92,153 తాత్కాలిక మెసెంజరు ఆలీఖాన్‌ ద్వారా పక్కదారి పట్టినట్లు గుర్తించారు. మరో 34 గ్రూపుల్లో తనిఖీలు చేయాల్సి వుంది. అయితే ఈ గ్రూపులకు సంబంధించిన రికార్డులను అందుబాటులో వుంచడానికి ఈ సంఘాల లీడర్లు, సంఘ మిత్రలు సహకరించడం లేదని చెబుతున్నారు. మంగళవారం నాటికి ఈ గ్రూపుల్లో కూడా తనిఖీలు పూర్తి చేస్తామని.. సహకరించని గ్రూపుల సమాచారాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తామని వెలుగు అధికారులు చెబుతున్నారు. మిగిలిన గ్రూపుల్లో కూడా దాదాపు రూ.ముప్పై నుంచి నలభై లక్షల వరకూ తేడాలు వుండొచ్చని అంచనా వేస్తున్నారు.


అరెస్టులపై ఉత్కంఠ..

కేసు దర్యాప్తు చేస్తున్న సీఐ నాగార్జున రెడ్డి, ఎస్‌ఐ లోకేష్‌ రెడ్డి సోమవారం వెలుగు అధికారుల నుంచి కొంత సమాచారం రాబట్టారు. ఈ కేసులో అభియోగాలను ఎదుర్కొంటున్న వారిని సోమవారం అరెస్టు చేస్తారనే ప్రచారం జరిగినా అది మంగళవారానికి వాయిదా పడినట్లు సమాచారం. మొత్తం మీద మొదటి దఫాలో కనీసం 12 లేక 13 మందిని అరెస్టు చేయొచ్చనే ప్రచారం జరుగుతోంది. మంగళవారం అరెస్టులంటూ జరిగితే  రూ. 20 లక్షల వరకూ రికవరీ కూడా చూపించవచ్చని చెబుతున్నారు. బీవోబీ కుంభకోణానికి సంబంధించి కలికిరి పోలీసులకు అందిన రెండు ఫిర్యాదుల మేరకు కేసు దర్యాప్తు కొనసాగుతోంది. మేడికుర్తి సంఘమిత్ర ప్రసన్నలక్ష్మి గణపతి గ్రూపు లో పక్కదారి పట్టిన రూ.11.38 లక్షలకు సంబంధించిన ఫిర్యాదు మొదటిది కాగా తాత్కాలిక మెసెంజరు ఆలీఖాన్‌, ఆయన భార్య చాందినీ ఉమ్మడి ఖాతాకు సంబంధించి తిరుపతి బీవోబీ ఆర్‌ఎం శేషగిరి  చేసిన పిర్యాదు రెండవది. ఈ పరిణామాల నేపథ్యంలో బీవోబీలో పనిచేసే ఒక మేనేజరు సహా మరో 8మంది ఉద్యోగులను ఇప్పటికే సస్పెండు చేశారు. మరో మేనే జరు పదవీ విరమణ చేయగా ఆయన పెన్షను ఖాతాను స్తంభింపజేశారు.


పట్టించుకోని డీఆర్‌డీఏ..

వెలుగు సంఘాలను జిల్లాస్థాయిలో ప్రత్యక్షంగా పర్యవేక్షించే డీఆర్‌డీఏ అధికారులు కలికిరిలో జరుగుతున్న పరిణామాలను అసలు పట్టించుకోవడం లేదని మహిళా సంఘాలు ఆరోపిస్తున్నాయి. జిల్లా అధికారులు ఈ ఇరవై రోజులుగా ఇటు చూసిన పాపాన పోలేదని వాపోతున్నారు. కాగా బ్యాంక్‌ ఆఫ్‌ బరోడాలో వున్న మండల మహిళా సమాఖ్యకు చెందిన డిపాజిట్లు, ఇతరత్రా రూ. కోటి ఇరవై లక్షలు అక్కడి నుంచి ఉపసంహరించి ఇతర బ్యాంకులకు మళ్ళించారు.మరోవైపు చీకటిపల్లె మహిళా సంఘాలకు చెందిన కొంతమంది మగవాళ్ళు వెలుగు అధికారులతో సోమవారం పేచీకి దిగారు. తమ గ్రూపులకు జరిగిన నష్టాన్ని ఎవరు భర్తీ చేస్తారని నిలదీశారు. పోలీసులు జోక్యం చేసుకోవడంతో గొడవ సద్దుమణిగింది. 

Updated Date - 2021-09-14T12:10:20+05:30 IST