ఆగని దూకుడు!

ABN , First Publish Date - 2021-10-19T08:12:48+05:30 IST

దలాల్‌ స్ట్రీట్‌లో వరుసగా ఏడో రోజూ బుల్‌ ర్యాలీ కొనసాగింది. ఐటీ, బ్యాంకింగ్‌, మెటల్‌ కంపెనీల షేర్ల కొనుగోళ్ల జోరుతో సోమవారం స్టాక్‌ సూచీలు సరికొత్త శిఖరాలకు చేరుకున్నాయి.

ఆగని దూకుడు!

ఇంట్రాడేలో 62,000కు చేరువైన సెన్సెక్స్‌ 

460 పాయింట్ల లాభంతో 61,765 వద్ద ముగింపు

రూ.274.69 లక్షల కోట్లకు మార్కెట్‌ సంపద 


ముంబై: దలాల్‌ స్ట్రీట్‌లో వరుసగా ఏడో రోజూ బుల్‌ ర్యాలీ కొనసాగింది. ఐటీ, బ్యాంకింగ్‌, మెటల్‌ కంపెనీల షేర్ల కొనుగోళ్ల జోరుతో సోమవారం స్టాక్‌ సూచీలు సరికొత్త శిఖరాలకు చేరుకున్నాయి. సెన్సెక్స్‌ 61,963 స్థాయి వద్ద ఆల్‌టైం ఇంట్రాడే గరిష్ఠాన్ని నమోదు చేసుకుంది. చివరికి 459.64 పాయింట్ల లాభంతో 61,765.59 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 138.50 పాయింట్లు లాభంతో 18,477.05 పాయిం ట్ల వద్ద క్లోజైంది. సూచీలకు సరికొత్త గరిష్ఠ ముగింపు స్థాయిలివి. ఇంట్రాడేలో 18,543.15 వద్ద నిఫ్టీ ఆల్‌టైం గరిష్ఠ రికార్డు నమోదైంది. సెన్సెక్స్‌ కంపెనీల్లో ఇన్ఫోసిస్‌ 4.47 శాతం లాభంతో టాప్‌ గెయినర్‌గా నిలిచింది. టెక్‌ మహీంద్రా, టాటా స్టీల్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌, ఐటీసీ, మారుతి సుజుకీ, ఎస్‌బీఐ,   యా క్సిస్‌ బ్యాంక్‌ షేర్లు సైతం లాభాల్లో పయనించాయి. హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌, మహీంద్రా అండ్‌ మహీంద్రా, డాక్టర్‌ రెడ్డీస్‌, ఏషియన్‌ పెయింట్స్‌, బజాజ్‌ ఆటో, హెచ్‌డీఎ్‌ఫసీ బ్యాంక్‌, భారతీ ఎయిర్‌టెల్‌ షేర్లు మాత్రం 2.36 శాతం వరకు నష్టపోయాయి. సోమవారం ర్యాలీలో స్టాక్‌ మార్కెట్‌ వర్గాల సంపద మరో రూ.1.93 లక్షల కోట్లు పెరిగి రూ.274.69 లక్షల కోట్లకు చేరుకుంది. గడిచిన ఏడు రోజుల్లో మదుపరుల సంపద రూ.12.49 లక్షల కోట్లు పెరిగింది.  


నైకా, అదానీ విల్మార్‌, స్టార్‌ హెల్త్‌  ఇష్యూలకు ఓకే  

 పెన్నా సిమెంట్స్‌తో పాటు మరో 5 కంపెనీల ఐపీఓ ప్రతిపాదనలకు సెబీ ఆమోదం తెలిపింది. సౌందర్య ఉత్పత్తుల పోర్టల్‌ నైకా, ఫార్చూన్‌ బ్రాండ్‌ వంటనూనెల కంపెనీ అదానీ విల్మార్‌, స్టార్‌ హెల్త్‌ అండ్‌ అల్లైడ్‌ ఇన్సూరెన్స్‌, లేటెంట్‌ వ్యూ అనలిటిక్స్‌, సిగాచీ ఇండస్ట్రీస్‌ ఈ జాబితాలో ఉన్నాయి.  


జీరోధా క్లయింట్లకు ఇక్కట్లు ..

స్టాక్‌ బ్రోకింగ్‌ సేవల కంపెనీలైన జీరోధా, పేటీఎం మనీ, ‘గ్రో’కు చెందిన ఇన్వెస్టర్లు సోమవారం ఉదయం షేర్ల విక్రయంలో సమస్యలు ఎదుర్కొన్నారు. సెంట్రల్‌ డిపాజిటరీ సర్వీసెస్‌ లిమిటెడ్‌ (సీడీఎస్‌ఎల్‌)కు సంబంధించిన సమస్య కారణంగా ఈ ఇబ్బంది తలెత్తినట్లు జీరోధా స్పష్టం చేసింది. అయితే, మధ్యాహ్నానికల్లా సీడీఎస్‌ఎల్‌ సమస్యను పరిష్క రించిందని ట్విటర్‌లో పేర్కొంది. మిగతా బ్రోకరేజీ కంపెనీలు సైతం తమ ఇన్వెస్టర్లకు ఈ విషయంపై ట్విటర్‌ ద్వారా ఎప్పటికప్పుడు సమాచారం అందించాయి. 

Updated Date - 2021-10-19T08:12:48+05:30 IST