భారీ లాభాలతో ముగిసిన భారత స్టాక్ మార్కెట్లు

ABN , First Publish Date - 2020-03-26T22:56:12+05:30 IST

భారత స్టాక్ మార్కెట్లు వరుసగా మూడోరోజు లాభాలతో ముగిశాయి. ఇవాళ ఒక్కరోజే బెంచ్‌మార్క్ సూచీ...

భారీ లాభాలతో ముగిసిన భారత స్టాక్ మార్కెట్లు

న్యూఢిల్లీ: భారత స్టాక్ మార్కెట్లు వరుసగా మూడోరోజు లాభాలతో ముగిశాయి. ఇవాళ ఒక్కరోజే బెంచ్‌మార్క్ సూచీ బీఎస్‌ఈ సెన్సెక్స్ 1400 పాయింట్లకు పైగా లాభం నమోదు చేసింది. దేశంలో కరోనా వైరస్ కారణంగా దెబ్బతిన్న వివిధ రంగాలకు ఆపన్న హస్తం అందిస్తూ కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ రూ. 1.70 లక్షల కోట్ల ఆర్ధిక ప్యాకేజీ ప్రకటించిన సంగతి తెలిసిందే. దీనిపై ఇన్వెస్టర్లు సానుకూలంగా స్పందించడంతో.. సెన్సెక్స్ 1411 పాయింట్లు (4.94శాతం) మేర ఎగసి 29,947 వద్ద ముగిసింది. మరోవైపు ఎన్ఎస్‌ఈ నిఫ్టీ సైతం 324 పాయింట్లు (3.89 శాతం) లాభంతో 8,641 వద్ద క్లోజయ్యింది.


సెన్సెక్స్‌లో అత్యధిక లాభాలు నమోదు చేసిన వాటిలో ఇండస్ ఇండ్ బ్యాంకు, ఎల్అండ్‌టీ, బజాజ్ ఫైనాన్స్, భారతీ ఎయిర్ టెల్, బజాజ్ ఆటో, హెచ్‌డీఎఫ్‌సీ తదితర షేర్లు ఉన్నాయి. ఈ షేర్లన్నీ దాదాపు 46.08 శాతం మేర లాభాలు నమోదుచేశాయి. ఇక ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ ఉప సూచీల్లో... నిఫ్టీ బ్యాంకు, ప్రయివేట్ బ్యాంకు, రియల్టీ తదితర సూచీలు 8.27 శాతం మేర పుంజుకున్నాయి.  కాగా కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు తీసుకుంటున్న కట్టుదిట్టమైన చర్యలతో పాటు.. కేంద్రం రూ. 1.70 లక్షల కోట్ల మేర ఆర్ధిక ప్యాకేజీ ప్రకటించడం పెట్టుబడిదారుల్లో కొత్త ఆశలు రేకెత్తించినట్టు మార్కెట్ వర్గాలు వెల్లడించాయి. దీనికి తోడు అంతర్జాతీయ మార్కెట్లలో కనిపిస్తున్న సానుకూల పరిస్థితులు కూడా మార్కెట్‌కు మంచి ఊపు తీసుకొచ్చాయి. అమెరికా ఆర్థిక వ్యవస్థకు 2 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక ప్యాకేజీపై సెనెట్ నాయకులు, శ్వేతసౌదం ఒక అవగాహనకు రావడం ఇన్వెస్టర్లపై సానుకూల ప్రభావం చూపినట్టు విశ్లేషకులు చెబుతున్నారు. 

Updated Date - 2020-03-26T22:56:12+05:30 IST