కొవిడ్‌ టైమ్‌లో బుల్‌ హవా

ABN , First Publish Date - 2021-03-30T06:15:35+05:30 IST

స్టాక్‌ మార్కెట్‌ అంటేనే ఆటుపోట్లు. అందులో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21) గురించి ఇక చెప్పాల్సిందేమీ లేదు. పులి మీద పుట్రలా వచ్చి పడిన కొవిడ్‌-19తో ప్రపంచవ్యాప్తంగా స్టాక్‌ మార్కెట్లు కుప్పకూలాయి

కొవిడ్‌ టైమ్‌లో బుల్‌ హవా

రికార్డులతో హోరెత్తిన సూచీలు 

సెన్సెక్స్‌ 66 శాతం వృద్ధి 

2020-21లో స్టాక్‌ మార్కెట్ల దూకుడు


2021 కేంద్ర బడ్జెట్‌ మార్కెట్‌ ర్యాలీకి ప్రధానంగా దోహదం చేసింది. ఈ బడ్జెట్‌లో ప్రైవేటీకరణకు పెద్ద పీట వేయడంతో మార్కెట్‌ సెంటిమెంట్‌ బాగా మెరుగుపడింది. 

 - వీకే విజయ్‌ కుమార్‌,  జియోజిత్‌ ఫైనాన్షియల్స్‌


ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టేందుకు ప్రభుత్వం, ఆర్‌బీఐ తీసుకున్న చర్యలు, కొవిడ్‌ టీకా అందుబాటులోకి రావడం, అంతర్జాతీయ పరిణామాలు మార్కెట్‌ ర్యాలీకి దోహదం చేశాయి.             

   - అజిత్‌ మిశ్రా, రెలిగేర్‌ బ్రోకింగ్‌


న్యూఢిల్లీ: స్టాక్‌ మార్కెట్‌ అంటేనే ఆటుపోట్లు. అందులో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21) గురించి ఇక చెప్పాల్సిందేమీ లేదు. పులి మీద పుట్రలా వచ్చి పడిన కొవిడ్‌-19తో ప్రపంచవ్యాప్తంగా స్టాక్‌ మార్కెట్లు కుప్పకూలాయి. ఆ ప్రభావం భారత మార్కెట్లోనూ కనిపించింది. కొవిడ్‌-19 ఆర్థిక వ్యవస్థను ముంచేస్తోందన్న భయాలతో గత ఏడాది మార్చిలో సెన్సెక్స్‌ ఏకంగా 23 శాతం (8,828.8 పాయింట్లు) నష్టపోయింది.

 

అందులో మార్చి 23న సెన్సెక్స్‌ 3,935 పాయింట్లు నష్టపోయి 25,981 స్థాయిని తాకింది. ఆ తరువాతి రోజూ సెన్సెక్స్‌ మరింత నష్టపోయి ఇంట్రాడేలో 23,639కి చేరింది. సెన్సెక్స్‌ గతంలో ఒక నెలలో ఆ మాటకొస్తే ఒక రోజు ఎన్నడూ ఇంత భారీ స్థాయిలో పతనం కాలేదు.


మళ్లీ రికార్డుల హోరు 

కొవిడ్‌ను కట్టడి చేసేందుకు విధించిన లాక్‌డౌన్లతో ఆర్థిక వ్యవస్థ మరింత కుంగిపోయింది. దీన్ని సరిదిద్దేందుకు ప్రభుత్వం, భారతీయ రిజర్వ్‌ బ్యాంక్‌ (ఆర్‌బీఐ) వెంటనే ఉద్దీపన చర్యలు చేపట్టాయి. దీంతో గత ఏడాది నవంబరు నుంచి సెన్సెక్స్‌ మళ్లీ లాభాల బాట పట్టింది. అక్కడి నుంచి మార్కెట్లో ఏ నెలకు ఆ నెల సరికొత్త రికార్డులు నమోదయ్యాయి. దీంతో ఈ ఆర్థిక సంవత్సరం ఇప్పటి వరకు సెన్సెక్స్‌ 19,540.01 పాయింట్లు (66.30 శాతం)  దూసుకుపోయింది. గత ఏడాది ఏప్రిల్‌ 3న 27,500.79 పాయింట్ల ఏడాది కనిష్ఠ స్థాయిని తాకిన సెన్సెక్స్‌ ఈ ఏడాది ఫిబ్రవరి 3న కీలకమైన 50,000 పాయింట్ల  మైలురాయిని అధిగమించింది. మరో 13 రోజుల్లో అంటే ఫిబ్రవరి 16న 52,516.76 పాయింట్ల సరికొత్త రికార్డు నమోదు చేసింది. కొవిడ్‌తో ఆర్థిక వ్యవస్థ కోమాలోకి వెళ్లిన సమయంలోనూ దేశీయ స్టాక్‌ మార్కెట్లో ఈ రికార్డులు నమోదవడం విశేషం.


కలిసొచ్చిన అంశాలు 

కొవిడ్‌తో చతికిలపడిన ఆర్థిక వ్యవస్థను సరిదిద్దేందుకు ప్రభుత్వం, ఆర్‌బీఐ వెంట వెంటనే చర్యలు చేపట్టాయి. రుణ వసూళ్లపై ఆరు నెలల పాటు మారటోరియం విధించారు. ఎంఎ్‌సఎంఈలకు పరపతి హామీ కల్పించారు. కంపెనీలపై దివాలా ప్రక్రియనూ ఏడాది పాటు రద్దు చేశారు. ఫిబ్రవరి 1న ప్రకటించిన  కేంద్ర బడ్జెట్‌ కూడా మార్కెట్‌ను ఊరించింది. వీటన్నిటి కారణంగా మార్కెట్లో నిధుల సరఫరా పెరిగి పోయింది. వడ్డీ రేట్లు పదేళ్ల కనిష్ఠ స్థాయికి పడిపోయాయి. బేర్‌ ఆపరేటర్ల పట్టుతో షేర్ల ధరలూ ఆకర్షణీయంగా మారాయి. దీన్ని అవకాశంగా చేసుకుని విదేశీ పోర్టుఫోలియో ఇన్వెస్టర్ల (ఎఫ్‌పీఐ)తో సహా దేశీయ ఇన్వెస్టర్లు పోలోమంటూ స్టాక్‌ మార్కెట్‌ పెట్టుబడులకు దిగారు. ఇవన్నీ ఈ ఆర్థిక సంవత్సరం దేశీయ స్టాక్‌ మార్కెట్‌ను పరుగులు పెట్టించాయి. 


భవిష్యత్‌ ఆశాజనకమే 

మహారాష్ట్ర, కేరళ, గుజరాత్‌ వంటి రాష్ట్రాల్లో ప్రస్తుతం కొవిడ్‌-19 రెండో దశ ప్రారంభమైంది. అయినా గతంలో లాక్‌డౌన్లు విఽధించేది లేదని ఆయా ప్రభుత్వాలు ప్రకటించాయి. దీనికి తోడు ప్రస్తుతం కొవిడ్‌ వ్యాక్సిన్‌ కూడా అందుబాటులోకి వచ్చింది. దీంతో ఆర్థిక వ్యవస్థకు గానీ.. స్టాక్‌ మార్కెట్లకు గానీ ఎలాంటి ఢోకా ఉండదని భావిస్తున్నారు. 2021-22 ఆర్థిక సంవత్సరం జీడీపి వృద్ధి రేటు రెండంకెల స్థాయిలో ఉంటుందని అంచనా. వరుణుడి దయతో వ్యవసాయ రంగం బాగానే ఉంది. వడ్డీ రేట్లు తక్కువ స్థాయిలోనే ఉన్నాయి. ఇవన్నీ వచ్చే ఆర్థిక సంవత్సరం దేశీయ స్టాక్‌ మార్కెట్‌ను పరుగులు పెట్టిస్తాయని భావిస్తున్నారు. 


రూ.లక్ష కోట్ల మార్కెట్‌ క్యాప్‌ గాయబ్‌

గత వారం దేశీయ స్టాక్‌ మార్కెట్‌.. ఇన్వెస్టర్లకు చుక్కలు చూపింది. సెన్సెక్స్‌ 1.7 శాతం (849.74 పాయింట్లు) నష్టపోయింది. దీంతో సెన్సెక్స్‌లోని 10 ప్రముఖ కంపెనీల షేర్ల మార్కెట్‌ విలువ (మార్కెట్‌ క్యాప్‌) రూ.1.07 లక్షల కోట్లు తుడిచి పెట్టుకుపోయింది. ఇందులో సగం నష్టం రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ కౌంటర్‌లో జరిగింది. టీసీఎస్‌, హెచ్‌యూఎల్‌, హెచ్‌డీఎ్‌ఫసీ కంపెనీల షేర్లు మాత్రం మార్కెట్‌ ఆటుపోట్లను తట్టుకుని లాభాల బాటపట్టాయి. 

Updated Date - 2021-03-30T06:15:35+05:30 IST