విభజన–విద్వేషం

ABN , First Publish Date - 2020-10-31T06:11:06+05:30 IST

రాడికల్‌ ఇస్లామ్‌ను అనుమతించబోమని ఫ్రాన్స్‌ హెచ్చరిస్తోంది. సాధారణ ఇస్లామిక్‌ మతవిశ్వాసాలపై కూడా ఫ్రెంచి సమాజం అసహనం...

విభజన–విద్వేషం

రాడికల్‌ ఇస్లామ్‌ను అనుమతించబోమని ఫ్రాన్స్‌ హెచ్చరిస్తోంది. సాధారణ ఇస్లామిక్‌ మతవిశ్వాసాలపై కూడా ఫ్రెంచి సమాజం అసహనం చూపుతున్నదని, తమను తాముగా ఉండనివ్వకుండా నిర్బంధం విధిస్తున్నదని అక్కడి ముస్లిములు అంటున్నారు. ఇది కేవలం చర్చ కాదు. కొన్ని మత పద్ధతుల పాటింపు గురించిన వివాదంగా మాత్రమే లేదు. ఇదొక హింసాత్మక చర్యల పరంపరగా మారింది. రెండుదేశాల మధ్య ఉద్రిక్తతగా పరిణమించింది. ఒక్కో శిబిరం వెనుక అనేక దేశాల మోహరింపునకు కూడా దారితీస్తున్నది. ఇంతకీ ఫ్రాన్స్‌లో ఏమి జరుగుతోంది?


ఒక నిర్దిష్ట సంఘటనతో మాత్రమే క్రమాన్ని మొత్తంగా న్యాయంగా వివరించలేము. సామ్యూల్‌ పాటీ అనే ఉపాధ్యాయుడు మహమ్మద్‌ ప్రవక్తపై చార్లీ హెబ్డో అనే పత్రిక ప్రచురించిన కార్టూన్లను తన విద్యార్థులకు ప్రదర్శించాడు. ఈ అక్టోబర్‌ 16 నాడు అతన్ని పారిస్‌ శివారు నివాస ప్రాంతంలో పద్ధెనిమిదేళ్ల అబ్దౌల్లాఖ్‌ అంజోరోవ్‌ అనే చెచెన్‌ ముస్లిమ్‌ శరణార్థి యువకుడు తలనరికి చంపాడు. శిరచ్ఛేదం ఎంతటి అమానుషం! అసమ్మతిని తెలపడానికి అనేక మార్గాలున్నాయి. కార్టూన్లను తిరిగి ప్రచురించడం, వాటిని ఉపాధ్యాయుడు విద్యార్థులకు ప్రదర్శించడం వాంఛనీయాలు కావు. అన్ని వ్యక్తీకరణలూ హక్కుల పరిధిలోకిరావు. కొన్ని సార్లు సంస్కారాలు, మనోభావాలు కూడా పరిగణనలోకి రావాలి. 


 ఆ కార్టూన్లు నిజానికి ఈ నాటివి కావు. 2015 లోనే ఆ పత్రిక మొదటిసారి ప్రచురించింది. అది పెద్ద నిరసనలకు కారణమైంది. ఇద్దరు ముస్లిమ్‌ యువకులు ఆ ఏడు జనవరిలో పత్రిక కార్యాలయంపై దాడి చేసి పన్నెండుమందిని కాల్చిచంపారు. ఆ పత్రిక తాము కార్టూన్లను ప్రచురించడం భావప్రకటనాస్వేచ్ఛను వినియోగించుకోవడంగా చెప్పుకున్నది. కార్టూన్లలో ఎటువంటి వ్యంగ్యం ఉన్నది తరువాతి మాట కానీ, ప్రవక్తకు రూపం ఇచ్చి చిత్రించడమే తమ విశ్వాసాల ప్రకారం అపచారమని ఆ విశ్వాసాన్ని ఇతరులు కూడా గౌరవించాలని ఇస్లామిక్‌ సమాజం వాదించింది. ఇటీవలికాలంలో ఫ్రాన్స్‌లో జరిగిన అనేక ఉగ్రవాద సంఘటనలు ఆ సమాజంలో విభజనను తీవ్రం చేశాయి. మితవాద అభిప్రాయాల శిబిరాలు బలపడుతూ వచ్చాయి. అసహనం పెరిగింది. ముస్లిమ్‌ స్త్రీలు శిరోవస్త్రాన్ని ధరించి విద్యాలయాలకు, ప్రభుత్వ కార్యాలయాలకు హాజరు కావడంపై పెద్ద వివాదం జరిగింది. సెక్యులరిజానికి, రాడికల్‌ ఇస్లామ్‌కు వైరుధ్యంగా మొదలైన ఉద్రిక్తత, ఫ్రాన్స్‌లోని ముస్లిమ్‌ సమాజానికి, తక్కిన ప్రజలకు మధ్య వైరుధ్యంగా మారుతూ వస్తోంది. ఈ నేపథ్యంలో, 2015 దాడికి సహాయం చేశారనే ఆభియోగంతో 14 మంది మీద విచారణ ప్రారంభం కావడానికి ఒక రోజు ముందు, అదే పత్రిక, తిరిగి అవే కార్టూన్లను సెప్టెంబరులో ప్రచురించింది. ప్రవక్త మీద వ్యంగ్యచిత్రాలను ప్రచురించాలని పాఠకులనుంచి తమకు అనేక అభ్యర్థనలు వచ్చాయని, సరైన సందర్భం కోసం నిరీక్షించి తిరిగి ఇప్పుడు ప్రచురిస్తున్నామని సంపాదకులు వివరణ కూడా ఇచ్చారు. ఆ పత్రిక ధోరణి రెచ్చగొట్టే విధంగా ఉన్నదని తెలుస్తూనే ఉన్నది.


ఇది కాక, తాజాగా, ఆ పత్రిక ముఖచిత్రంగా ప్రచురించిన ఒక కార్టూన్‌ ఇతర దేశాలతో ఉద్రిక్తతలను తెచ్చే వివాదాన్ని రగిలించింది. ఆ కార్టూన్‌లో టర్కీ అధ్యక్షుడు రెసెప్‌ తయ్యిప్‌ ఎర్డొగన్‌ను అర్థనగ్నంగాను, అయనకు సేవలందించడానికి వచ్చిన బురఖా ధరించిన ఒక స్త్రీని అసభ్యమైన రీతిలోనూ చిత్రించి, అభ్యంతరకరమైన వ్యాఖ్యనూ చేర్చారు. దీనికి టర్కీ తీవ్రమైన అభ్యంతరం తెలిపింది. ఫ్రాన్స్‌ వస్తువులను బహిష్కరించాలని పిలుపు ఇచ్చింది. పద్ధతులను మార్చుకోవలసిందిగా మాక్రాన్‌కు హితవు చెప్పాలని ఐరోపా సమాజాన్ని కోరింది. ప్రతిక్రియగా టర్కీనుంచి ఫ్రాన్స్‌ తన రాయబారిని ఉపసంహరించుకుంది. సాధారణంగా తీవ్రమైన భావాలను ప్రకటించని మలేషియా మాజీ ప్రధాని మహతీర్‌ మహమ్మద్‌ కూడా ఫ్రాన్స్‌ తీరును తీవ్రంగా విమర్శించారు. గతంలో ఫ్రాన్స్‌ ముస్లిములను ఊచకోత కోసిందని, ఇప్పుడు ఆ దేశంపై ముస్లిములకు ఆగ్రహం ఉండడం సహజమేనని అన్నారు. 


సామ్యూల్‌ పాటీకి నివాళులర్పించడానికి వచ్చిన ఫ్రెంచి అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్‌ మాక్రాన్‌ తాము ‘‘కార్టూన్లను వదులుకోబోమ’’ని వ్యాఖ్యానించడం వాతావరణాన్ని మరింత వేడెక్కించింది. కార్టూన్లను ప్రచురించే హక్కు గురించిన పునరుద్ఘాటన, అక్కడి ముస్లిములలో మరింత ఆగ్రహాన్ని కలిగించింది. ఫ్రెంచి నగరం నైస్‌లోని ఒక చర్చిలో గురువారం నాడు ఒక దుండగుడు కత్తితో దాడిచేసి ఒక స్త్రీతో సహాముగ్గురిని చంపాడు. ఇప్పుడు ఫ్రాన్స్‌లో హింసాత్మక దాడులకు పాల్పడుతున్నది విదేశీ ఉగ్రవాదులు కారు, అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థలూ కావు. ఫ్రాన్స్‌లోనే ఉంటున్న స్థానిక ముస్లిములలోనే తీవ్రవాద భావాలు పెరుగుతున్నాయి. ఫ్రెంచి ప్రభుత్వం, సమాజం తీరుతెన్నులు కూడా ఆ క్రమానికి దోహదం చేస్తున్నాయి. స్వేచ్ఛాస్వాతంత్ర్యాలకు ప్రతీక వంటి ఫ్రెంచి సమాజంలో తీవ్రమైన విభజన ఏర్పడడం విషాదకరం. 


ఫ్రాన్స్‌కు ఉన్న సామ్రాజ్యవాద గతం కారణంగానే అక్కడ ముస్లిం జనాభా ఉన్నది. మధ్యేవాది అయిన మాక్రాన్‌ తీవ్ర మితవాది అయిన మారిన్‌ లె పెన్‌ అనే మహిళా రాజకీయనేత ప్రాబల్యాన్ని నిరోధించడానికి తాను తీవ్రమితవాదిగా వ్యవహరించవలసి వస్తున్నది. 2022లో జరగబోయే ఎన్నికలలో ముస్లిముల వైఖరి, వారిపై వ్యవహరించవలసిన తీరు– అన్న అంశాలే ప్రభావితం చేయనున్నాయి. అట్లాగే, టర్కీకి, ఫ్రాన్స్‌కు సిరియా దగ్గర నుంచి అనేక ద్వైపాక్షికసమస్యలున్నాయి. ఆధునిక సెక్యులర్‌ దేశంగా ఉండిన టర్కీకి ఎర్డొగన్‌ నేతగా ఎన్నిక కావడమే ప్రపంచంలో పెరిగిపోతున్న మితవాదీకరణకు సూచన.

Updated Date - 2020-10-31T06:11:06+05:30 IST