సెప్టెంబర్‌లో కరోనా స్వైరవిహారం.. ఒక్కనెలలోనే...

ABN , First Publish Date - 2020-10-01T20:35:25+05:30 IST

దేశ వ్యాప్తంగా నమోదైన మొత్తం కొవిడ్-19 పాజిటివ్ కేసుల్లో 41.53 శాతం కేసులు...

సెప్టెంబర్‌లో కరోనా స్వైరవిహారం.. ఒక్కనెలలోనే...

న్యూఢిల్లీ: దేశ వ్యాప్తంగా నమోదైన మొత్తం కొవిడ్-19 పాజిటివ్ కేసుల్లో 41.53 శాతం కేసులు ఒక్క సెప్టెంబర్‌ నెలలోనే నమోదైనట్టు ఓ అధ్యయనంలో వెలుగుచూసింది. ఇప్పటి వరకు దాదాపు 63 లక్షల మందికి పైగా కరోనా వైరస్ సోకినట్టు గుర్తించగా.. ఇందులో 26,21,418 మంది గత నెల రోజుల్లోనే ఇన్ఫెక్షన్ బారిన పడ్డారు. మరోవైపు ఈ మహమ్మారి కారణంగా ఇప్పటి వరకు 98,678 మంది ప్రాణాలు కోల్పోగా.. ఇందులో 33,390 మంది అంటే 33.84 శాతం మంది గడచిన నెలరోజుల్లో మృత్యువాత పడ్డారు. ఇక కరోనా బారి నుంచి బయటపడిన వారి సంఖ్య కూడా దాదాపు ఇదే మాదిరిగా ఉంది. ఇప్పటి వరకు 52,73,201 మంది కరోనా విష కౌగిలి నుంచి బయటపడగా.. కేవలం గత నెలలోనే 24,33,319 మంది అంటే 46.15 శాతం మంది కోలుకున్నారు. ప్రపంచ వ్యాప్తంగా కొవిడ్-19 గణాంకాలపై జాన్ హాప్కిన్స్ యూనివర్సిటీ (జేహెచ్‌యూ) చేస్తున్న అధ్యయనం ప్రకారం.. అత్యధిక రికవరీలు నమోదవుతున్న దేశాల్లో భారత్ నెంబర్ 1 స్థానంలో ఉంది. తర్వాతి స్థానాల్లో అమెరికా, బ్రెజిల్ దేశాలు ఉన్నాయి. కాగా అమెరికా తర్వాత అత్యధిక కరోనా కేసులు నమోదైన దేశాల్లో భారత్ రెండో స్థానంలో ఉంది. అత్యధిక కరోనా మరణాలు నమోదైన దేశాల్లో అమెరికా, బ్రెజిల్ మొదటి రెండు స్థానాల్లో ఉండగా.. భారత్ మూడోస్థానంలో ఉన్నట్టు జేహెచ్‌యూ అధ్యయనం వెల్లడించింది.


భారత్‌లో ఆగస్టు 7 నాటికి కరోనా పాజిటివ్ కేసులు 20 లక్షల మార్కు దాటగా... ఆగస్టు 23 నాటికి 30 లక్షలు, సెప్టెంబర్ 5 నాటికి 40 లక్షలకు చేరుకున్నాయి. సెప్టెంబర్ 15 నాటికి దేశంలో కొవిడ్-19 కేసుల సంఖ్య 50 లక్షలు దాటగా.. గతనెల 28 కల్లా వైరస్ బాధితుల సంఖ్య 60 లక్షలకు పెరిగింది. లక్ష కరోనా కేసులు నమోదయ్యేందుకు 110 రోజులు పట్టగా.. ఆ తర్వాత 59 రోజులకే కేసుల సంఖ్య 10 లక్షలు దాటింది. 10 లక్షల నుంచి 20 లక్షలకు చేరేందుకు 21 రోజులు పట్టగా, ఆ తర్వాత 16 రోజులకు 30 లక్షల కేసులు నమోదయ్యాయి. మరుసటి 13 రోజుల్లో కొవిడ్ బాధితుల సంఖ్య 40 లక్షలకు చేరగా.. మరో 11 రోజుల్లో 50 లక్షలకు, తర్వాత 12 రోజుల్లో 60 లక్షలకు కరోనా కేసులు ఎగబాకాయి. కేంద్ర ఆరోగ్య శాఖ ఇవాళ ఉదయం 8 గంటలకు వెల్లడించిన గణాంకాల ప్రకారం.. దేశంలో ఇప్పటి వరకు 63,12,584  మంది కరోనా బారిన పడగా... 52,73,201 మంది కోలుకుని ఇళ్లకు వెళ్లారు. రికవరీ రేటు 83.53 శాతంగా ఉంది. ఈ మహమ్మారి కారణంగా ఇప్పటి వరకు దేశంలో 98,678 మంది మృత్యువాత పడ్డారు. 

Updated Date - 2020-10-01T20:35:25+05:30 IST