Abn logo
Nov 28 2020 @ 00:17AM

సీక్వెల్స్‌ సందడి

కొన్ని చిత్రాలు విడుదలయ్యాక  ప్రేక్షకుల మనసులపై చెరగని ముద్రవేస్తాయి. కథ, కధనం..  ఆసక్తిని రేకెత్తిస్తాయి. వీటికి సీక్వెల్‌ వస్తే బాగుంటుందని అనిపిస్తాయి. ప్రేక్షకాదరణ పొందిన చిత్రాలకు సీక్వెల్స్‌ తయారుకావడం ఇప్పుడు కొత్త ట్రెండ్‌ అయింది. ప్రస్తుతం తెలుగు సహా  తమిళ, మలయాళ, హిందీ భాషల్లో పలు హిట్‌ చిత్రాలకు సీక్వెల్స్‌ వస్తున్నాయి. కథలో కొద్దిపాటి మార్పులతో మళ్లీ  ప్రేక్షకుల్ని అలరించడానికి సిద్ధమవుతున్నాయి. ప్రస్తుతం ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచుతోన్న సీక్వెల్‌ చిత్రాలపై ఓ లుక్‌ వేద్దాం!


ఎఫ్‌ 3

గతేడాది సంక్రాంతి బరిలో బంపర్‌హిట్‌గా నిలిచింది ‘ఎఫ్‌ 2 ( ఫన్‌ అండ్‌ ఫ్రస్టేషన్‌’) చిత్రం. వరుస విజయాలతో మంచి దూకుడు మీదున్న  అనిల్‌ రావిపూడి ఈ చిత్రానికి దర్శకుడు. వెంకటేశ్‌, వరుణ్‌తేజ్‌, తమన్నా, మెహ్రీన్‌లు కీలకపాత్ర పోషించారు. ఇందులో కథకన్నా కథనం మీద దర్శకుడు చూపిన శ్రద్ధ మంచి ఫలితాలు ఇచ్చింది.  ‘కోబ్రా.. కోబ్రా2 (కో బ్రదర్‌) అంటూ  వెంకటేశ్‌, వరుణ్‌ తేజ్‌  పండించిన హాస్యం ప్రేక్షకులను బాగా ఎంటర్‌టైన్‌ చేసింది. ‘ఎఫ్‌ 2’ గతేడాది సంక్రాంతి హిట్‌గా నిలిచింది. ఉత్తమ చిత్రంగా జాతీయ చలనచిత్ర పురస్కారం  పొందింది. ఆ విజయం ఇచ్చిన ఊపుతో దర్శకుడు అనిల్‌ రావిపూడి ‘ఎఫ్‌ 3’ పేరుతో త్వరలో  సీక్వెల్‌ను ప్రారంభించనున్నారు.  స్ర్కిప్ట్‌ దశలో ఉన్న ఈ చిత్రం  త్వరలో సెట్స్‌పైకి వెళ్లనుంది.

 

ఢీ అంటే ఢీ

దర్శకుడు శ్రీను వైట్ల మార్క్‌ కామెడీ ఎంటర్‌టైనర్‌కు మచ్చుతునక ‘ఢీ’ చిత్రం. మంచువిష్ణు, శ్రీహరి, జెనీలియా, బ్రహ్మానందం, సునీల్‌, జయప్రకాశ్‌రెడ్డి కీలకపాత్రల్లో నటించారు.  ప్రేక్షకులకు మంచి వినోదాన్ని పంచడమే కాదు  కామెడీ చిత్రాలకు కొత్త ఒరవడి ఏర్పరచిన సినిమా ఇది.  13 ఏళ్ల తర్వాత మళ్లీ ఇప్పుడు  ఈ చిత్రానికి సీక్వెల్‌ తయారు కానుంది.  ‘ఢీ అంటే ఢీ’... డబుల్‌ డోస్‌’ అంటూ పోస్టర్‌ను ఇటీవల  విడుదల చేశారు. ‘ఢీ’ తో పోల్చితే సీక్వెల్‌లో కామెడీ, యాక్షన్‌ రెండింతలు ఉంటాయని చెపుతున్నారు.  మంచు విష్ణు హీరోగా నటిస్తూ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. 


కార్తికేయ

 మిస్టరీ థ్రిల్లర్‌ కథాంశంతో 2014లో  వచ్చిన నిఖిల్‌ ‘కార్తికేయ’ మూవీ మంచి విజయం సాఽధించింది. 5 వేల ఏళ్లకు పూర్వం జరిగిన సంఘటనలు, ఆ మిస్టరీని పరిష్కరించడానికి హీరో చేసే ప్రయత్నాల నేపథ్యంలో కథ నడుస్తుంది. చందు మొండేటి ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. తొలిభాగంలో నిఖిల్‌ మెడికల్‌ స్టూడెంట్‌ పాత్రను పోషించారు. సీక్వెల్‌లో డాక్టర్‌ పాత్రను పోషిస్తున్నాడు. రెండో చిత్రానికి కూడా చందు మొండేటి దర్శకత్వం వహిస్తున్నారు.  మొదటి భాగం పూర్తయిన చోట నుంచి రెండో భాగం మొదలవుతుంది. కుంభమేళా నేపథ్యంలో చిత్రకథ సాగుతుంది. ఈ చిత్రాన్ని తెలుగులో నిర్మించి హిందీ, తమిళ, మలయాళ భాషల్లో డబ్‌ చేసి విడుదల చేస్తామని నిర్మాతలు  తెలిపారు. ఈ చిత్రంలో నిఖిల్‌ సిక్స్‌ప్యాక్‌లో కనిపిస్తారని సమాచారం. ఈపాటికే ఈ చిత్రం ప్రారంభం కావాల్సి ఉన్నా కరోనా కారణంగా కొన్ని నెలల పాటు ప్రాజెక్ట్‌ వాయిదా వేస్తున్నట్లు దర్శకుడు చెప్పారు.  


హిట్‌ః ద ఫస్ట్‌ కేస్‌

ఈ ఏడాది విడుదలైన ‘హిట్‌’ మూవీతో హీరో విశ్వక్‌సేన్‌, దర్శకుడు శైలేశ్‌ కొలను, నిర్మాతగా నాని...  ముగ్గురూ హిట్‌కొట్టారు. వసూళ్ల పరంగానూ ఫర్వాలేదనిపించింది.  సినిమా చివర్లో  సీక్వెల్‌ ఉంటుందని క్లూ ఇచ్చారు. దర్శకుడు శైలేశ్‌ లాక్‌డౌన్‌ సమయంలో హిట్‌ సీక్వెల్‌కు స్రిప్ట్‌ను రెడీ చేసినట్టు చెప్పారు. ఇంక ఈ సినిమా సెట్స్‌ పైకి వెళ్లడమే తరువాయి. మరో పక్క ఇదే చిత్రాన్ని రాజ్‌కుమార్‌ రావు హీరోగా దిల్‌రాజు, కుల్‌దీప్‌ రాథోడ్‌ సంయుక్తంగా హిందీలో రీమేక్‌ చేస్తున్నారు. అక్కడ వచ్చే ఏడాది ఈ చిత్రం సెట్స్‌పైకి వెళుతుంది.  ‘హిట్‌’ హిందీ రీమేక్‌ను కూడా శైలేశ్‌  డైరెక్ట్‌ చేస్తున్నారు. 


భారతీయుడు 2

చాలాకాలంగా ‘భారతీయుడు’ సినిమా సీక్వెల్‌ గురించి చెబుతున్నారు దర ్శకుడు శంకర్‌. దాదాపు 24 ఏళ్ల తర్వాత ఇప్పుడు మళ్లీ  ‘భారతీయుడు 2’  పేరుతో  ఆ చిత్రానికి సీక్వెల్‌ రూపుదిద్దుకుంటోంది.  అవినీతి పరుల భరతం పట్టే సేనాపతి పాత్రలో కమల్‌ నటన అప్పట్లో అందరినీ ఆకట్టుకుంది. ఇప్పుడు సీక్వెల్‌ను లైకా ప్రొడక్షన్‌ భారీ ఎత్తున నిర్మిస్తోంది. దాదాపు సగం షూటింగ్‌ పూర్తయ్యాక లాక్‌డౌన్‌తో షూటింగ్‌  నిలిచిపోయింది. కాజల్‌ అగర్వాల్‌, రకుల్‌ ప్రీత్‌సింగ్‌, సిద్ధార్థ్‌ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. వచ్చే ఏడాది జనవరి నుంచి భారతీయుడు 2 షూటింగ్‌లో కమల్‌ పాల్గొంటారని సమాచారం. 


కేజీఎఫ్‌ 2

ఈ మధ్య కాలంలో వచ్చిన చిత్రాల్లో హీరోయిజాన్ని బాగా ఎలివేట్‌ చేసిన చిత్రం కేజీఎఫ్‌. కోలార్‌ గోల్డ్‌ ఫీల్డ్స్‌పై ఆధిపత్యం కోసం జరిగే పోరు నేపథ్యంలో కథ సాగుతుంది. అక్కడ జరిగే అన్యాయాన్ని ఎదుర్కొని సామాన్యుల పక్షాన నిలిచే నాయకుడు రాఖీ బాయ్‌గా యశ్‌ ఈ సినిమాతో ప్యాన్‌   ఇండియా హీరోగా   ఎదిగారు. ‘కేజీఎఫ్‌’   సూపర్‌ హిట్‌ కావడంతో నిర్మాత విజయ కిర్గందూర్‌ ‘కేజీఎఫ్‌ 2’ ను  మరింత భారీగా నిర్మిస్తున్నారు.  ప్రకాశ్‌రాజ్‌, సంజయ్‌దత్‌లాంటి నటులతో సీక్వెల్‌కు మరింత స్టార్‌ డమ్‌ వచ్చింది. కేజీఎఫ్‌ దర్శకుడు ప్రశాంత్‌ నీల్‌ సీక్వెల్‌కు దర్శకత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం ‘కేజీఎఫ్‌ ఛాప్టర్‌ 2’  షూటింగ్‌ హైదరాబాద్‌లో జరుగుతోంది.


మలయాళ సీక్వెల్స్‌

చక్కటి కథ, కథనాలతో గొప్ప విజయం అందుకున్న మలయాళ చిత్రం ‘దృశ్యం’. మోహన్‌లాల్‌, మీనా జంటగా వస్తోన్న సీక్వెల్‌ ‘దృశ్యం 2’. షూటింగ్‌ పూర్తయింది.  పోస్ట్‌ ప్రొడక్షన్‌ వర్క్‌ జరుగుతోంది.  మమ్ముట్టి ‘సీబీఐ’, మోహన్‌లాల్‌ ‘యోధా’ చిత్రాలకు సీక్వెల్స్‌ వస్తున్నాయి.


తమిళసీక్వెల్స్‌ 

తమిళంలో సుందర్‌  సి దర్శకత్వంలో ఆర్య, రాశీఖన్నా జంటగా ‘ఆరణ్మణై’ చిత్రానికి మూడో భాగం తెరకెక్కుతోంది అలాగే . వాసు దర్శకత్వంలో రాఘవ లారెన్స్‌ హీరోగా చంద్రముఖి చిత్రానికి సీక్వెల్‌ వస్తోంది. ప్రముఖ దర్శకుడు మణిరత్నం తన భారీ బడ్జెట్‌ చిత్రం ‘పొన్నియిన్‌ సెల్వన్‌’ను మూడు భాగాలుగా తెరకెక్కిస్తున్నారట. వెట్రిమారన్‌ దర్శకత్వంలో ధనుశ్‌ కథానాయకుడుగా ‘వాడా చెన్నై2’ వస్తోంది. 


హిందీ సీక్వెల్స్‌ 

జాన్‌ అబ్రహం ‘సత్యమేవ జయతే 2’, హృతిక్‌రోషన్‌ ‘క్రిష్‌ 4’, సంజయ్‌దత్‌ ‘మున్నాభాయ్‌ 3’, సల్మాన్‌ఖాన్‌ ‘కిక్‌ 2’, కార్తిక్‌ ఆర్యన్‌ ‘భూల్‌ భూలయ్య’,  ‘ప్యార్‌కా పంచనామా’, ‘హేరా ఫేరీ 3’, ‘హంగామా 2’ తదితర సీక్వెల్‌ చిత్రాలు వివిధ దశల్లో ఉన్నాయి. 

Advertisement
Advertisement
Advertisement