సీరియల్‌ కన్నీళ్లు

ABN , First Publish Date - 2020-05-21T10:37:43+05:30 IST

వెండి తెర... బుల్లితెర... సైజులో తేడా ఉన్నా, కరోనా కష్టాలు రెండిటికీ ఒకటే! సినిమాలంత క్రేజున్న సీరియల్స్‌ షూటింగ్‌ ఆగి, ఇవాళ్టికి రెండు నెలలు.

సీరియల్‌ కన్నీళ్లు

షూటింగ్‌ ఆగి రెండు నెలలు  

1200 కోట్ల మార్కెట్‌

30 శాతం కరోనా నష్టం 

7 వేల మందికి ఉపాధి కష్టం


వెండి తెర... బుల్లితెర... సైజులో తేడా ఉన్నా, కరోనా కష్టాలు రెండిటికీ ఒకటే! సినిమాలంత క్రేజున్న సీరియల్స్‌ షూటింగ్‌ ఆగి, ఇవాళ్టికి రెండు నెలలు. పాత రిపీట్లు, సినిమాలతో  వినోద ఛానళ్ళు  నెట్టుకొస్తుంటే, 7 వేల మంది టీవీ 

శ్రామికులు ఆదుకొనేవారు లేక అలమటిస్తున్నారు.


 ఓ టీవీ నటుడి ఆత్మహత్య దేశవ్యాప్త స్థితికి పరాకాష్ఠ. 

చేతిలో పని లేదు. కిస్తీలు కట్టలేదు. 2 నెలలుగా ఇంటి అద్దె చెల్లించలేదు. నిరాశలో కూరుకుపోయి ఉత్తరాది టీవీ నటుడు మన్మీత్‌ గ్రేవల్‌ ఉరిపోసుకొని, ప్రాణాలు తీసుకున్నారు. తెరపై కామెడీ చేసే యువకుడి జీవితం ట్రాజెడీగా ముగిసింది. స్థలం మార్పే కానీ, మన తెలుగు టీవీ కార్మికుల పరిస్థితీ దాదాపు ఇదే! తెలుగులో ప్రధానమైన నాలుగు ప్రైవేటు జనరల్‌ ఎంటర్‌టైన్మెంట్‌ ఛానళ్ళు (స్టార్‌ మా, జీ, జెమినీ, ఈ టీవీ), అలాగే దూరదర్శన్‌తో కలిపి దాదాపు 60 డైలీ సీరియళ్ళు (ఫిక్షన్‌), 20 షోలు (నాన్‌ ఫిక్షన్‌) నడుస్తున్నాయి. శ్రామికుల సంఖ్య, యాక్టర్లు, టెక్నీషియన్లను లెక్కిస్తే 7 వేల మంది వరకు ఉంటారు. మార్చి 20 నుంచి టీవీ షూటింగులు ఆపేయడంతో, రెండునెలలుగా ఇంత మంది, తమ కుటుంబాలతో సహా వీధినపడ్డారు. 


ఖజానాకు 216కోట్లఆదాయం ఉన్నా... 

తెలుగు వినోద ఛానళ్ళ మార్కెట్‌ ఏడాదికి సుమారు రూ. 1200 కోట్లని ఓ లెక్క. దానిలో 18 శాతం జి.ఎ్‌స.టి. వంతున రూ. 216 కోట్ల దాకా పన్ను తెలుగు టీవీ పరిశ్రమ నుంచి ప్రభుత్వ ఖజానాకు చేరుతోంది. ‘‘కోట్లలో ఆదాయం, కోట్లాది జనానికి వినోదం పంచే సినీ, టీవీ రంగాలకు ప్రభుత్వాలు తమ ప్యాకేజీల్లో పైసా రాయితీ ఇవ్వలేదు. ఇది బాధాకరం’’ అని 23 సీరియల్స్‌ నిర్మించిన పాతికేళ్ళ టీవీ రంగ అనుభవజ్ఞుడు- ‘తెలుగు టెలివిజన్‌ ప్రొడ్యూసర్స్‌ కౌన్సిల్‌’ ఇ.సి. సభ్యుడు నలజాల అశోక్‌ అన్నారు. 


ముందే తెలిసి... పాత రిపీట్లు, కొత్త సినిమాలు!

కరోనా కేసులు వెల్లడవుతున్న నేపథ్యంలో జాగ్రత్తలు తీసుకోవాలంటూ, జనతా కర్ఫ్యూకన్నా పది రోజుల ముందే కేంద్రం నుంచి సినీ ప్రముఖులకూ, కార్పొరేట్‌ టీవీ ఛానల్‌ యాజమాన్యాలకూ ఉప్పందింది. దాంతో, అన్ని టీవీ ఛానళ్ళ పెద్ద తలకాయలూ ఒక సమష్టి నిర్ణయానికి వచ్చాయి. మార్చి 30 నుంచి పాత సీరియల్స్‌, షోలు, ఈవెంట్ల రిపీట్లతో టైమ్‌ స్లాట్లను నింపుతున్నాయి. ప్రసారానికి సాఫ్ట్‌వేర్‌ లేక ఛానళ్ళు తలకిందులవుతుంటే, కొత్త చిత్రీకరణలు లేక వర్కర్లు ఆకలితో అలమటిస్తున్నారు. 


ఈ కష్టకాలంలో టీవీ పరిశ్రమలోని వారు అందిస్తున్న కొద్దిపాటి సాయమే కార్మికులకు దక్కింది. వివిధ ఛానళ్ళు, సీరియళ్ళ నిర్మాతలు కలసి రూ. 30 లక్షలు పోగు చేసి, రెండున్నర వేల మంది కార్మికులకు సాయం చేశారు. ‘స్టార్‌ మా’ తమ వద్ద పనిచేసే శ్రామికుల కుటుంబాలకు రూ. 50 లక్షల పైగా ఆర్థిక సాయం చేసింది. అయితే, ‘‘మేము ఎంత చేసినా తరగని కష్టంలో డైలీ కార్మికులు ఉన్నారు. రోజూ కష్టపడి, కనీసం ఆరేడొందలు సంపాదించే లైట్‌ బాయ్‌ నుంచి ఆరు వేల దాకా వచ్చే రైటర్‌, డైరెక్టర్ల దాకా అందరూ చేతిలో పని లేక అప్పుల్లో పడ్డారు’’ అని తాజా హిట్‌ సీరియల్‌ ‘కార్తీకదీపం’ నిర్మాత గుత్తా వెంకటేశ్వరరావు ఆవేదన వ్యక్తం చేశారు.


కరోనాతో మారిన వ్యూహం...

తగ్గిపోతున్న వాణిజ్య ప్రకటనల మధ్య టి.ఆర్‌.పి.లు నిలుపుకోవడానికి జీ, స్టార్‌మా లాంటి ఛానళ్ళు స్కైప్‌, జూమ్‌లాంటి వీడియో కాలింగ్‌, మీటింగ్‌ యాప్‌ల ద్వారా తారల ఇంటి పనులు, ఇంటర్వ్యూలతో సరదా కార్యక్రమాలు చేస్తున్నాయి. ‘బిగ్‌ బాస్‌’ తదుపరి సీజన్‌కు సన్నాహాలూ చేస్తున్నట్టు వినికిడి. అలాగే, గతంలో రేటు దగ్గరో, కంటెంట్‌ దగ్గరో ఇబ్బందితో వద్దనుకున్న చిన్నాచితకా కొత్త సినిమాలను సైతం టైమ్‌ ఫిల్లింగ్‌ కోసం టీవీ ఛానళ్ళు ఇప్పుడు జోరుగా కొంటున్నాయి. ఒక్క ‘స్టార్‌ మా’ టీవీయే గత రెండునెలల్లో 15 కొత్త సినిమాలు కొనుగోలు చేసింది. ‘‘హింస, శృంగారం మోతాదు మించి ఉన్నాయని గతంలో తటపటాయించిన సినిమాలను కూడా ఇప్పుడు కొని, తగిన కత్తిరింపులతో టీవీకి ప్రసారయోగ్యమయ్యేలా సెన్సార్‌ చేయించి టెలికాస్ట్‌ చేస్తున్నారు’’ అని ఒక ఛానల్‌ ప్రతినిధి వివరించారు. ఈ పరిస్థితుల్లో టీవీ షూటింగులకు వీలైనంత త్వరగా అనుమతి ఇవ్వాలంటూ ప్రతినిధులు మే 2వ తేదీ తెలంగాణలో మంత్రి తలసానిని కలిసి, విజ్ఞప్తి చేశారు. అయితే, పరిస్థితులను బట్టి వెంటనే గ్రీన్‌ సిగ్నల్‌ వచ్చేలా లేదు. వచ్చినా మాస్కులు, శానిటైజర్లు, ఆహారం, బస, రవాణా వసతుల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, అయ్యే అదనపు ఖర్చు నిర్మాతల గుండెల్లో రైళ్ళు పరిగెత్తిస్తోంది.


ఇప్పటికే కరోనా వల్ల ఈ ఏడాది తెలుగు వినోద టీవీ మార్కెట్‌ 30 శాతం నష్టపోతుందని అంచనా. ‘‘తెలుగులో ప్రధాన వినోద టీవీ ఛానళ్ళ యాడ్‌ రెవెన్యూ ఒకప్పుడు నెలకు దాదాపు రూ. 600 కోట్లుండేది. ఇప్పుడు కరోనా వల్ల అంతా కలిపి రూ.50 కోట్లు కూడా ఉండి ఉండదు’’ అని సినీ, టీవీ ప్రముఖుడు ‘జెమినీ’ కిరణ్‌ ‘ఆంధ్రజ్యోతి’కి తెలిపారు. దానాదీనా వందల కొద్దీ ఎపిసోడ్లతో, ఏళ్ళ తరబడి వీక్షకులకు వినోదం పంచుతున్న టీవీ పరిశ్రమ, ముఖ్యంగా కార్మికలోకం ఇప్పుడు సీరియల్‌ కష్టాలతో కన్నీరుపెడుతోంది. కానీ, ప్యాకేజీల ప్రభుత్వానికే ఏదీ పట్టినట్టు లేదు. 


-డాక్టర్ రెంటాల జయదేవ(నవ్యడెస్క్)

Updated Date - 2020-05-21T10:37:43+05:30 IST